కావ్‌.... కావ్‌... కావ్‌’’... టెంకాయ చెట్టు మట్టపైన కూర్చొని ‘కాకి’ అరచింది. ఇంటి ముందుర మంచం మీద కూర్చున్న వెంకట్రాదికి ఆ అరుపు పిలుపులా వినిపించింది.‘‘నీది ఎంత అదృష్టమే కాకమ్మా! మాట్లాడుతుండావూ?’’ అని కాకిని పలకరించాడు. కాకి అరుపు అలాగే కొనసాగటంతో ఇంట్లో వంట చేస్తున్న సుకన్య చేతిలో ఉన్న గరిటెను అట్లేపట్టుకొని బయటికి దూసుకొని వచ్చింది.‘‘హేయ్‌... హేయ్‌... ఉస్‌.. ఉస్‌... పీడ... పీడ. ఇంత ఉదయమే దీనికేమొచ్చిందో! చావు అరువు అరుస్తోంది. గోల గోల చేస్తోంది’’ అంటూ కాకినిఅదిలించింది.సుకన్య మాటలకు కాకి బెదరలేదు. అదరలేదు. అరుపు ఆపలేదు. సన్నగా, నున్నగా ఉన్న మెడను గుండ్రంగా తిప్పుతూ, ముందుకూ వెనక్కీ మెడ చాపుతూ గరిటి మీద అతుక్కొని ఉన్న మెతుకుల వైపు చూసింది. కావ్‌... కావ్‌ మాటను కొనసాగించింది.‘‘తూ.... తూ! దర్రిదం... దరిద్రం. ఇది మీదికి ఎక్కడ వస్తుందో!’’ అనుకుంటూ చేతిలో ఉన్న గరి టెను క్రిందపెట్టి ప్రహరీగోడకు ఆనుకొని ఉన్న బూజు దులిపే కట్టె తీసుకొని కాకిని అదిలించింది. మనుషుల మధ్యనే తిరిగే కాకికి ఆ అదిలింపు కొత్తేమీ అనిపించలేదు. నేల మీద రాలిన మెతుకుల వైపు ఆశగా చూస్తూ అట్టే అరిచింది.‘‘ఈ కాకులు మిలటరీలో చేరితో సైనికులకు తుపాకీలతో పని ఉండదు. వీటి అరుపులు విని శత్రువులు భయంతో పారిపోతారు.

 కర్రను కూడా లెక్క చెయ్యకుండా నా వైపు ఎలా చూస్తోందో చూడు’’ అంటూ చేతిలో ఉన్న కట్టెను క్రింద పడేసి, పూలకుండీ దగ్గర ఉన్న గులకరాయి తీసుకొని విసిరింది. చూసింది కాకి. కూర్చున్నచోట విడచి ఇంకొక ‘మట్ట’ పైకి ఎగిరి కూర్చుంది. ‘గురి’ తప్పించుకుంది.‘‘ఏంటికి కొడతావులేమ్మా. అదే పోతుంది గానీ. యా ఊరి కాకో! ఈ ఊరి కొచ్చింది. పాపం. ఆకలైతాండాదేమో! అరత్తా ఉండాది’’ - అన్నాడు వెంకటాద్రి.‘‘ఈ కాకిని నువ్వే పెంచినట్లు మాట్లాడుతున్నావే! దాని అరుపు నీకు రోత అనిపించలేదా? సంగీతం లాగా వినిపిస్తోందా?’’ - కాకి మీద కోపాన్ని వెంకటాద్రి మీద చూపింది సుకన్య.‘‘నేను పెంచకపోయినా! అది ఏంటికి అరుత్తాందో తెలుసు తల్లీ. ఒక కాకి అరిత్తే .... తోటి కాకులన్నీ అడుగుతాయి. ఏమి కట్ట మొచ్చిందీ? అని ‘గూడు’ నుంచి కాకిపిల్ల జారి కింద పడితే... కాకులన్నీ ఆ పిల్ల చుట్టూ చేరుతాయి. నొప్పి తగిలిందా? అని అడుగుతాయి. కలిసి మెలిసి బతక టానికీ, కట్టసుఖాలు పంచుకోవటానికీ కాకులు సరతుగా కనిపిత్తాయి తల్లీ’’ - తన మనసుకు కలిగిన కష్టాన్ని నర్మ గర్భంగా చెప్పాడు వెంకటాద్రి. కాకి అరుపులకు వెంకటాద్రి చెప్పిన వివరణ సుకన్యకు చిర్రెత్తించింది.