జగ్దీశ్‌ మెట్లు ఎక్కుతున్నాడు... ఎక్కుతున్నాడు. తళతళ మెరిసే మెట్లు. మట్టీ దుమ్ము లేని మెట్లు. జిగ్‌జిగ్‌ మెరుస్తున్నాయి. జగ్దీశ్‌కు ఈ మెట్ల మీద తన దుమ్ము కొట్టుకొనిపోయిన మట్టి అంటుకపోయిన పాతబడ్డ చెపలు కొట్టొచ్చినట్లుగా కన్పించి తనను వెక్కిరిస్తున్నాయి. కొంచెం ఆగాడు. సంకోచం విడిచిపెట్టి ఆ మెరిసే మెట్లు ఎక్కుతున్నాడు... ఎక్కుతున్నాడు... ఎక్కుతూ... ఎక్కుతూ... జగ్దీశ్‌ హఠాత్తుగా కిందపడిపోయాడు... పడిపోయాడు... రక్తం మడుగు కట్టింది! ఎర్రటి రక్తం!...బాధ.... నొప్పి... మూలుగుతూ జగ్దీశ్‌ కండ్లు తెరిచాడు. మెలకువ వచ్చింది. ఒళ్లంతా చెమటలు! అతని ఉచ్ఛ్వాసనిశ్వాసాలు కొలిమితిత్తిలా బుసలుకొడ్తున్నాయి. లేచి కూర్చున్నాడు. లేచి రాతెండి గ్లాసుతో కుండలోని నీళ్లు ముంచుకొని గటగట తాగాడు. మనస్సు నెమ్మదయింది. జగ్దీశ్‌కు మెట్లు ఎక్కి పైకి పోవటమంటే చాల ఇష్టం. గబగబా ఎక్కాలని కోరిక. కలలో మెట్లు ఎక్కబోయే కిందపడ్డాడు! గాయమైంది!... రక్తం మడుగు కట్టింది. ఛీ! ఏం కల ఇది!... కలవరపడ్డాడు జగ్దీశ్‌.కాలేజ్‌లో చేరినంక ఫ్రీటైమ్‌ వున్నపడల్లా జగ్దీశ్‌ తన స్నేహితులతో కాలేజి బిల్డింగ్‌ మూలలో చేరేవాడు. ఆ మూల మీదుంటే అటునుంచి వచ్చే వాళ్లూ ఇటునుంచి వచ్చేవాళ్లూ కనిపిస్తారు... ముఖ్యంగా ఆడపిల్లలు... వాళ్ల ఫ్యాషన్లు... షోకులు డబ్బు వాసనలు... మస్తీలు! టీ షర్టులు జీన్స్‌ వోణీల్లేని ఒంటికంటుకుపోయిన పల్చని షిఫాన్‌ పంజాబీ డ్రెస్సులు స్కర్టులు స్లీవ్‌లెస్‌ పొట్టి జాకెట్లు... చూడటమంటే ఇష్టం!

ఇక జీన్స్‌ కైనటిక్‌ మీదనో స్కూటీ మీదనో స్పీడీ మీదనో వచ్చిందంటే కండ్లన్నీ వెళ్లబెట్టుకొని చూసేవాడు! భుజం మీదనుంచి ఖరీదైన తోలుసంచి చేతుల్లో కొన్ని పుస్తకాలున్న జీన్స్‌లను చూడాలని మాట్లాడాలని స్నేహం చేయాలని కోరిక.సినిమాల్లో చూయించినట్లుగా వాళ్లతో స్పీడీ మీద కూర్చొని వేగంగా ఎక్కడికో పరిగెత్తాలని మనస్సు కొట్టుకునేది. కార్లల్లో వాళ్లనంటుకొని కూర్చోవాలని విమానాల్లో చేతిలో చేయివేసుకొని ఎగరాలని ఆరాటం! జగ్దీశ్‌కు ఇంట్లో వున్నపడు తను వేసుకునే గళ్లలుంగీ మాసిన బనీనంటే అసహ్యం. వాటిని తీసి కాల్చే యాలని అనిపిస్తుంది.జగ్దీశ్‌ కలను గురించి ఆలోచించి ఆలోచించి ఏదో అర్థమైనట్లుగా చిరునవ్వు నవ్వాడు పేలవంగా. తానూ ఖరీదైన టీషర్టు జీన్స్‌లో ఎప్పటిలాగానే ఊహించుకొన్నాడు. జగ్దీశ్‌ ఊహలను చించివేస్తూ అమ్మగొంతు- ‘‘లేశినావురా! పనికిరానోడ! సదువుకొని నువ్వు సంపాయించే దెపడో గాని నిన్ను మేపలేక చస్తున్నా! సదువు కాలేజీ అని ఇంట్ల నుంచి బయటపడ్తవు! ఏం జేస్తవో గా దేవునికే ఎరుక! ఇంత కూలికిపోయిన సంపాదనన్న వుంటందంటే నా మాట పనికిరాకుంటయితంది. బేకార్‌ తిరుగుడు అలవాటయింది నీకు. పనికేం జూడు! సంపాదనేం లేకున్న యాలకు తిండి మాత్రం కావాలే... ఎన్నడైన బిరాన లేశి నల్లా కాడికి పోయి ఓ బిందెడు నీళ్లు తెస్తే నీ చేతులు పడిపోతాయారా?... తల్లి సుప్రభాతం!