నగరంలో ఫుట్‌పాత్‌ ఎందరికో తల్లి, తండ్రి, దోస్త్‌! తొక్కుడు బండకున్నంత ఓపిక సామెత తిరగ రాయాల్సిందే. దినమంతా కాళ్ళ మోత, రాత్రయితే దిక్కులేనోళ్ళ అతాపతా, తెల్లారక ముందే పేపర్లు జమాయించే తక్త(గద్దె) బల్ల. తెల్లారినాక పాలపాకెట్ల కేంద్రం, దుకాణాలు తెరిచేదాకా ఇడ్లీ బండికి, కూరగాయల గంపకు శరణుదాత. మన కథకు మాత్రం ఫుట్‌పాత్‌ పైకి చేరే కూరగాయల గంపతోనే పని.అపార్ట్‌మెంట్‌ దిగి స్ట్రీట్‌ నెంబర్‌-2 లోంచి మెయిన్‌ రోడ్‌ మీదకొచ్చి రెండు సందుల అవతల ఫుట్‌పాత్‌పై ఉండే కూరగాయల బుట్టి దుకాణం ఉందో లేదో అని మూలమలుపు లోంచి తొంగి చూస్తూ చూపు సారించాడు వెంకటేశ్వర్లు. పండుగొస్తే చాలు వారం రోజులు డుమ్మా కొడతారు. ఊరు బంధం అలాంటిది. పాలు తాగే పిల్లాణ్ణి మరిపించి పనికెళ్ళే తల్లి తీరే మళ్ళీ పట్నంల పడ్తారు. తనకేమో అర్జంటుగా పచ్చి మిరపకాయలు కావాలె. గంప, గంప పక్కన బుట్టపరిసి సర్దిపెట్టిన ఆకుపచ్చని కూరగాయలు ఉన్నట్లే కనిపిస్తుంది అనుకుంటూ ఆ వైపు అడుగులు వేయసాగాడు.కూరలమ్మ లీలగా కనిపిస్తోంది, అమ్మంటే అమ్మంత కాదు, ముప్పై దాటిన వయసు. కాపుదానపు మనిషే గాని పంటలు పత్తా లేకుండా పోయి కడుపు చేతికొచ్చింది. బతుకు నగరానికొచ్చింది. పెద్ద మార్కెట్లోంచి కూరగాయలు తెచ్చుకొని మారు బేరం చేసి బతికే కుటుంబాలు నగరంలో వందల్లో ఉంటాయి. ‘ఊరికెళ్తే పల్లె సొరకాయలు తీసుకవస్తది. ఉంటే తీసుకోవాలె వాటి రుచే వేరు’ అని తలచుకుంటూ నాలుగడుగుల్లో చేరుకున్నాడు వెంకటేశ్వర్లు.ఆమె పేరేందో ఊరేందో గాని నల్లని రూపైనా నవ్వు మొకం. దగ్గరి చుట్టాన్ని చూసి నవ్వినట్లే పలకరిస్తది. 

‘‘సార్‌! రంధి పెట్టుకున్నరా రాదేమోనని... చుట్టాలు ఉండమన్నా గిరాకి పోతదని, జాగ జప్తయితదని ఆగలేదు’’ అంటూ బట్టగప్పిన గంపలో చేయిపెట్టి ఆకుపచ్చగా నిగనిగలాడుతున్న మోచేయి పొడువున్న సొరకాయని తీసి పసిబిడ్డని చేతిల పెట్టినట్టు వెంకటేశ్వర్లు చేతిలో పెట్టింది. అది తన కోసమే దాచిందని వేరే చెప్పనక్కరలేదు. వెలిగిపోతున్న ఆయన మొకాన్ని చూసి మురిసిపోతోంది. ఇదేం ఆత్మబంధం నాయనా అనిపించింది ఇంటిదారి పట్టిన వెంకటేశ్వర్లుకు.అప్పుడే పూజ మీంచి లేచి వచ్చిన వెంకటేశ్వర్లు భార్య కాంతం సంచిలో సొరకాయను చూడగానే భద్రకాళి అయింది. ‘‘మళ్ళా ఆ పిల్ల దగ్గరికి పోయినవా, దాని దగ్గర కొనకని ఎన్నిసార్లు చెప్పిన. ఏమన్నంటే అది మంచిగ మాట్లాడుతది, ఏరి ఏరి కూరగాయలిస్తది అంటవు. బేరమంటే అట్లనే ఉంటది. ఆడోళ్ళ తోటి కూరగాయలమ్మించుడంటే అంతే మరి, నీ అసోంటి మొగోళ్ళు సొంగకార్చుకుంట వస్తరని, అడిగినన్ని పైసలిస్తరని...’’ ఇలా సాగుతోంది దండకం. ఇంట్లో ఉద్యోగానికి తయారవుతున్న బిడ్డ ముందు కాంతం నోటికొచ్చిన మాటలంటుంటే మనసు చివుక్కుమనడంతో యోగతొంపుతో టాప్‌ ఫ్లోర్‌కెళ్ళాడు వెంకటేశ్వర్లు.