వెన్నెల్లో గోదావరి తళతళా మెరిసిపోతోంది...నీటిమీద నుండి వస్తున్న గాలితో-ప్రాణం ఒక్కసారిగా లేచివచ్చినట్లనిపిస్తోంది.అసలే అది వేసవికాలం...ఏ మాత్రం కొంచెం చల్లదనం తగిలినా-అలసటంతా ఆవిరైపోతున్న అనుభూతి.....ఆవేళలో.....గంగడు ఆ అమ్మాయి చేతిలో పళ్ళెం ఉంచాడు.‘‘మీరీ పక్కకి రండమ్మా...బాబుగోరు మీకు కుడిపక్కనుండాల....’’గంగడు నవ్వుతూ అన్నాడు.గంగడు చెప్పినట్టే ఆమె పక్కకొచ్చి నిలబడింది.‘ముందు బొట్టుంచుకోండమ్మా....’’ఆ అమ్మాయి పళ్ళెంలోంచి కుంకుమ తీసుకుని బొట్టు పెట్టుకుంది.‘‘అబ్బాయి గోరు...మీరు కూడ....’’ఆ అబ్బాయి కూడా బొట్టు పెట్టుకున్నాడు.‘‘పసుపుతోపాటు కుంకం కూడా గోదారితల్లికేసి దండం పెట్టుకోండి....మనసులో ఏముందో సటుక్కున కోరుకోండి....ఆలిసం సేయకుండా...’’ గంగడన్నాడు.ఆ ఇద్దరూ అలాగే చేశారు.గంగడు ఆ అబ్బాయిని కొబ్బరికాయ కొట్టమన్నాడు.

అది సరిగా గుండ్రంగా రెండు చెక్కలుగాపగిలింది.‘‘మీ పంట పండినట్టే....గోదారితల్లి సల్లగా సూసింది....ఇక పడవెక్కండి....’’గంగడు పలికిన ఆ మాట వాళ్ళకెంతో ఊరటనిచ్చింది.ఎంతో చూడముచ్చటగా ఉంది గూటిపడవ.కడియంపూలతో ముస్తాబుచేసిన ఆ ఇంజను పడవ-రంగు రంగుల పొదరిల్లులా సువాసనలు చిమ్ముతోంది.పడవకు ముందుభాగంలో కొంతమేర గంగడు ఉంటాడు. వెనకాతలంతా వచ్చే జంట ఉండటానికి వీలుగా - వెన్నెల కనిపించేలా ఒక గది. ఆ ప్రదేశం ఎంతో అందంగా తీర్చిదిద్దబడింది. ప్రత్యేకించి దానికోసం యజమానిచేత గంగడు ఎక్కువగానే ఖర్చుపెట్టించాడు. దానిబాధ్యతలన్నీ తనే చూసుకుంటాడు. ఎటొచ్చీ నెల నెలా అద్దె చెల్లిస్తాడు. అంతే!....‘‘బయంలేకుండా ఆయిగా కూకోండి....గంటన్నర తరవాతే ఒడ్డుకొత్తాం...అంతవరకు నా సోటు నాదే....మీది మీదే......’’ అంటూ గంగడు గూటిపడవ తలుపేసేశాడు.గంగడు పనివిషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. గూటిపడవ గుసగుసలేవీ తను వినిపించుకోడు. ఎవరెలా ఉన్నా తనకనవసరం. ఒక యోగిలా ఆ సమయంలో వ్యవహరిస్తాడు.ఆ గూటిలోకి అతని కళ్ళుకానీ, చెవులు కానీ ఎంతమాత్రం ప్రవేశించవు.

అసలు బయట ప్రపంచానికి వాళ్ళెలా ఉన్నారో తెలీకుండా కట్టుదిట్టంగా దాన్ని తయారు చేయించాడు. అందుకని ఆ పడవెక్కేవాళ్ళకు ఎటువంటి బెరుకూ, బిడియం కలగవు. అందులో ఆలుమగలు హాయిగా ఆకాసేపూ గడిపేయవచ్చు. అయితే అదొక్కటే నిషిద్ధం.....గూటిపడవ నడపటం మొదలెట్టాక గంగడి పేరు ఊరూవాడా మారుమ్రోగిపోతోంది. అందరూ అతన్ని గూటిపడవోడే అంటున్నారు. సంతానం లేనివాళ్ళు గంగడి గూటపడవెక్కితే బిడ్డలు పుడతారని ఒక నమ్మకం ఏర్పడింది. అందుకోసం ఎక్కడెక్కణ్ణుంచో జంటలు ముందుగా నమోదు చేసుకున్న ప్రకారం ఈ గోదారొడ్డుకు ప్రతి రాత్రీ చేరుకుంటారు. అందులో వేసవికాలమైతే- ఆ గూటిపడవకు ఒకటే గిరాకీ.