‘‘గోడ మీంచి తోసేస్తావా, లేక కిందకి దింపి పగలకొడతావా?’’ శైలిని వేపూ, గోడ గడియారం వేపూ మార్చి మార్చి చూస్తూ అడిగాను. ఏం చేస్తే బాగుంటుందని నన్నడుగుతున్నట్లు ఒక్కసారి చూసి, అంతలోనే- ‘‘అది కాదు తాతీ! కిందకి దింపి పగలకొడితే అమ్మకనుమానమొచ్చి నా వీపు పగలకొడుతుంది. గోడ మీంచి తోసేశామనుకో. ఎందుకో అదే కిందపడి పోయిందనుకుంటుంది’’ అంది అసలే పెద్దవిగా ఉండే తన కళ్లని చక్రాల్లా తిప్పుతూ.నాకు చాలాముద్దూ, ముచ్చట వేసేశాయి నా మనవరాలి మీద. ఆ తెలివి తేటలకే కాదు, ఆ తేట తెలుగు మాటకీను. ఆరేడేళ్ల అమ్మాయి ఆపాటి తెలుగు మాట్లాడ్డం ఆంధ్రప్రదేశపు మామూలు కుటుంబాలలో అతి సాధారణమే. కాని...ఆంగ్లమూ, అంకెతో తప్ప అన్యమొల్లని కంప్యూటర్‌ ఉద్యోగాలు వెలగబెట్టే తల్లితండ్రుల ఏకైక పుత్రిక అయి వుంది. దొరల బడులలో చదువుతూ... తెలుగు మాట్లాడితే తలతీసేస్తామనే ఉపాధ్యాయుల విద్యార్థినిగా... తెలుగు రావడమంటే ఎయిడ్స్‌ వచ్చినంత పరువు తక్కువగా భావిస్తున్న తెలుగు పరిసరాలలో మసులుతూ తెలుగు వినపడకుండా తిరిగే పిల్లది. నాలుగంటే నాలుగే వారాలలో... కేవలమూ రాత్రి పూట అరగంట - గంట సేపు నానోట తెలుగు విని. తన నోట తెలుగు మాటని పాటలా పలుకుతూందంటే నేర్పిన తాతకి ఎంత మురిసిపాటు! పాప పలుకులు నాకు కోయిల కూతలే. 

అసలు.. చిన్నపిల్లల నోట ఏ భాషయినా బాగుంటుంది. అందులో మాతృభాషయిన... ఇటలీయనాఫ్‌ ద యీస్ట్‌ అనిపించుకున్న... తెలుగయితే చెప్పేదేముంది? ఐదో తరగతి పిల్లలకి కూడా అ ఆలు రానివ్వనంత నిర్లక్ష్యం చేయబడిన తెలుగుభాష. నా మనవరాలికి మహచక్కగా వొస్తే... మహదానందం కాదూ తాతకి?ఈ కాలపు పిల్లలు అతి చురుకు. వీళ్లు. పిల్లలు కారు, పిడుగులే. ఇంకా - ఒకరే ముద్దు, ఆపై వద్దు.... అంటూ దంపతులు అవలంబించడం వల్ల యింటికొక పిల్ల అయిపోయి... ఒంటరితనపు గ్రహణం పట్టి.... కొంత చురుకుదనాన్నణగ దొక్కేస్తూంది కాని, లేకపోతే వీళ్లని పట్టడం ఎవరికి శక్యం?‘‘తాతీ! ఎవరూ రావడం లేదు కదా?... చూడు-’’ హెచ్చరించింది శైలిని. ద్వారం లోంచి తల బయటకు పెట్టిచూశాను. నా పర్యవేక్షణ సహకారాలతో పాప చేయబోతున్న గడియార భంగకార్యక్రమాన్ని గమనించి మా గుట్టురట్టు చేసేవారు కాని, మా ప్రయత్నాన్నడ్డుకునే వారు కాని ఎవరూలేరని నిర్ధారించుకున్నాను. అప్పుడు ఒకసారి చివరి చూపులు చూసినట్లు గడియారం వేపు చూశాను. కొన్ని నిముషాలలో చచ్చిపోబోతున్న ఆ గడియారం మీద జాలేసింది, పాప చేతిలో అది హత్య చేయబడబోతూందని. నామీద కూడా నాకు జాలేసింది. ఎందుకంటే.