‘‘ఆనందరావు మామయ్య ఫోను చేశాడు.. ఏం చెప్పమంటావ్‌?’’అడిగింది అరవైయేళ్ల తండ్రి చలపతి!విన్నది ఇరవై ఎనిమిదేళ్ళు ఆయన పెంచి పెద్ద చేసిన కన్న కూతురు కరుణ!‘‘నేను ఎప్పుడూ ఒకే మాట మీద నిలబడతాను, నాన్నా!’’ అన్నది నవ్వుతూ.ఆయన నుదిటి మీద పడుతున్న చెమటను పై పంచెతో తుడుచుకుంటూ జాలిగా కూతురు వంక చూచాడు.అప్పుడు ఆమె వంటయింట్లో కూరకు తాళింపు వేస్తున్నది.‘‘ఏదైనా మంచి అవకాశం వచ్చినప్పుడు వదులుకోవటమంత తెలివి తక్కువ పని మరొకటి వుండదమ్మా.. ఆనందరావు మామయ్యకు వాళ్ళు చాలా దగ్గర బంధువులు.. కుర్రవాడు బుద్ధిమంతుడుట!’’‘‘అయితే ఇంకేం.. నాతో బాటు నిన్ను గూడా తీసుకు వస్తానని చెబితే అంగీకరించటానికి ఇబ్బందేమిటిట?’’ఆయన చికాగ్గా కూతురు వంక చూచాడు.‘‘అతడికి నా వయస్సున్నంత తండ్రి వున్నాడు.. అంతకు రెండేళ్ళు తక్కువగా వున్న తల్లి ఉన్నది.. వాళ్ళిద్దరికీ ఈ అబ్బాయి ఒక్కడే కొడుకు.. వాళ్ళతోపాటు నన్ను కూడా ఎక్కడ నెత్తిన పెట్టుకుంటాడు... మనం చెప్పేదేదయినా సమంజసంగా ఉండాలి!’’‘‘పెట్టుకో వద్దను.. భార్యంటూ కావాలంటే కొన్ని బాధ్యతలు కూడా స్వీకరించగలిగే శక్తి వుండాలి.. అందునా కరుణలాంటి అమ్మాయి అయితే మరీను!’’ అన్నది పకపకా నవ్వుతూ.ఆ నవ్వును చూచి చలపతి చికాకు పడ్డాడు. జాలి పడ్డాడు. గుండె తడవగా బాధపడ్డాడు.

ఈ వ్యవహారం ఇలా ఓ కొలిక్కి రాకుండా నడుస్తున్నది గత అయిదు సంవత్సరాలబట్టి.ఆయన భార్య ఆరు సంవత్సరాల క్రితం మరణించింది.ఆయనకు ఒక్కతే కూతురు. బి ఎడ్‌ చదివి రెండు సంవత్సరాల క్రితం ఇంటికి దగ్గరలో వున్న ఓ స్కూల్లో టీచర్‌గా జేరింది.గత సంవత్సరమే ఆయన రిటయిరయ్యాడు. పెన్షన్‌ వస్తూంది.కరుణ బి.ఎడ్‌ చేస్తున్నప్పుడే సంబంధాలు చూడటం మొదలు పెడితే - ‘ముందు చదువు కానీయ్‌, తరువాత చూద్దాంలే’- అన్నది.చదువయింతరువాత మొదలు పెడితే - ‘నేను అత్తగారింటికి వెళితే, నీ సంగతేమిటి’- అన్నది.‘‘ఎవరి సంగతి వాళ్ళదే!’’ అన్నాడు ఆయన గుంభనంగా. ‘‘నాకు వంట చేయటమంటే బహు ఇష్టం... అధరవులు రెండు పూటలకూ ఒకసారే ఉదయాన చేసి పడేస్తే.. అన్నాన్ని ఏ పూటకు ఆ పూట వండుకొని వేడివేడిగా భోజనం చేయవచ్చు.. కాదంటావా.. ఏ రోజన్నా బద్ధకమేస్తే కూరలందించే దుకాణాలు వీధి వీధికీ వెలిసినయి.. ఇంకా దిగులు దేనికి.. అదీ చేసుకోలేనంటావా.. ఏ హోటల్‌కు వెళ్ళినా అత్తగారింట్లో మర్యాదలు చేసినట్లుగా చేసి భోజనం పెట్టి మరీ పంపిస్తారు!’’ అన్నాడు చాలా తేలిగ్గా.‘‘అక్కడకు వెళ్లేందుకూ ఓపిక లేకపోతే?’’ ఓ ప్రశ్న వేసి ఆయన దగ్గర సమాధానం ఉండదులే అన్నట్లుగా మొఖం పక్కకు తిప్పుకున్నది కరుణ.