‘‘ఎవరిదోయ్‌ పెళ్లీ?!’’ అన్నాడు అప్పుడే ఇంట్లోకి ప్రవేశించిన భార్గవ. సోఫాలో కూర్చుని శుభలేఖను విప్పి పట్టుకుని దీక్షగా చూస్తోన్న భార్యతో.చేతిలోని శుభలేఖను మడిచి కవర్‌లో ఉంచుతూ ‘‘ఈరోజు త్వరగానే వచ్చేశారే... రోజూ ఇలానే వస్తే ఎంత బావుంటుంది?’’ అంటూ నవ్వు మొహంతో ఎదురేగి అతడి చేతిని నొక్కి వదిలింది వరూధిని.‘‘రోజూ ఇలానేవస్తే ఇహ రోజూ ఆఫీస్‌కు వెళ్లే పని కూడా ఉండదు. చాలాకాలం తర్వాత ఈ రోజు ఎందుకో కొంచెం ఖాళీ దొరికింది. ఇంతకూ ఆ శుభలేఖ కథేవిటో నువ్వు చెప్పనేలేదు’’ అన్నాడు భార్గవ.‘‘మన పెళ్లిలో నానాహడావుడి చేసిన కొంటెకోణంగి మధుబాల గుర్తిందిగా మీకు?! తన చెల్లెలి పెళ్లి ఈ నెల అయిదో తారీకున. శుభ లేఖతో పాటు ఉత్తరం కూడా వ్రాసింది మిమ్మల్ని తప్పకుండా తీసుకు రమ్మని’’ అంది వరూధిని ఆశగా అతడి కళ్లలోకి చూస్తూ.‘‘అయిదో తారీకా? ఊహుఁ... సారెవరూ.. ఈ ఉద్యోగం మానేయాలనే నిర్ణయం తీసుకుంటే తప్ప ఆ పెళ్లికి రాలేను’’ అన్నాడు భార్గవ నవ్వుతూ.‘‘మానేయండి వెధవ ఉద్యోగం... ఇదికాకపోతే మరోహటి... మీరు చదివిన చదువుకు మనం కడుపు నిండా తిని, కంటినిండా నిద్రపోయే ఉద్యోగం దొరకదా ఏఁవిటి?’’ అంది వరూధిని బుంగమూతి పెడుతూ.‘‘అటువంటి ఆశలేం పెట్టేకోకు! ఆ రోజులు పోయాయి. హఠాత్తుగా ఉద్యో గం పోతే... నాలుగురోడ్ల కూడలిలో మిరపకాయ బజ్జీల బండి పెట్టుకుని ఏ రోజు తిండి ఆ రోజు సంపాదించుకోవాల్సిందే!’’ అన్నాడు భార్గవ, వరూధినిని ఆటపట్టిస్తూ.

‘‘అదే నిజమైతే నేను మీకు విడాకులిచ్చి... పెళ్లికి ముందు నాకు ప్రేమ లేఖ రాసిన అందగాడితో హుష్‌కాకి అయిపోతాను రేపే... సరేనా?!’’ అంది వరూధిని అల్లరిగా.‘‘నీకు నా శుభాశీస్సులు! అయిదు నిముషాలు సమయమిస్తే బట్టలు మార్చుకుని వచ్చి నీ ప్రయాణానికి బట్టలు సర్దిపెడతాడను. రేపు ఉదయం ఫస్ట్‌ బస్‌కేనా నీ ప్రయాణం?’’ అన్నాడు భార్గవ అదేదో మామూలు విషయంలా.‘‘ఛా... ఇంత పౌరుషం లేదేఁవిటండీ మీకు? సరదాకైనా ఇదేమాట ఏ పెళ్లామైనా అంటే చేవ ఉన్న మగాడు చావగొట్టి చెవులు మూసి గదిలో పెట్టి తాళం వేస్తాడు. మీరేఁవిటీ మరీ ఇంత చీమూ, నెత్తూరు లేని మనిషిలా!’’ అంది వరూధిని చిరుకోపంగా.‘‘నువ్వు మనసుపడిన వ్యక్తితో శేషజీవితం గడుపుతానని నువ్వు వ్రాకుచ్చాక నిన్ను ప్రాణాతిప్రాణంగా ప్రేమించే నేను, నీ కోరికను తీర్చేందుకు ఆ మాత్రం సాయపడకపోతే ఎటువంటి ప్రేమికుణ్ణి?!’’ అన్నాడు భార్గవ కంఠంలోకి బరువును ఎరువు తెచ్చుకుంటూ.అతడి చొక్కాపట్టుకుని దగ్గరకు లాక్కుని అతడి ఛాతీమీద పిడికిళ్లతో గుద్దుతూ, ‘‘ఇంతమంచి మొగుణ్ణి భరించడం చాలా... చాలాకష్టం!’’ అని ‘‘మీ ఆఫీసు యాజమాన్యానికి ఏదో మస్కాకొట్టి నాతో పెళ్లికి రారూ... ఊహుఁ నన్ను పెళ్లికి తీసుకు వెళ్లరూ?’’ అంది వరూధిని గారాలు పోతూ.