ప్రసూనకు దేవుడు ఇచ్చిన వరం అందం. ఆ బ్రహ్మ ఎన్ని యుగాలు శ్రమకోర్చి తీర్చిదిద్దాడో గానీ,కోటి పున్నములు ఒక్కసారిగా సాక్షాత్కరించినట్లుగా వెన్నెల బొమ్మల్లే ఉంటుంది ప్రసూన.ఆమె కనుబొమలు వంగిన ధనువుకూ, సన్నపాటి నాసిక సంపెంగ పువ్వుకీ, పిడికెటంత నడుము సింహమధ్యానికీ, ఎర్రెర్రటి పెదాలు దొండపండుకూ సవాలు విసురుతాయి. సోయగాల సోకులాడి ప్రసూన. వైఢూర్యంలాంటి ప్రసూనకు తీరనిశాపం చిన్ననాడే తల్లిదండ్రులు పోవటం! వారి ప్రేమానురాగాలకు దూరమైన ఆమెజీవితానికి అర్థాన్నిచ్చింది, మేనమామ సుందరయ్య, అతని భార్య వసుమతి. ఆడపిల్ల ఆలనాపాలనా చూడ్డానికి వెనుకాడే ఆ రోజుల్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, పెద్దల సమక్షంలో సంరక్షకులుగా నిలిచారు. ఆ క్షణం నుండి,తల్లిదండ్రుల్లేని లోటు కనిపించలేదామెకు.ఎనిమిదో తరగతిలో ఉండగా వ్యక్తురాలైన ప్రసూన అందం చెప్పలేనంతగా విరాజిల్లింది. అందరికళ్ళు ఆమెపైనే నిలిచేవి. ఓసారి ఎవరో స్వామీజీ సుందరయ్య ఇంట అడుగు పెట్టినప్పుడు ప్రసూనను చూస్తూనే దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకుని ముద్దులాడేడు. తేళ్ళూ జెర్రెలూ ప్రాకినట్లు అయిపోయింది ప్రసూనకు. వెంటనే విడిపించుకుని మరీ పరుగు పెట్టింది.

ఆ సంగతి గమనించిన వసుమతి ‘‘తప్పుతల్లీ! నిన్ను ఆశీర్వదించడానికి దగ్గరకు తీసుకుంటే పారిపోతావా! వారిని శంకించకూడదు మహాప రాధం!’’ అని వెనకేసుకుని వచ్చింది. అయినా తుర్రుమన్నది ప్రసూన. ఎందుకోగాని ప్రసూనకు మగాళ్ళ పొడ గిట్టేది కాదు. కేవలం చదువులాటి విషయాల్లో తప్ప వారితో పొసగేదికాదు. పెద్ద చదువులు చదివినప్పుడు కూడా చదువు విషయంలో క్లాస్‌మేట్స్‌తో చాలా విషయాలు చర్చించేది. అయితే సహచర మగాళ్ళతో మైమరచిపోయి మాట్లాడ్డం, చేతులేసుకుని తిరగటం, చెప్పా పెట్టకుండా క్లాసులకు డుమ్మాకొట్టి సినిమాలకూ, షికార్లకూ తిరగటం, మెసేజ్‌లు ఇచ్చుకోడం అస్సలు నచ్చేది కాదు. వాళ్ళకు తలవాచేలా చీవాట్లూ వేసేది. అసలు మగాళ్ళతో రాసుకుపూసుకు తిరగాల్సిన ఆగత్యమేమిటని నిలదీసేది. ‘అందులో థ్రిల్‌ నీకేం తెలుసే! ఆ మజా స్వయంగా తెలుసుకోవాలంటే నువ్వూ ఎవరితోనైనా జతకట్టు’ అని ప్రసూనను ఎద్దేవా చేసేవారు స్నేహితులు. ప్రసూన అందం జుర్రుకోవాలని ఎప్పటికప్పుడు స్టూడెంట్స్‌ వెర్రివేషాలేస్తుండేవారు. ఫ్యాకల్టీలు ఏదో మిషపెట్టి పిలిచి చొంగలు కారుస్తూండేవారు. వేటికీ లొంగక స్థిరచిత్తంతో ప్రవర్తించేది ప్రసూన. మొత్తం మీద ప్రసూన దృష్టిలో మగాళ్ళు ‘మృగాళ్ళు’గా ముద్ర పడ్డారు. స్ర్తీని ఓ ఆటబొమ్మగా, విలాసవస్తువుగా చూస్తారనే అభిప్రాయం నాటుకుపోయిందామెలో. ఆ అభిప్రాయం ఆమె మనసులోంచి తొలగించేందుకు ఎంతగానో ప్రయత్నించారు సుందరయ్య, వసుమతి.