అతడు ఉప్పు. ఆమె నిప్పు. వాళ్లిద్దరూ ఒకచోట చేరితే చిటపటలే. అతడి పేరు ఆమెకు తెలియదు. ఆమె పేరు అతడికి తెలీదు. ఒకరికొకరు ఎలాంటి పరిస్థితిలోనూ అడ్డం కారు. వాళ్ళ జీవితాలు ఒకే అంశం మీద విభేదించిన సంఘటనలూ లేవు. ఉప్పూ నిప్పూ కావలసినంత అవసరం లేదు.ఆమె అపురూప సౌందర్యవతి. అతడు పరిపూర్ణ పురుషుడు. కేవలం ఇదే కారణం అయివుంటే కాదనేవారు లేకపోవచ్చును.‘ఆమె ఉండేది మీ ఫ్లాట్‌పైనే. మీలాగానే ఒంటరిపక్షి’ అంటాడు అపార్ట్‌మెంట్స్‌ యజమాని.ఆమెను చూశాడతను. ఆమెలో మితిమీరిన అందం ఉంది. ఏదేదో చూడాలనిపించే ఆకర్షణా ఉంది.‘‘కుటుంబం లేదా?’’ అడిగాడతడు, పెండ్లి కాలేదా? అని అడగడానికి సంకోచించి. అప్పటికే చూపు మరల్చుకోలేకపోతున్నాడు.తగినంత ఎత్తూ, ఎత్తుకు తగినంత సౌష్ఠవం, గులాబీరంగు ఒళ్ళు. నలుపు జార్జెట్‌ చీర కట్టిందేమో ఆమె ఒంటిరంగు మరింత కొట్టొచ్చినట్టు ప్రకాశిస్తోంది.‘‘కుటుంబం ఉంది. ఈమె మాత్రం ఇక్కడుంటుంది. ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో ఉద్యోగం చేస్తోంది!’’అతడు బలవంతంగా చూపులు మరల్చుకుని ‘‘ఎవరివైపు చూడదా? ఎవరితోనూ మాట్లాడదా? ఎటూ చూడకుండా వెళ్తోంది?’’ అన్నాడు.‘‘అవునవును’’ తలాడించాడు యజమాని.‘‘గర్వమా!’’ అడిగాడతడు.భుజాలు చరుచుకున్నాడు యజమాని. తర్వాత తన పెంట్‌హౌస్‌కి దారితీసే మెట్లెక్కాడు. యజమాని బాగా బతకనేర్చినవాడు. అవి చాలనట్టు నగరపాలక (కపాల) సంస్థ వారికి లంచమించ్చి పెంట్‌ హౌస్‌ నిర్మించుకున్నాడు.

తన ప్లాట్‌లో బెడ్‌మీద వాలాడు అతడు. కళ్ళు తెరిచినా మూసినా ఆమె రూపమే కనిపిస్తోంది. మురిపిస్తోంది. తన పై ఫ్లాట్‌లో ఆమె ఈ సమయంలో ఏం చేస్తోంది! ఆమెతో మాట్లాడి మైమరచిపోయినట్టు ఊహ కలుగుతోంది. అది తియ్యటి వూహే!ఈ గదిలో తాను ఒంటరి! పైగదిలో ఆమె ఒంటరి.ఆమె తన ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ తయారుచేసుకుంటుందేమో! ఆమె ఒంటరిగా ఎందుకు బతుకుతోంది? ఆమె కుటుంబ నేపథ్యం ఏమిటి! ఆమెకు పెళ్లయ్యిందా! అయ్యిందంటే...అతడి గుండెలో కలుక్కుమంది.అయ్యి వుండదని ఆశించాడతడు. అయ్యి వుండకూడదు.అతడు ఇక ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయదల్చుకోలేదు.మెట్లెక్కి పై ఫ్లాట్‌ చేరుకున్నాడు. తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. వచ్చినంత హుషారుగా తలుపులు తట్టలేకపోయాడు. కొన్ని క్షణాలపాటు తటపటాయించి తలుపు తట్టాడు.తలుపులు తెచుకున్నాయి. ఆమె ఆశ్చర్యరంగా చూస్తూ గుమ్మంలో నిలబడి ఉంది. ఎవరు కావాలన్నట్టు తల ఎగరేసింది.‘‘నన్ను మీరు క్రింది ఫ్లాట్‌లో చూసే వుంటారు. పరిచయం చేసుకుందామని వచ్చాను!’’ అన్నాడతడు.‘‘అలాగా! క్రింది ఫ్లాట్‌ మీదా? చూడలేదు మిమ్మల్ని’’ అన్నది ఆమె.‘‘ఇప్పుడైనా మనం పరిచయస్తులమైనాం’’‘‘మీరు వచ్చిన పని అయిపోయింది కదా...’’ తలుపులు మూయబోయిందామె.అతడు నొచ్చుకుని, ‘‘మీరు ఎక్కడ పని చేస్తారు?’’ అన్నాడు.‘‘అపార్ట్‌మెంట్‌ యజమాని మీకు చెప్పలేదా?’’