గడిచిన పదిహేను నిమిషాల్లో తొమ్మిదోసారి లాయరు గారు తెల్ల రుమాలుతో కళ్లజోడు తుడుచుకొని ముక్కు మీద పెట్టుకొని, ఆయన వేపు చూసి మళ్లీ చేతిలోకి తీసుకొని అన్నాడు.‘‘పట్టాభిగారూ, చాలా దూరం వెడుతున్నారు. అక్కడ మీకు ఏం తోస్తుందో... పరాయి భాష కూడాను.’’‘‘ఏవీ తోచదు. నాకు వెళ్లడం సుతరామూ ఇష్టం లేదు. అబ్బాయి ఒప్పుకోవడం లేదు.’’అర్థమైందన్నట్లు లాయరు గారు తలూపేరు. పట్టాభిగారు నిశ్శబ్దంగా కుర్చీలో కూచుని ఉన్నారు. దరిదాపు గంట నుంచీ అలాగే కూచున్నారాయన. గంట కొడితే శబ్దం వచ్చినట్లు ఆయన నిమిత్తం లేకుండా అడిగిన దానికి సమాధానం వస్తోంది. ఇల్లు అమ్మడం, ఊరొదిలి వెళ్లిపోవడం, ఇష్టం లేక మనసులోనే తలకిందులవుతున్నాడు అనుకున్నారు లాయరుగారు. తెల్లటి చొక్కా, మెడ చుట్టూ కండువా, కనుబొమల మధ్య చిన్న కుంకుమ బొట్టుతో పట్టాభిగారు లాయరు తల మీంచి వెనక గోడ మీద వేలాడుతున్న సీతారామ కల్యాణం పటం వైపు చూస్తున్నారు. రామచంద్రమూర్తి మంగళసూత్రం కట్టే వరకూ ఓపిగ్గా కూచున్నట్టుగా ఉన్నారాయన. తన ముందున్న స్టాంపు కాయితాల్ని పదమూడోసారి మళ్లీ తిరగేశారు లాయరుగారు. ఇద్దరికీ ఏభైదాటేయి. పేరి శ్రీరామ్మూర్తిగారికి, పట్టాభిగారితో స్నేహం కాకపోయినా చాలా కాలం నుంచీ పరిచయం. 

ఆ ప్రాంతంలో మొదటగా వచ్చి ఇళ్లు కట్టుకున్న కుటుంబాల వారు. ఇప్పుడాయన వెళ్లిపోతున్నాడంటే ఆయనకే ఏదోగానే ఉంది. వారిద్దరికీ మూడు వీధుల మధ్య దూరం. రెండో వీథిలో అనిబిసెంటు వచ్చినప్పుడు మొక్కనాటిన పార్కు ఉంది. సాయంకాలాలు తరచుగా అక్కడే కలుస్తుంటారిద్దరూ. పార్కు అవతలగా లావుపాటి కన్నడ బ్రాహ్మణ హోటల్లో కూడా ఎప్పుడేనా ఊతప్పం నిమిత్తం కలుస్తుంటారు. పార్కు వెనక వీధిలో శ్రీరామ్మూర్తిగారు, పార్కు నానుకున్న మెయిన్‌ రోడ్డు పక్క వీధిలో ఓ చివర పట్టాభిగారి కాపురం. చీకటి పడిపోయింది. వీధుల్లో దీపాలు వెలిగిస్తున్నారు. శ్రీరామ్మూర్తిగారి కచేరీ గదిలో ఇందాకనే దీపం వెలిగించాడు గుమాస్తా. చేతుల్లేని ఖద్దరు బనీను, నుదుటి మీద పెద్ద బొట్టు, మధ్యాహ్నం తాంబూలం తాలూకు ఎరుపు మిగిలిపోయిన పెద్ద నోరూ, పేరివారికి పెద్ద ప్లీడరని పేరు. కాయితాల మీంచి పట్టాభిగారి వేపు చూశారాయన. ఆయన రామచంద్రమూర్తి మంగళసూత్రధారణ గురించి వేచి ఉన్నారు.‘‘ఇందాకనే వస్తానన్నాడండీ. ఇతగాడు ఆలస్యం చేసే మనిషి కాడు’’ అన్నారాయన.‘‘ఏదో పనిబడి ఉంటుంది’’ అంటూండగానే గుమస్తా వచ్చి ‘‘ఒచ్చేసేరండి’’ అని వెళ్లిపోయాడు. శ్రీరామ్మూర్తిగారొక్కరే గుమ్మం వేపు చూశారు.‘‘దయచెయ్యండి. అలా కూచోండి. వారూ, నేను మీకోసం చూస్తున్నాం.’’‘‘నన్ను క్షమించాలి బాబుగారూ తప్పక ఆలీసం చేసేను. పెద్దలు నాకోసం చూస్తూ కూచున్నారు. మరి ఏవీ అనుకోకండి.’’