పగటి పూటఎన్నడూ లేనిది పరుగెత్తుతున్నట్టుగా వచ్చిన లింగం ‘రమా... నీకీ సంగతి తెలుసా’ అన్నడు. అరగంటముందే రమకు విషయం తెలిసింది. అదే చెప్పి ‘ఎవరు....?’ అని అడుగుతుంటే పద్మపేరు చెప్పి ‘సిరిసిల్ల పోదాం’ అని తొందరపెట్టిండు.పద్మ పేరు వినంగానే రమకు కాళ్లకింద భూమి కదిలింది. అప్పుడు గిన్నెలు కడుగుతుంది. చేతుల పని ఆపి భయంగా ‘నిజమా’ అని అడిగింది.సిరిసిల్లలో ఉన్నప్పుడు ఈ మాటనే ఎన్నోసార్లు అడిగిందిత రమ. ఎప్పుడూ కాదనే చెప్పిండు లింగం. ఇప్పుడు మాత్రం అవును కాదని ఏదీ చెప్పకుండా ‘ఏమో! అనవాళ్ళను బట్టి పద్మనే అనిపిస్తుంది. ఇంకో పేపర్ల పోటో ఇచ్చిండుగనీ గుర్తుపట్టరాకుంట ఉంది.’ అన్నడు నీరసంగా కూర్చుంటు.రమ గ్లాసులో మంచి నీళ్లు తెచ్చి ఇచ్చింది. గట గట నీళ్లు తాగి సేద దీరుతూ ‘సిరిసిల్లలో ఇంతకాలం నేతకార్మికుల చావులనే చూసినంగదా... ఆకలిబాధ... అప్పుల బాధ.... అనారోగ్యం.... ఇప్పుడు ఆడవాళ్లు ఎందుకు చస్తున్నట్లు... ఒక్కనాడే కార్గిల్‌లేక్‌లో రెండు శవాలా?..’ అన్నడు బాధగా.కార్గిల్‌లేక్‌ పేరు వినంగానే ఒకనాటి రాత్రి లింగం చెప్పిన నర్సింలు తండ్రి చావు గుర్తుకు వచ్చింది రమకు.తలుపులు దగ్గరేస్తూ ‘ఆడిది జేత్తే అడుగు వట్టిందట... మొగోడు జేత్తే మొగులు ముట్టిందట. సంపాయించే మొగోడే సచ్చినంక అప్పులతో ఆడిది ఎన్నిరోజులు ఈదుకత్తది... ఎంత గతి కచ్చెనే బిడ్డా.....’ కండ్లకు నీళ్లు తీసుకుంది రమ.

అరగంటలో ఇద్దరూ నాన్‌స్టాప్‌ బస్సు ఎక్కి కూసున్నరు.బస్సు ఎక్కుతుంటే లింగంకు వెంకట్రాది గుర్తుకు వచ్చిండు. ఆరునెలల కింద మాట. మొదటిసారిగా నిద్రకరువైన రాత్రి.ఆ రోజు సిరిసిల్ల కొత్తబస్టాండులో బస్సెక్కుతున్న వెంకటాద్రిని చూసి ‘అరే... వీడు అన్నంత పని చేసిండు. లక్ష్మిని విడిచిపెట్టి పోతండు...’ అని లింగం అనుకునే లోపలనే బస్సుడిపో పక్కసందుల నుంచి పరుగెత్తుకచ్చిండు భూమరాజు. దించిన తల ఎత్తలేదు. పక్కలకు కూడా తిరిగి సూడలేదు. ఎవలో తరుముతున్నట్టు వచ్చి బస్సు ఎక్కిండు.లింగం రెండు మూడుసార్లు పిలిచిండు. భూమరాజు చూడలేదు. అనుమానం వచ్చి పక్కకు తిరిగి చూసిండు లింగం. అటు పద్మ ఇటు లక్ష్మి ఎదురెదురు సందుల్లో నిలబడి భయం భయంగా చూస్తున్నరు.అది ఇప్పుడు గుర్తు చేస్తూ రమతో ‘‘మొన్న అమాలి దేవయ్య పోన్‌ చేసిండు. లక్ష్మి జాడనే లేదట. ఈ రోజు మనం పద్మశవాన్నే కాదు. లక్ష్మి శవాన్ని కూడా చూస్తం. మున్సిపాలిటీ చెత్తలో కుళ్లిపోయి ఉంటుంది. ఏట్రక్కు డ్రైవరును అడిగినా చెప్పుతడు’’ అన్నడు.బస్సు రాంనగర్‌ దాటి వేగాన్ని అందుకుంది.లింగం ఊరిలో ఉన్నప్పటి మాట ఊర్లో ఉన్నప్పుడు వెంకటాద్రి ఒకసారి భార్యతో మాట్లాడుతూ లక్ష్మిని ‘ఆవు’ అన్నడట. అంతే! కమల కోపంతో ఇంతెత్తు లేచిందట. దుబాయి విజా వచ్చి అప్పుకోసం తిరుగుతున్న వెంకటాద్రి లింగంను కలిసినప్పుడు తన నిర్ణయాన్ని చెప్పుతూ ‘‘ఏం చెయ్యిమంటవురా... కరువు అందరిని ఆగం జెయ్యవట్టె... కటికోనికి అమ్ముదామంటె మనుసొప్పుతలేదు. నేను ఒకనాడు ఆవు అన్నందుకే గయ్యిమని లేచింది కమల. దాన్ని ఆవులెక్క చూసుకుంటున్నమా అన్న కమల నేరా... ఈ ఆలోచన చెప్పింది’ అని మొఖం చిన్న బుచ్చుకున్నడు.