రోడ్డు పక్కనే వున్న పొలానికి కంచెగా వేసిన తుమ్మచెట్ల ముందు నిలబడింది జీవరత్నం. జీవరత్నం అక్కడకు వచ్చి ఓ పావుతక్కువ గంట కావస్తోంది. ఆమెకు ఇంకో ఆరు నెలలు గడిస్తే ఇరవై యేళ్ళు నిండుతాయి. ఆమె పక్కనే కొంచెం చదునుగా వున్న నేలమీద ఓ ప్లాస్టిక్‌ డబ్బా నిండా నీళ్లున్నాయి.బొగ్గుతో నడిచే రైలింజను లాంటి వంటి రంగుతో జిడ్డు కారుతున్న మొహంతో నిలుచుని రోడ్డుకు రెండువైపులా ఆశగా దిక్కులు చూస్తూ వున్నది.కూర్చోవటం, వెంటనే నిలుచోవటమే సరిపోయింది వచ్చిన దగ్గర్నించీ. ఇంతకీ వచ్చిన పని కాలేదు.ఓ ఆరునెల్ల క్రితం జీవరత్నం ఓ పాపకు జన్మనిచ్చింది. అక్కడ నిల్చున్నదేగానీ ఉయ్యాలలో వున్న పాప గురించిన ఆలోచన - పూర్తికాని పని గురించిన ఆందోళనతో ఆమెకు బాగా అసహనంగా వుంది.ఇలా ఎన్నాళ్ళు?ఆలోచిస్తోంది జీవరత్నం.బాగా ట్రాఫిక్‌ వున్న రోడ్డు. దాదాపుగా అక్కడితో ఆ వూరు అంతమవుతుంది. ఇక అక్కడినుంచీ అన్నీ పొలాలు. కొంచెం దగ్గరలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ తాలూకు పెద్దపెద్ద నీటి గొట్టాలతో ఓ పక్కా భవనం. దానిపక్కగా ఓ వెడల్పాటి వాగు. ఆ వాగులో కొంతమంది పిల్లలు పశువులను కడుగుతున్నారు.వాళ్ల వల్ల అంతగా ఇబ్బందిలేదు. వాళ్లకీ జీవరత్నానికీ మధ్య అడ్డుగా రెండు పెద్ద చింతచెట్లు వున్నాయి. ఉన్న సమస్య అంతా రోడ్డుమీద తక్కువ విరామంతో వెళుతున్న మోటారు వాహనాల గురించే.ఆ ఊరు దాటితే రెండు కిలోమీటర్ల దూరంలో టౌను వుంది. అక్కడికి ఓ ఇరవై కిలోమీటర్ల దూరంలో వున్న ఇంకో టౌనుకు లెక్కలేనన్ని ఆటోలూ, జీపులూ, బస్సులూ -పది నిముషాల్లో పని ముగించుకుని తిరిగి వెళ్లవచ్చునని అనుకుని పసిపాపకు పాలు కూడా పట్టకుండా గుడిసెలో వెదురు బొంగుకు వేసిన తన చీర ఉయ్యాలలో పాపను వుంచి ప్లాస్టిక్‌ డబ్బాతో నీళ్లు ముంచుకుని ఆ తుమ్మచెట్ల దగ్గరకు వచ్చింది. ఇంట్లో జీవరత్నం పెనిమిటి కేయాస్‌ కూడా లేడు. 

 

పొద్దుటే రిక్షా తొక్కడానికి టౌనుకు వెళ్లాడు.రోడ్డు మీద జనసంచారం లేనందున జీవరత్నం చటుక్కున కూర్చుంది. ఇంతలో రోడ్డు మలుపు తిరిగి ఓ ప్రయాణీకుల జీపు దూసుకుని వచ్చింది.షాక్‌ తిన్నదానిలా మళ్లీ నిల్చుంది ఆమె.జీపునిండా వున్నారు జనం. కొంతమంది జీపుపైన కూడా కూర్చున్నారు. జనంలో ముంచి తీసినట్టు వుంది జీపు. వెనుకవైపు కూడా మనుషులు వేల్లాడుతున్నారు.ఆ జనంలో వున్న ఒకరిద్దరు మగాళ్లు జీవరత్నం గబుక్కున నిలబడడం చూసి ‘కూసో... కూసో...’ అన్నారు హేళనగా నవ్వుతూ...కోపం వచ్చింది జీవరత్నానికి. అయినా ఏమీ చెయ్యలేక ప్లాస్టిక్‌ డబ్బాలో వున్న నీళ్లను అక్కడే వొంపేసి ఇంటికి తిరిగి వెళ్లాలని అనుకున్నది. అయినా నిగ్రహించుకుని అక్కడే నిల్చున్నది. అలా చేస్తే ఇంటికి వెళ్లి మళ్లీవచ్చి ఇంకో గంట అక్కడ నిలబడాలి.