ప్రభాతవేళ, మంచు విపరీతంగా కురుస్తుండడంతో దూరంగా ఏదీ కనిపించడంలేదు. రవి కిరణాలు పుడమిని ముద్దాడాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయి. ఏపుగా పెరిగిన పొడవైన సిల్వర్‌ ఓక్‌ వృక్షాలు, వాటిమధ్య తలలో పాపిడిలా సన్నపాటి దారి, ఎక్కడ చూసినా కొండలే... శేఖరానికి కొండల మధ్య, లోయల్లో ప్రయాణం కొత్తగా వుంది. అతనికి ముందు కొద్ది దూరంలో వడివడిగా నడుస్తూ ప్రకాశం; శేఖరం ఆలోచిస్తున్నాడు - తను చదువు పూర్తయిన తరువాత ఒక ప్రముఖ జాతీయ పక్షపత్రికలో జర్నలిస్టుగా చేరడం, వెనువెంటనే పోలీసులకు, నక్సలైట్లకు మధ్య నలుగుతున్న గిరిజనులపై ఒక పరిశోధనాత్మక వ్యాసం వ్రాయాలని కోరితే పదిహేను రోజులపాటు చింతపల్లి, పాడేరు, అరకు ప్రాంతాల్లో పర్యటించాలని చింతపల్లి వచ్చాడు.ఈ ప్రాంతాలన్నీ తనకు పూర్తిగా కొత్తయినా అదృష్టవశాత్తు బస్సులో చింతపల్లికి దగ్గర్లోనే పనిచేస్తున్న టీచర్‌ ప్రకాశంతో పరిచయం కావడం, అతనికి తన పని గురించి చెబితే తనకి ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా ఆ చుట్టుపక్కల తండాలన్నీ చూపిస్తానని ముందుకొచ్చాడు. ప్రకాశం ట్రైబల్‌ తండాలన్నీ చూపిస్తానని ముందుకొచ్చాడు. ప్రకాశం ట్రైబల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌లో టీచరుగా పది సంవత్సరాల నుంచి పనిచేస్తుండడంతో ఆ ప్రాంతం అతనికి కొట్టిన పిండి. అందుకే మొదటిరోజు ప్రకాశం పనిచేస్తున్న మర్రిగూడ చూడాలని ఉదయాన్నే బయలుదేరారు.మర్రిగూడ ఒక చిన్న గిరిజన పల్లె. కొండమీద ఉంది. అది చింతపల్లికి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో వుంది. దారి మాత్రం చాలా భయంగా ఉంటుంది.

 ప్రకాశం వడివడిగానే నడుస్తున్నా శేఖరం మాత్రం ఆపసోపాలు పడుతున్నాడు. కాసేపు ఓ చెట్టుకింద కూర్చుని సేదతీర్చుకుంటూ మాట్లాడుకోసాగారు. ముందు శేఖరమే అడిగాడు -‘‘ఈ పల్లెలన్నిటికీ సరైన రోడ్లు లేవా? బస్సు సౌకర్యం లేక వీళ్లందరూ ఇలా బాధపడవలసిందేనా?’’‘‘పదేళ్ల క్రితం వరకు ఆర్టీసి వారు చాలా ఊళ్లకు మెటల్‌ రోడ్ల మీదే బస్సులు నడిపారు. కానీ ఒకసారి నక్సలైట్లు ఓ బస్సును పేల్చేయడంతో పోలీసులతో సహా నలభైమంది గిరిజనులు చనిపోయారు. అప్పటినుంచి అన్ని బస్సులు చింతపల్లి వరకే. అదికూడా ఉదయం వేళల్లోనే నడుపుతున్నారు.’’‘‘ఏమిటో ఈ నక్సలైట్ల ఐడియాలజీ. ఓపక్క గిరిజనుల సంక్షేమం కోసమే పోరాడుతున్నామంటారు. మరోపక్క ఇలాంటి విధ్వంసం. దీనివల్ల ఈ ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయి?’’ ఆవేశంగా అడిగాడు శేఖరం.‘‘అభివృద్ధి అన్నది ఉట్టిదేనండీ; నక్సలైట్లు వాళ్ల ఉనికిని కాపాడుకునేందుకు ఇలాంటి పనులు చేస్తుంటారు. పోలీసులు ఎన్‌కౌంటర్లు చేసి వాళ్ల ఆధిపత్యాన్ని చాటుకుంటుంటారు. మధ్యలో నలిగిపోయేది అమాయకులైన గిరిజనులు, మాలాంటి ఉద్యోగులే’’ నిర్లిప్తంగా అన్నాడు ప్రకాశం.