ఎక్కడినుండొచ్చిందో ఊరకుక్క..సింహంలాంటి ఊరకుక్క...చటుక్కున ఎగబడి భారతదేశంపై బడింది. దానివెంట మరో కుక్క..వెనుకనే ఇంకొకటి.. ఊరకుక్కల మంద.. అన్నీ కలగలిసి ఆ భారతదేశ వినైల్‌హోర్డింగ్‌పై దాడిచేసి రెండు క్షణాల్లో ముక్కలు ముక్కలు చేశాయి.ముక్కలు చేస్తూ... ఒకటే మొరుగుడు.. కలబడుడు.. కుమ్ముకోవడాలు.. కుక్కలగోల అప్పటిదాకా ఎయిర్‌టెల్‌ అడ్వర్టయిజ్‌మెంట్‌ హోర్డింగ్‌ కట్టే ప్రయత్నం చేస్తున్న చీమిడి ముక్కు కూలీ శివుడు కుక్క పైకి ఎగబడగానే భయంతో బేనర్‌ పారేసి పారిపోయాడు.‘హోర్డింగ్‌పైన’ దేశంలోకెల్లా అతిపెద్ద నెట్‌వర్క్‌ అన్న అక్షరాలు.. భారతదేశం పటం.. అన్నీ ముక్కలు ముక్కలైపోయాయి. ఎందుకో కుక్కలు వాట్లో అవే సంకీర్ణ ప్రభుత్వంలో కోట్ల రూపాయల పంపకాల్లో పరస్పర అంగీకారం కుదరని మంత్రుల్లా నిస్సిగ్గుగా కొట్లాడుకుంటున్నాయి.నడి చౌరస్తాలో జరుగుతున్న ఈ తతంగాన్నంతా మానవ సంచారం అంతగాలేని అర్ధరాత్రి ప్రొఫెసర్‌ లీల తన బెడ్‌రూం కిటికీలోనుండి యథాలాపంగా చూస్తోంది.రోడ్లపై పరుచుకున్న పండు వెన్నెల నియాన్‌లైట్ల కాంతి.కాంతిలో కనిపిస్తున్న భారతదేశ పటం ముక్కలు.. ఎయిర్‌టెల్‌.. టెల్‌ ఎయిర్‌.. గాలీ చెప్పవే.. చెప్పవే గాలీ.. విస్తరించిన భారతదేశ నెట్‌వర్క్‌ను కుక్కలు ముక్కలు ముక్కలుగా చించేస్తున్నాయని.లీల అవాక్కయి చూస్తూండగానే టపటపా పెద్ద పెద్ద చినుకులతో అకస్మాత్తుగా వచ్చిపడ్డ అవిశ్వాస తీర్మానంలా వర్షం మొదలై జడివానగా మారింది - కుక్కలు క్షణాల్లో పారిపోయాయి. 

చౌరస్తాలో ముక్కలు ముక్కలైన భారతదేశ వినైల్‌ హోర్డింగ్‌ బంగారు రంగు పీలికలు.. కురుస్తున్న ఇనుప మేకుల్లాంటి చినుకులతో వర్షం.అంతా నిశ్శబ్దం.కేవలం ఒట్టి వర్షం చప్పుడుతన మూడవ అంతస్తు రోడ్డువార కిటికీనుండి చూస్తున్న ప్రొఫెసర్‌ లీలకు ఎందుకో కడుపంతా దేవినట్టు, కళ్ళలో నుండి ఓ సముద్రం పొంగుకొస్తున్నట్టనిపించి మౌనంగా కళ్ళు మూసుకుంది.అప్పుడామె మనసు మంటల్లో కాలిపోతున్న కాగితంలా ఉంది.సరిగ్గా అప్పుడే ఆమె ఎదురుగా ఉన్న గోడగడియారం ఒక గంట కొట్టింది.

ఒక ప్రసిద్ధ ఇంజనీరింగ్‌ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ లీలకు ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో సిటీ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ నుండి టెలిఫోన్‌ వచ్చిన సందర్భం జ్ఞాపకమొచ్చింది.‘మేడమ్‌.. మేము సడెన్‌గా వన విజ్ఞాన్‌ పార్క్‌లో రైడ్‌ చేస్తే మీ కాలేజికి చెందిన ఐదుగురు అమ్మాయిలు ఎనిమిదిమంది కుర్రాళ్ళు అసభ్యకరమైన పనులు చేస్తూ పట్టుబడ్డారు మేడమ్‌..’’ ఇంకా చెబుతూ పోతున్నాడు ఇన్‌స్పెక్టర్‌.అసహ్యమేసింది...వెంటనే ఫిజికల్‌ డైరెక్టర్‌ను పంపి ఫైనలియర్‌ రెండు సెక్షన్లపై దాడి చేయించి సెల్‌ఫోన్లను సీజ్‌ చేస్తే.. మొత్తం ఎనభై ఆరు హాండ్‌సెట్స్‌.. కాలేజికి మొబైల్స్‌ తేవద్దని ఎన్నోసార్లు ఖచ్చితమైన ఆదేశాలనిచ్చినా.. దొంగచాటుగా..ఏమిటిది.?తన గదిలోకి సీజ్‌ చేసిన సెల్‌ ఫోన్లన్నింటినీ తెప్పించి యిద్దరు సీనియర్‌ ప్రొఫెసర్లతో తనిఖీ చేయిస్తే.. అన్నీ బూతు ఎస్సెమ్మెస్‌లే. ఒకమ్మాయి ఒకడికి యిచ్చిన ఎస్సెమ్మెస్‌ ‘షల్‌ వియ్‌ హావ్‌ కిస్‌ టుడే ఎట్‌ అమృతా థియేటర్‌.. ఫషో’ టైం మూడుగంటల పదినిమిషాలు.. అంటే క్లాసు జరుగుతున్న సమయంలో ఇవ్వబడ్డ మెసేజ్‌ అది.,