నేను ‘కుమారి’ నుంచి శ్రీమతిగా పదోన్నతి పొంది కొన్ని గంటలే అయింది.మంచుకురుస్తున్న ఈ తెల్లవారుజామునే గోరువెచ్చని ఆలోచనలను రేకెత్తిస్తూ ఓ హండ్‌సమ్‌ గై నా మెడలో తాళి కట్టేసాడు.ఇరవయ్యేళ్ళు ఇక్కడ పెరిగినా ముందు జీవితమంతా అతనితోనే ముడిపడి ఉందనుకుంటే... ఏదో ఉద్వేగం కలుగుతోంది. అన్నట్టు... ఇవాళ నా ఫస్ట్‌నైట్‌. ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పెళ్లితోపాటూ అది కూడా జరిపించేస్తే బాధ్యతతీరిపోతుందని అమ్మానాన్న తొందరపడుతున్నారు. ఆడపిల్లను కన్నవాళ్ళకు అన్నీ తొందరే. పెరట్లో చిన్నకుండీలో ఎంతో ప్రేమగా పెంచుకున్న గులాబీ మొక్కకు అంటు తొడిగినంత సంబరంగా... ఇంట్లో కాళ్ళకు గజ్జెలు కట్టుకుని ఆడిపాడిపెరిగిన ఆడపిల్లను అత్తింటికి పంపించేయాలనుకుంటారు.దానికోసం తెగ ఆరాటపడుతుంటారు.కొత్త పరిచయం మొగ్గ తొడిగి స్నేహంగా విరబూయాలన్న భావనే రాదనుకుంటా.పెళ్లిచూపులు, పెళ్లిపిలుపులు, పెళ్లి... ఇక, తరువాయి శోభనం... అంటూ-తమకు తెలిసిన ఓ స్ర్కీన్‌ప్లే రాసుకుని వరుస సన్నివేశాలతో రక్తికట్టించేస్తారు.‘‘కాస్తయినా స్థిమితపడకుండా ఆ తంతు జరిపించేయాలా?’’ వారిస్తున్నా వింటేనా?ఓహ్‌... క్షణం తీరిక లేకుండా ఏర్పాట్లు చేసేస్తున్నారు. అసలే పరిచయం లేని వ్యక్తితో పెళ్లి... ఆ వెన్వెంటనే ఫస్ట్‌ నైట్‌. గదిలోకి వెళ్లాలంటేనే భయంగా ఉంది.

దాంతో... ఉదయం దగ్గర్నుంచీ దిగులు.ఎంత త్వరగా రాత్రయిపోతుందేమోననే బెంగ.మనోహర్‌అంతేనా... ఇంకా ఉంది చూసుకోండంటూ నవ దంపతుల కోసం ఓ గదిని కేటాయించడం, మంచాన్ని, పరుపును రకరకాల పూలతో సింగారించడం, అయ్యవారు పెట్టిన ముహూర్తానికి ఒకటి కమ్మంటూ సంకేతాలు, సందేశాలివ్వడం, తీరా ఆ తంతు ముగించాక... పాపం అలసిసొలసిపోతారేమోననే బెంగతో ముందుగానే ఓ పళ్లెం నిండా స్వీట్లూ, పండ్లూ, ఫలహారాలు ఉంచడం...ఇన్ని చేసినా... ఇంకా మూడ్‌ రాకుండా ముడుచుక్కూర్చుంటారేమోనన్న భయంతో కాబోలు...గదంతా మత్తెక్కే అత్తరు సువాసనలను వెద జల్లడం... అగరొత్తు పొగలతో జాతర చేయడం..!కేవలం ఇద్దరికి మాత్రమే సొంతమయ్యే ‘పెళ్లి’ అనే ఏకాంత స్వప్న సామ్రాజ్యంలో ఇన్ని సీన్లు అవసరమా?తలచుకుంటుంటేనే తల పాతాళంలోకి ఒరిగిపోతోంది. పట్టలేనంత కోపం వచ్చేస్తోంది నాకు.నలుగురి కళ్లు పడేలా, బాహాటంగా, వైభవోపేతంగా... ఫస్ట్‌నైట్‌ జరుపుకోవడం నాకైతే అస్సలిష్టం లేదు. ఆ విషయం ఎంత ఖచ్చితంగా ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ విన్పించుకోరేం?ఆఖరికి... నను కనిపెంచిన అమ్మానాన్నలే నా ఇష్టాయిష్టాలను గుర్తించకపోతే ఎవరికి నా గోడు వినిపించాలి?అమ్మని కదిపితే తరతరాల ట్రెడిషనంటూ అధిగమించి, అతిక్రమిస్తే మహాపాపమంటూ నానా విధాలుగా హింసిస్తుంది నన్ను.ఇక, నాన్నయితే... ‘‘ఆచారంరా... తప్పక పాటించాల్సిందే...’’ అంటూ క్లాస్‌ పీకేస్తారు.ఎంతైనా తెలుగు మాస్టారు కదా!రెండు మనసులు, రెండు తనువులు కలవాల్సిన వైయక్తిక జీవనోత్సవం సామూహిక సంబరంగా మార్చేస్తే ‘డూడూ బసవన్న’లా తలొంచితీరాలా?