ఏటో ఈ సంజేల ఇన్నిన్ని ముచ్చట్లు సెప్పటానికొస్తన్నయి నాకు.సంజేల దగ్గర పడుతుంటే ముచ్చట్లే ముచ్చట్లు, ఒకిటే ముచ్చట్లు!ఇనేవోల్లు వున్నారా లేదాని కాదు. అలగొచ్చేత్తన్నాయి, నోటి నిండా అయే ముచ్చట్లు.తొలీత నా ముచ్చట్లు పుట్టింది నాను పైటేసిన కాణ్నుండి.నాను సమర్తాడి పైటేసుకున్ననాడు మా అయ్య నాకుఎండికాలి పట్టాలు - మువ్వలు మువ్వలయ్యికొనిచ్చాడు. అయి నా కాల్లెకెట్టుకుని సూసుకునీసూసుకునీ తలికి నాకు ముచ్చట్లొచ్చేసినయ్యి.కాలి పట్టాలు, నా కాల్ల సొగసులు సూసుకుంటా సెర్లో కాల్లూపుతు కూకుంటే... అక్కడికే... అప్పుడక్కడికే నా బావొచ్చీనాడు.ఆడొచ్చి నన్ను జూసీ, నా కాల్లు జూసీ, నా కాల్ల పట్టాలు జూసీ నవ్వుకుంటా... ఎనక్కెనక్కు తిరిగి తిరిగి నవ్వుకుంటా సూస్తూ ఎలిపోనాడు.బావెందుకు నవ్వినాడబ్బా, ఏటి నాకాల్లు బానేవనా, కాల్ల పట్టాలు బానేవనా?బావెందుకు నవ్వినాడో ఎవుల్నడిగేది, అమ్మనా? అయ్యనా?అయ్యయితే నవ్వేసి ‘జడ కుచ్చులు సేయించీదేటి, అయీ సూసుకుంటూ వుందూగాని’ అంటాడు.అమ్మయితే ‘ఎల్లవే, ఎల్లి ఒంటా-ఒద్దికా సూసుకో.

 కట్టుకున్నోడు సుకపడతాడు, మాకూ మంచి పేరొత్తాది’ అంటాది.ఇంకెవుర్నగడను? అత్తమ్మ నడుగుతా.‘అత్తమ్మా, సెర్లో కాల్లెట్టుకుని నాను కాల్ల పట్టాలు సూసుకుంటా వుంటే నన్ను జూసి బావ నవ్వినాడు. ఎందుకంటావ్‌?’ అనడిగా.‘అలగా’ అన్నాది నా యత్తమ్మ.ఆ ఏసంగిలో బావకీ, నాకూ లగ్గమెట్టి పెల్లి సేసీనారు.నవ్వు ముచ్చటంతే... పెల్లి ముచ్చటని అప్పుడరదమయింది నాకు.అగో అప్పటి కాణ్నించి ముచ్చట్లే ముచ్చట్లు... ఒకిటే ముచ్చట్లు.పెల్లవ్వీ అవ్వగానే అత్తోరింటికాడ కొచ్చీనాను.సీటికీ మాటికీ నన్నే పిలిసి జడట్టుకు గుంజీవోడు బావ.‘ఏటి బావా నా జడ వుండాల్నా, లేదా. జడూడిపోతే పూలెట్టా ఎట్టుకునేది?’ అన్నానా.అత్తమ్మ నవ్వింది... పడీ పడీ నవ్వింది. బావ నవ్వీనాడు... పొట్టపట్టుకు నవ్వినాడు.ఇగనెప్పుడూ నాను నా జడ గురించి వూసెత్తలా. అదేటో ఇసిత్రం... జడ గురించంతే అంత నవ్వేటి?ఉండుండి పిల్సీవోడు బావ. ‘ఎందుకలగ, వుండుండి కేకేత్తావేటి? అత్తమ్మ ఇంటే కోప్పడీగల్దు’ అన్నానా.‘నా పెల్లాన్ని నాను పిలిస్తే ఎవుతే కోప్పడీది, నా ముంగలకి రమ్మను’ అని మీసం తిప్పివోడు బావ.తడికవతల్నుంచి అత్తమ్మ నవ్వు.పెతీదానికి నవ్వే... ఇద్దరకిద్దరూ.అప్పుడలగ ఇసుక్కున్నానా. ఇప్పుడా ముచ్చట తల్సుకుంటే నాక్కూడా నవ్వొచ్తేత్తాది.ఒకోసుట్టు ఎండేలప్పుడు పొలం పని ఏట్నేపోతే పొట్టపొగులు జడట్టుకు, ‘పక్కలోకి రాయే’ అని పోరు. ‘అత్తమ సూస్తాది ఒల్లక తొంగో’ అంటానా.‘నానేటీ సూణ్నేదు, నానేటీ ఇన్నేదు. ఈదికేసి సూత్తా తొంగుంటన్నా’ అని అత్తమ్మ కిచకిచ. అది ఇని ఈడూ కిచకిచ.ఒల్లంతా సిగ్గుతో పుల్లడి పోనాది.ఈ ముచ్చట తల్సుకుంటే ఇప్పుడు ఒల్లంతా కోకసుట్టుకున్నట్టు సిగ్గు సుట్టుకుంటాది. ఓ పాలి ఏమయ్యిందంటే ఆవులికి గడ్డికోసుకు రాటానికి తను పొలాలెంబడి ఎల్లింది.