చెల్లిని వొళ్ళో కూచోపెట్టుకుని కృష్ణుడు వంటింట్లో కబుర్లు చెప్పుతున్నాడు. వాళ్ళనాన్న పిలిచి చుట్టలు తెమ్మని డబ్బులిచ్చేడు.కృష్ణుడు వీధిముఖం చూడకుండా, మొగుడు చచ్చిన విధవలాగ ఇంట్లో దూరి కూచుంటున్నాడు. నాన్న చుట్టలు తెమ్మని పురమాయించేడు. హైస్కూలుదాటి చుట్టల దుకాణానికెళ్ళాలి. మేష్టర్లు, తోటి విద్యార్థులు అక్కడుంటారు. కృష్ణుడికి రోడ్డెక్కడమే నామోషిగా ఉంది. బడిపక్క నుంచి ఎలాగ వెళ్ళడమని గింజుకుంటూ బయలుదేరేడు.ఉదయం ఎనిమిది గంటలు కావొస్తున్నది. బడి పెట్టేవేళ. వీధి చివరనుంచే బడిగోల సముద్రపు ఘోషలాగ వినబడుతున్నాది. బడిపక్క నుంచి వెళ్ళక తప్పదు; రాక తప్పదు.బడి కనబడగానే కృష్ణుడికి బెంగపట్టుకుంది. హైస్కూలు పిల్లల గందరగోళంతో కలకల్లాడుతున్నాది. వరండాలు, గదులు, చుట్టూ రోడ్లూ, విద్యార్థులతో, విద్యార్థినులతో చూడ సొంపుగా ఉంది. రోడ్డు వారగా కృష్ణుడు తలొంచుకుని పరిగెట్టాడు.‘‘కృష్ణా!’’ అని స్కూలు వరండాలోంచి కేకొచ్చింది. కృష్ణుడు తిరిగి చూడక తప్పింది కాదు. నరిశింహం పరిగెట్టుకొచ్చి వాడి భుజం మీద చెయ్యేసి--‘‘ఏం రా, నువ్వు బళ్ళోకి రావడం లేదు?’’ అనడిగేడు.‘‘సోమవారం చేరుతాను’’ అని కృష్ణుడు చెప్పేడు.‘‘పుస్తకాలు కొన్నావా?’’‘‘ఇంకా లేదు’’‘‘వేగిరం కొనుక్కో, మళ్ళా అయిపోతాయి. ఎక్సరుసైజు పుస్తకాలు షాపుల్లో కొనకేం స్టోర్సులో చవగ్గా వున్నాయి. 

ధరలన్నీ దారుణంగా పెరిగి పోయాయిరా!’’నరశింహం డబుల్‌కప్సు చొక్కా, హనావాపేంటూ, జోళ్ళూ తొడుక్కుని నీటుగా ఉన్నాడు. కృష్ణుడుకి ఉన్న బట్టలన్నీ రెండు నిక్కర్లు, రెండు చొక్కాలు; ఉన్నాయంటే ఉన్నాయి. ఒక నిక్కరుకి పోస్టాఫీసుంది. ఒక చొక్కా భుజం చిరిగి జారిపోతే, వాళ్ళమ్మ ఎత్తికుట్టింది. చెయ్యి బుట్టలాగ లేచిపోయింది. రేవుకో జత. కృష్ణుడు పేంట్లు కుట్టించమని ఎప్పుడూ ఏడవలేదు. పేంటుకైతే బట్ట ఎక్కువ పడుతుంది. బట్ట ఎక్కువైతే డబ్బు ఎక్కువవుతుందని వాడికితెలుసు. మరి రెండు జతలు కుట్టించమని బతిమాలుకున్నాడు. కాళ్ళా వేళ్లా పడ్డాడు. ఏడ్చుకొన్నాడు. ప్రయోజనం లేక పోయింది.నరశింహం చంకలో కృష్ణుడికి కొత్త పుస్తకం కనబడ్డాది.‘‘ఏం పుస్తకం రా అదీ?’’ అనడిగేడు.‘‘ఇంగ్లీషు పుస్తకం. నేనన్ని పుస్తకాలూ కొనేశాను. జాగ్రఫీ పుస్తకమే కొనలేదు. జాగ్రఫీ పుస్తకాలింకా స్టోర్సు వాళ్ళకి రాలేదు. చూడు పుస్తకం’’ అని ఇచ్చేడు.కృష్ణుడు పేజీలు తిరగేశాడు. కొత్త పుస్తకంలోంచి ఒక విధమైన పరిమళం పైకి వచ్చింది. కృష్ణుడు పుస్తకం లోకి మొహం పెట్టి వాసన చూశాడు.‘‘కొత్త పుస్తకం వాసన బాగుంటుంది కదరా?’’ అన్నాడు నరశింహం.‘‘కమ్మగా ఉంటుంది. నాకెంతో ఇష్టం’’ అన్నాడు కృష్ణుడు.‘‘నీ కింగ్లీషులో ఫస్టు మార్కురాలేదు, కదరా?’’‘‘నాలుగు మార్కుల్లో పోయింది’’‘‘ఎవరి కొచ్చిందిరా?’’‘‘శకుంతల కొట్టేసింది’’‘‘నిజమే? నేన్నమ్మలేదు; దాని కెన్నొచ్చాయి?’’‘‘నా కరవై నాలుగు, దాని కరవై ఎనిమది’’‘‘ఆడపిల్లని మేష్టరు వేసీసుంటాడు’’.