‘‘చుంచుమొహంది! నేను ఛస్తే దాన్ని చేసుకోను’’ అని నేను ప్రతిఘటించాను, అమ్మ తన మేనకోడల్ని నేను పెళ్ళి చేసుకోవాలని ప్రతిపాదించినప్పుడే.మా నాయనకూడా బావమరిది కూతుర్ని తన కొడుక్కు చేసుకోవాలని భావించలేదు. ఆయన కారణాలు ఆయనకున్నాయి. ఆ ఇంటి పిల్లని కట్టుకుని తను పడ్తున్న బాధలు తన కొడుకు పడకూడదనుకున్నాడు ఆయన.మా నాయన ఆరోగ్యం గట్టిది. జీవితంలో జిర్రున చీది ఎరుగడు. షుగరు, బిపిల్లాంటివి ఎరుగడు. ఆయనకు జీవితంలో మహా అయిష్టమయిన పని పొద్దున్నే నిద్ర లేవటం. కనీసం పొద్దున ఏడు గంటలదాకా పడుకోటంఆయనకలవాటు. అలా సుఖపడ్తున్న ఆయన్ని చూసి మా అమ్మ కుళ్ళి పోయేది.‘‘ఏమిటా నిద్ర పోవటం! మిమ్మల్ని చూసి పిల్లలు చెడిపోతున్నారు. పెద్దవాడు పొద్దున లేవటం మానేశాడు. ‘తెల్లవారు ఝామున లేచి చదువుకోరా, చదివింది బుర్ర కెక్కుతుంది’ అని నేను నెత్తీ నోరూ కొట్టుకుని చెప్పినా వాడు వినకుండా తయారయ్యాడు. ఇలా అయితే పిల్లలు బాగు పడ్డట్టే!’’ అని సాధించి చంపేది. ఆయన్ని తెల్లవారు ఝామునే లేపేది. ఆయన పరిస్థితే అలావుంటే, ఇక మేం పిల్లలం ఏం సుఖపడగలం!మా నాయన వాపోయేవాడు, ‘‘నిన్ను కట్టుకుని నా జీవితంలో ఎంత కోల్పోయానే!’’ అని.ఆయన అప్పుడు ఓ ఇంగ్లీషు కంపెనీలో పని చేసేవాడు. స్వతంత్రం వచ్చినా ఇంకా కొంతమంది ఇంగ్లీషువాళ్ళు ఇండియాలోనే ఉండిపోయారు. నాకిప్పటికీ గుర్తు. ఆ రోజు మా నాన్న ఇంటికొచ్చి మురిసిపోతూ చెప్పాడు. ‘‘మా దొరగారు రిటైరై ఇంగ్లాండుకెళ్ళిపోతున్నాడు. ఇంక తీరిగ్గా పెళ్ళి చేసుకుంటాట్ట! మంచి మనిషి! ‘చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకుని మీరు బాధపడుతున్నారోయ్‌’- అనేవాడు నాతో. 

తెలిసిన మనిషి! కనకనే ఇప్పుడు అరవైయేళ్ళ వయసులో పెళ్ళి చేసుకోబోతున్నాడు. రిటైరయ్యాకయితే, ఏ పని చెయ్యటానికయినా తీరిక ఉంటుందట!’’ అని.‘‘వాడి శ్రాద్ధం! అరవైయేళ్ళకు పెళ్ళేమిటి - అన్నీ ఉడిగి పోయాక!’’ అంది అమ్మ మెటికలు విరుస్తూ.‘‘నీకేం తెల్సు- అందువల్ల ఎన్ని ఉపయోగాలున్నయ్యో? హాయిగా ఉదయం ఏడెనిమిది గంటలదాకా పడుకోవచ్చు, వెచ్చాలు తెచ్చుకోటంలాంటి బాదరబందీ లేకుండా హోటలు భోజనం చెయ్యొచ్చు...’’‘‘చేసేవాడెవడూలేక అర్ధాంతరపు చావూ చావొచ్చు!’’ అంది మా అమ్మ సంభాషణకు ముగింపు పలుకుతూ.మా అమ్మ రీజనుకు నిలబడదని మీకు నచ్చ చెప్పటం కోసమే నేనింత చెప్పింది. అందుకే, నా పెళ్ళి విషయంలో అమ్మకు మరో విధంగా నచ్చ చెప్ప ప్రయత్నించాడాయన.‘‘జాతకరీత్యా పిల్లదీ - పిల్లవాడిదీ, పిల్లీ-ఎలుకా లాంటి సంబంధమవుతుంది. రోజూ కొంపలో షష్టాష్టకం! శ్రీ లక్ష్మి నీ మేనగోడలు కనకా, పిల్ల బావుంటుంది కనకా వాళ్ళనూ కలుపుదామనుకుంటున్నావు గానీ, జాతకం చెప్పేదాన్ని పెడచెవిన పెడ్తే వచ్చే అనర్థాన్ని నువ్వు పట్టించుకోటం లేదు’’ అని తల కొట్టుక చెప్పినా మా అమ్మ వినలేదు. పుట్టింటి మమకారం కళ్ళకు గంతలు కడ్తుంది!