ఎల్లమంద ఎక్కడ పుట్టాడో ఎప్పుడొచ్చాడో ఎక్కడ్నుంచి వచ్చాడో ఆ ఊళ్ళో చాలా మందికి తెలియకపోయినా, యెల్లమంద ఎర్రిబాగులతనాన్ని గురించి గొడ్లకాడ పిల్లల దగ్గర్నుంచీ ఊళ్ళో పెద్దల వరకూ తెలుసు.మోతుబరి ఆసామి భద్రయ్య గారింట్లో గత పది సంవత్సరాలుగా జీతానికున్నా ఎల్లమంద ఆత్మీయుల్ని గురించి భద్రయ్యగారికి అంతగా తెలియదు. అసలు ఎల్లమందకే ‘తన్ను’ గురించీ ‘తన వాళ్ళను’ గురించీ సరిగా తెలిసినట్టు తోచదు, అతడి వాలకం చూస్తే.ఎవరన్నా పిలిచి ‘‘ఏవూర్రా మీది’’ అంటే--‘‘పడమట!’’ అంటాడు తలకాయ ఎగరేసి.‘‘పడమట సరేలేరా! అక్కడేవూరు?’’ అని అడిగితే--‘‘గులకలపాడు!’’ అంటాడు. ఏదో నోట్లో కొట్టుకులాడుతున్న దాన్ని బయటికి కక్కేసినట్టుగా.‘‘అదెక్కడరా శాదిముండాకొడకా?’’ అని రెట్టించి అడుగుతారు. అసలు ఎల్లమందను కదిలించిన వాళ్ళెవరైనా సరే.‘‘ఆఁ అదేనయ్యా! వో వొంటిమిట్టకు రెండు కోసుల దూరం అంటే!’’ఎల్లమంద ఎర్రిబాగులతనానికి తోడు నత్తి కూడా వొకటి పాపం! ఏదైనా మాట గట్టిగా చెప్పాలనుకొన్నప్పుడు, వుద్రేకం కోపం వచ్చినప్పుడూ ఎల్లమందకు నత్తి తోసుకు వస్తూంటుంది.‘‘ఓరి పిచ్చిముండాకొడకా!’’ అని పగలబడి నవ్వుతారు జనం.‘‘పోపోండయ్యా! ప-పరాశక మాట్తాండారు గాని!’’--కోపం తెచ్చుకొని అక్కడ్నుంచి గంతులు వేసుకొంటూ వెళ్ళిపోతాడు ఎల్లమంద. 

ఎల్లమందకు అంతలోనే కోపం వస్తుంది. అంతలోనే చల్లారిపోతుంది.అలాకోపం తెచ్చుకొని చిందులు తొక్కుతూ పోయే ఎల్లమందను ‘‘ఇదిగో! ఎల్లమందయ్యా మాట!’’ అంటే ఠక్కిన ఆగిపోతాడు.అల్లంత దూరాన నుంచునే ‘‘ఏందీ?’’ అంటాడు.‘‘ఓరి నీ గోల దొంగల్దోలా! యిట్టారా ఎల్లమందయ్యా!’’ అంటారు వొచ్చే నవ్వును ఆపుకుంటూనే.ఎల్లమందను, ‘‘ఎల్లమందయ్యా’’ అని పిలిస్తేచాలు బ్రహ్మానందమైపోతుంది. ‘‘ఎల్లమందయ్యా’’ అన్న మాట చెవుల పడితే చాలు ఆనంద పరవశుడై పోతాడు. ఎంత కోపం కూడా అంతలోనే మటుమాయమైపోతుంది. ‘‘ఎల్లమందయ్య’’ అని పిలిపించుకోవడం కంటే తనకు జీవితంలో ఆనందాన్ని కలిగించేది యింకేమీ లేదన్నట్టుగా అయిపోతాడు!‘‘ఏందయ్యా! నే పోవాలి, ఎద్దులకు వులవలు పెట్టాలి!’’ తనలో తనే అనుకొంటూ, ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ పోయేవాడల్లా తిరిగి వస్తాడు.‘‘అది సరేగాని ఎల్లమందా! నీకు నీ వాళ్ళెవరూ లేరా?’’ అని అడిగితే--‘‘నా-న్నావాళ్ళా! అంతా చచ్చిపోయారు!’’ అంటాడు గబుక్కున.కాని కాసేపు ఆగి మళ్ళా చెప్తాడు--‘‘మా అప్ప సెల్లెలుందండోయ్‌!’’‘‘ఏవూళ్లో?’’‘రాళ్ళపాలెంలో!’’‘‘మరెప్పుడన్నా వెళ్ళావా’’ అని అడిగినప్పుడు యేదో ఆలోచనలో పడిపోతాడు.‘‘మరి యిహ నీ చెల్లెలి దగ్గరకెళ్ళవా?’’ అని అడిగితే--‘‘ఆఁ ఎల్తానండీ! యీ ఏడు మాసూ లవగానే తప్పకుండా ఎల్లాలి!’’‘‘ఎళ్ళి మళ్ళీ తిరిగొస్తావా?’’‘‘వత్తాలేండి!’’ అని మళ్లీ సాలోచనగా అనుకుంటాడు. తనలో తను ఎల్లమంద -- ‘‘మా బుల్లెమ్మ రానిత్తదో లేదో!’’అంతే! అసలు ఎల్లమంద వెళ్ళిందీలేదు, బుల్లెమ్మ రానివ్వందీ లేదు. ఏ సంవత్సరానికా సంవత్సరం వెళ్ళాలని అంటాడే కాని వెళ్ళటం మాత్రం ఉండదు.