లాప్‌టాప్‌ బాగ్‌ తీసి కింద పెట్టి బార్‌ స్టూల్‌ మీద కూర్చుంటూ అన్నాడు సమీర్‌ ‘‘హే శివ, హియర్‌ ఐ యామ్‌ మాన్‌. హౌ ఆర్‌ యూ? గెట్‌ మి మై రెగ్యులర్‌.’’పలకరింపునీ ఆర్డర్నీ కలిపి ఇచ్చింది ఎవరా అని వెనక్కి తిరిగి చూశాడు బార్‌ టెండర్‌ శివ. ‘‘హాయ్‌ సమీర్‌ సర్‌, ఎప్పుడొచ్చారు?’’ తెలుగులో పలకరిస్తూ చకచకా ఓ గ్లాసు అందుకుని, దాన్నిండా ఐస్‌ నింపి, రాక్‌లో పైన ఉన్న షివాస్‌ రీగల్‌ బాటిల్‌ తీసి ఐస్‌ మీదుగా పోశాడు. పక్కనున్న నాప్‌కిన్‌ని నాజూకుగా గ్లాసు చుట్టూ చుట్టి, సమీర్‌ ముందున్న కోస్టర్‌ మీద పెట్టి ‘‘చీర్స్‌’’ అన్నాడు.‘‘చీర్స్‌’’ అంటూ గ్లాసు చేతిలోకి తీసుకున్నాడు సమీర్‌.‘‘మీరు దాదాపు త్రీ మంత్స్‌ నుంచీ కనపళ్ళేదు. కంపెనీ మారారో లేదా మీ కంపెనీ వాళ్ళు వేరే హోటల్లో పెడ్తున్నారో మిమ్మల్ని అనుకున్నాను’’ అన్నాడు శివ. 

రెగ్యులర్‌ కస్టమర్‌ చాలా రోజుల తర్వాత కలిసిన ఆనందం కనపడింది అతడి మొహంలో.‘‘నేను రాకపోయినా మా వాళ్ళంతా ఈ హోటల్లోనే కదా దిగుతున్నారు. నీకు బార్‌లో కనపళ్ళేదేమో’’ వివరించే ప్రయత్నం చేశాడు సమీర్‌.‘‘పాసిబుల్‌. మరి మీరేం కనపడట్లేదు సార్‌?’’ అడిగాడు శివ.‘‘ఓ మూడు నెలలు ట్రావెల్‌ తగ్గించాను శివా. ఔటాఫ్‌ స్టేషన్‌ మీటింగులన్నీ ఎగ్గొట్టాను. ట్రావెల్‌కి విసిగిపోయి మా ఆవిడ వదిలేస్తుందేమోనని భయమేసి’’ అన్నాడు చిన్నగా నవ్వుతూ.‘‘గుడ్‌ వన్‌ సర్‌. బట్‌ మేడమ్‌ కభీ నహీ చోడ్తే ఆప్‌ కో. ఫికర్‌ మత్‌ కరియే’’ అంటూ పక్కకి కదిలాడు కొత్త కస్టమర్‌ రావడం చూసి.‘‘డోన్ట్‌ బి సో స్యూర్‌’’ అన్న ఆడ గొంతు వినబడింది సమీర్‌కి వెనక నించి. తిరిగి చూశాడు.‘‘హాయ్‌, ఐ యామ్‌ సారా. ఐ వజ్‌ జస్ట్‌ కిడింగ్‌. యువర్‌ వైఫ్‌ మే నాట్‌ లీవ్‌ యూ, బట్‌ డోంట్‌ బీ సో స్యూర్‌ ఎబౌట్‌ ఇట్‌’’ అంది సారా తనని తాను పరిచయం చేసుకుంటూ.