చలి చలి వేళల్లో జ్వలిత జ్వలనం. పున్నమివెన్నెల్లో రెచ్చిపోయే అగ్నితాపం.కళ్లింతల థ్రిల్లింతల్లో నిలువునా దహించే దగ్ధగీతం. వయ్యారాల వంపుసొంపుల్లోఎద సయ్యాటల సమ్మోహనం. సందు సందులోని సైబర్‌కేఫ్‌ సందళ్లలో...ఇంటింటికీ పరుచుకున్న ఇంటర్‌నెట్‌ యవనికల్లో...నిలువెత్తు హోర్డింగ్స్‌లో... 36-24-36కొలతల నెలతల మడతల్లో...పుట్టుకొచ్చే పులకింతల్లో సందడి చేసే గుండెచప్పుళ్ళెన్నో? నిప్పు సెగల నిట్టూర్పులెన్నెన్నో??అతి దగ్గరగా వినిపించిన ఆటో చప్పుడికి ఒక్కసారిగా ఉలిక్కిపడింది కాంతమ్మ.‘కూతురూ అల్లుడూ వచ్చారేమో?’ అనుకుంటూ వడివడిగా లేచి తలుపుతీసింది. ఆటోలోంచి కాలు బయటపెడుతూ సుప్రజ కనిపించడంతో ఆమె ఊహ సగం నిజమైంది. మరో సగం నిజం కావడం కోసం ఆత్రుతగా అటూ ఇటూ చూస్తుంటే... భుజానికి తగిలించుకున్న బ్యాగ్‌ తెరిచి మీటర్‌ చూసి ఆటో డ్రయివర్‌కి సుప్రజే స్వయంగా డబ్బులు చెల్లించడం ఆమెని ఆశ్చర్యపరిచింది.‘అంటే...?’ ఏదో సందేహం పట్టి పీడిస్తుండగా ఎదురేగి కూతురు చేతిలోని సూట్‌కేసును అందుకుంటూ... ‘ఇంతకీ అల్లుడుగారేరమ్మా?’’ అనడిగింది కాంతమ్మ.‘‘రాలేదు. నేనొచ్చాను కదా...సంతోషించు’’ కాస్త కోపంగా అంది సుప్రజ.

‘‘పెళ్లయిన కూతురు అత్తింటినుంచి రావడమెప్పుడూ పుట్టింటి వాళ్ళకి ఆనందమే! అయితే ఆ ఆనందం అల్లుడి గారితో కలిసొస్తేనే! ఒంటరిగా కూతురు ఇంటికొచ్చిందంటేఏ అమ్మానాన్నలకైనా బాధే కదమ్మా. ఇంతకీఅల్లుడుగారెందుకు రాలేదు?’’‘‘అమ్మా... ఇదివరకెన్నోసార్లు నీకు ఫోన్‌లో చెప్పాను. ఆయనకు నేనవసరం లేదని’’ ఆ మాట వింటూనే కాంతమ్మగుండె చివుక్కుమంది. ఆరు నెలల కిందట ఈ ఇంటి వాకిట్లోనే పెద్ద పందిరి వేసి ఆత్మీయాతిథుల సమక్షంలో పిల్ల పెళ్ళి చేసి పంపించింది.‘కానీ... అంతలోనే...’ ఆపై ఆలోచించలేకపోయింది.‘‘అమ్మా! ఒక్క విషయం చెప్పనా? నా పెళ్లయి ఆర్నెల్లే అయింది. కానీ, ఆయనకు రెండేళ్ళ కిందటే పెళ్ళయింది. నేను రెండో పెళ్ళాన్ని కదా! అందుకే అంత చిన్నచూపు.

ప్రతి విషయంలోనూ ప్రయారిటీ మొదటి పెళ్ళానికే! ఈవెనింగ్‌ పార్క్‌కి వెళదామంటారు. కానీ, రారు. సెకండ్‌షో సినిమాకి తీసుకెళ్తానంటారు. లేట్‌గా వస్తారు. ఒకవేళ ఇంటిపట్టున ఉన్నా ఎప్పుడూ ఇంటర్నెట్‌ ధ్యాసే! అలాంటివ్యక్తి పెళ్ళి చేసుకుని నరకం చూపించడమెందుకో?’’ కోపంగా అంటూ ముఖం కడుక్కోవడానికి బాత్‌రూంలోకి వెళ్ళింది సుప్రజ. పెళ్ళయిన ఈ ఆర్నెలల్లో మొగుడూ పెళ్ళాలిద్దరూ కలిసి రెండుసార్లు వచ్చారు. తొలి పండుగ దసరాకి మలి పండుగ దీపావళికి. ఈసారిలా కూతురొక్కర్తే ఇంటి గడప తొక్కింది. ఆమె ఈ రాక ఎన్ని అనర్ధాలకు కారణమవుతుందో ఏమో? ‘ఉస్సూ’రని నిట్టూరుస్తూ కాంతమ్మ వంటింట్లోకి అడుగుపెట్టింది కాఫీ కలపడానికి.