రేపు శుక్రవారం. సెలవురోజు.మా వూరి మట్టివాసన గుబాళింపు మా గుండెలను ఉక్కిరి బిక్కిరి చేసేరోజు. గంటన్నర కింద మా వూరి మట్టిని, మా తల్లుల ఆప్యాయతను, మా భార్యల కన్నీటి చారికలను, మా పిల్లల అమాయకత్వాన్ని చూసి వచ్చిన సూర్యుడు మాకు ఎన్నెన్నో కబుర్లు చెప్పేరోజు.గురువారం సాయంత్రమే రూంలో సందడి మొదలైంది. సాయంత్రం డ్యూటీనుండి వచ్చి రిలాక్సవబోతుండగా దిగారు రాజేశం, అతని రూం మేట్స్‌.మొబైల్‌లో మందు ఆర్డర్‌ చేసి కూర్చున్నాము.మందు గొంతులోకి దిగిందంటే జ్ఞాపకాలు గదంతా పరుచుకుంటాయి. కన్నీళ్ళు కూడబెట్టుకుంటూ బ్రతికేవాళ్ళం. జ్ఞాపకాలే కలలు మాకు.చీకటి చిక్కనయింది.సీడి ప్లేయర్‌లో మంద్రంగా వినిపిస్తున్న పాట...‘‘పగలైనా రేయైనా ఎడారిలో ఒకటే లే’’ అని.మాటల్లో మనసు పరిచాడు రాజేశం.‘‘అయ్యవ్వలు ముసలోళ్ళైపాయిరి. నేను లేని ఇంట్ల ఉండబుద్దిగాక ఇంటిది తల్లిగారింటికి పాయె. నడిమిట్ల పిల్లల సదువు నాశనమైతదని గాల్లను కోరుట్లల ఆస్టల్‌ల ఏసిన. నల్గురం నాల్గు దిక్కుల... పిల్లల యాదికత్తె నా పానం సిన్నవోతది’’రాజేశంది సుమారు నావయస్సే. చిన్నవయసులోనే పెళ్ళి కావడం పిల్లలు పుట్టడం జరిగింది.

 అతనికన్నా అతని భార్యది ఇంకా దుర్భర పరిస్థితి. మాతృత్వం మాధుర్యం తెలీని వయసులో పిల్లల్ని కనడం... తెలుసుకునే లోగానే పిల్లల్ని తల్లికి దూరం చేసి హాస్టల్‌లో వేయడం.నాకు తెలిసిన భాషలో రాజేశాన్ని ఓదార్చాను.రాత్రి పన్నెండు దాటింది. పార్టీలో డిస్కషన్స్‌ కంటిన్యూ అవుతూనే వున్నాయి. దేశం కాని దేశంలో మాకు మేమే అన్నదమ్ములం.. మాకు మేమే అన్నీనూ. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఎక్కడైనా కనిపిస్తుందో లేదోగానీ.. ఇక్కడ మాత్రం అది సాక్షాత్కారం అయింది.్‌ ్‌ ్‌కరవు తరిమేస్తే దుబాయి చేరిన వేణు... ఒక ఫోటో చేత్తో పట్టుకుని తదేకంగా చూస్తూ మూగగా ముచ్చటించడం గమనించాను.‘‘చూశావా! వేణుకు భార్యంటే ఎంత ప్రేమో’’ అని రాజేశంతో అంటూ ఆ ఫోటో లాక్కుని చూశాను.బుగ్గల్ని తాకితే పసితనం కందిపోతుందన్నంత ముద్దుగా వుంది ఓ పాప. తన తండ్రిని ఆహ్వా నిస్తున్నట్లు చేతులు చాచి నిల్చునుంది. ఆ ఫోటో నా చేతిలో వున్నంతసేపు ఆ పాపే నా ఒళ్ళో కూచొని ఆటలాడుతున్నట్టుగా ఫీలింగ్‌. మరి... మరి... వేణు పరిస్థితి...?రాజేశం చెబితే తెలిసింది. వేణు పెళ్ళయ్యాక మూణ్ణెల్లకే విమానం ఎక్కాడని. ఆ మూణ్ణెల్ల కాపురపు తీపి గురుతే ఈ పాప అని. రెండేళ్ళ వయసున్న తన కూతురునింతవరకు ప్రత్యక్షంగా చూడని వేణు ఎంత క్షోభననుభవిస్తున్నాడో... అతని కళ్ళల్లో కదలాడుతున్న కన్నీటి పొరనడిగితే తెలుస్తుంది.్‌ ్‌ ్‌మా అందరిలోకి పెద్దవయసు రాజేశం రూం మేట్‌ సాయన్నది. మాటల మధ్య అర్థమైందేం దంటే గత ఇరవై అయిదు సంవత్సరాలూ గల్ఫ్‌కే అంకితం చేశాడతని జీవితం. రెండు మూడేళ్ళ కోసారి సెలవుపై వెళ్ళి రెండు మూడు నెలలు మాత్రమే అతని కుటుంబంతో గడిపేది. అతను పంపే డబ్బుల్లోనే సాయన్నను చూసుకుంటా రేమో.. నలుగురు పిల్లలూ, అతని భార్య.