ఒక సుదీర్ఘ విరామం.. మౌనం..వాటిని భగ్నం చేస్తూ ‘నిన్నొకటి అడగాలనిపిస్తోంది అమ్ములూ. అడగనా..’ అన్నాడాయన.‘చేతిలో చెయ్యేసి మాటివ్వలేను కానీ, మీరు చెప్పండి ముందు..’ అన్నాన్నేను.‘నిజంగా..? తీరా నేన్చెప్పాక నువ్వు నవ్వకూడదు, తిట్టకూడదు, ఫోన్‌ పెట్టెయ్యకూడదు..’‘ఛ.. ఏమిటది చిన్నపిల్లల్లా. నేను మిమ్మల్ని తిట్టడమేమిటి? అంతమాటా! నవ్వడం, ఫోన్‌ పెట్టెయ్యడం.. మ్మ్‌... అంత కోరరానిదా.. ఒకవేళ అలాంటిదయితే అడక్కండసలు... ఎందుకొచ్చిన బాధ..’‘అలాకాదమ్ములూ.. ఒకోసారి సమయం మించిపోతే ఇబ్బంది. ఇంతకు ముందు అడిగినలాంటిది కాదులే. అందుకనిప్పుడే చెప్పాలి..’‘సరే మరి చెప్పండయితే..’‘నా అంత్యక్రియలకు తప్పకుండా రావాలి నువ్వు.. నీకేమీ ఇబ్బంది ఉండదు. ఉమా, చలం, జీవీ, వేణు.. అందరూ ఉంటారు. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు.. ఎవ్వరూ ఏమీ అనరు.. ఒస్తావు కదూ..’ఒక్కసారి నా మెదడు మొద్దుబారింది.

అసందర్భంగా ఏమిటీ ప్రస్తావన?‘అమ్మో.. ఆ రచయితా? అస్సలు ఆ జోలికేపోవద్దు.. నువ్వతని కథలూ, నవలలూ ఏమైనా చదివావా.. ఎంత అరాచకత్వమో వాటినిండా.. అతని లైఫ్‌స్టయిలూ అంతే. నీకేం తె లుసు.. మహా ప్రమాదకరం అనుకో. ఆడపిల్లవి. అతనితో స్నేహమంటే కోరి కొరివితో తలగోక్కోవడం..’ అచ్చం ఇవే మాటలు కాదుగానీ, ఇంతకన్న ఓ పాలు ఎక్కువగానే కొందరు పరిచయస్తులు హెచ్చరించారు నన్ను.. కొత్తలో నేను తన గురించి ఆరాలు తీస్తున్నప్పుడు. అదేమాట పరిచయం పెరిగిన తర్వాత అతనితో అంటే, ‘అస్తిత్వంలో ఉన్న సాంఘిక నైతిక సరిహద్దులు తనకు తానే సృష్టించుకున్నవన్న సంపూర్ణమైన అవగాహన కలిగినవాడు... వాటిని అధిగమించడానికి సంశయించనివాడు.. కళాకారుడైనప్పుడు.. వాడు సంఘంలో ప్రస్ఫుటమయిన అరాచకుడిగా కన్పడ్డం చాలా చాలా సహజం.అసలు కళాకారుడెవరమ్ములూ?తన అంతశ్చేతన లోతుల్లోకి తనే దూకి ఆ చీకటి లోయల్లో తనన్తాను వెతుక్కునేవాడు... ఆ క్రమంలో ఎదురయ్యే వైరుధ్యాలకి, వికర్షణలకీ తాను ఆకర్షితుడై ఒకోమాటు తనన్తాను వెతుక్కోవడం మానేసి హీ ఫాల్సిన్‌ సర్చాఫ్‌ అన్నోన్‌! తనకే తెలియని ఆ అన్వేషణే అరాచకత్వమనుకుంటా! ‘‘నేనలాంటివాణ్నేనంటావా? అయితే నేన్నిఖార్సయిన అరాచకుణ్నే..’’ అని నవ్వారు.నాకలా చెప్పిన వాళ్లంతా పరిచయస్తులుగానే మిగిలి.. పోయారు గానీ, మా పరిచయం మాత్రం డాబా మీదకెక్కే సన్నజాజి పొదలా విస్తరించింది.అనేకమందికి ప్రస్ఫుటంగా కనిపించే అతని అరాచకత్వం నాకెందుకో మనసులో నాటుకోలేదు. ఒకటి మాత్రం గమనించాన్నేను. ప్రేమకు తప్ప మరే నియమానికీ లోబడని తత్వం.ప్రపంచ సాహిత్యం.. ఉత్తర దక్షిణాల సంగీతం, విభిన్న వర్ణాలూ ఛాయలూ కలగలిసిన జీవితం.. నాకు అర్థమై - సగం చదవడంలో, మరో సగం సస్పెండెడ్‌ యానిమేషన్‌లో గడిచిపోయిన జీవితం.. ఇదీ అని చెప్పలేని రకరకాల ముద్రల కలనేత.. ఈ క్షణాన నాతో మాట్లాడుతున్న వ్యక్తి.