రిలాక్స్‌డ్‌గా పడక్కుర్చీలో వాలింది హరిత.అంతకు ముందురోజే పదవీ విరమణ చేసిందేమో, మనసంతా ప్రశాంతంగా ఉంది. వీడ్కోలు సభలో కొందరు తనను ఆకాశానికెత్తేసి మాట్లాడటం రొటీన్‌గా అన్పించినా, మరికొందరి మాటల్లో నిజాయితీ ఉండటం తృప్తిని కల్గించింది. ముఖ్యంగా వారంతా తనని పొగుడుతుంటే, కొడుకు విరించి కళ్ళలో కన్పించిన సంతోషం, సంభ్రమం ముచ్చటగా తోచింది. సాధన వచ్చి వుంటే అది మరింత మురిసేది అనుకొంది.‘‘చెల్లి కూడా వచ్చి ఉంటే బాగుండేది కదమ్మా’’ అని విరించి అనేసరికి...‘‘ఇవాళ మంచి రోజే ఉంది. సాధనను తీసు కొని వస్తావా’’ అంది.సభ పూర్తవగానే, విరించి అటునుంచి అటే సాధన ఇంటికి బయలుదేరాడు.ఓ గంట తర్వాత ఇంటికి వచ్చాడు విరించి నిరుత్సాహంగా.‘‘చూడమ్మా, ఎంత చెప్పినా నాతో రాలేదు. వాళ్ళాయనకు ఇబ్బందవుతుందట డెలివరీకి ఓ నెల ముందుగా వస్తాలే - ఆ తర్వాత ఎలాగూ మూడు నెలలు ఉండక తప్పదుగా అప్పుడు మీరంతా మళ్ళీ రండి’’ అంది సాధన అన్నాడు ఫిర్యాదు చేస్తున్నట్లు.‘‘ఆడపిల్లలంతేరా, రేపు నీ కూతురైనా అంతే. ఏంటో నాన్నమ్మగా దాంతో ఎక్కువగా గడపలేక పోతున్నాను ఈ దూర భారాల వల్ల’’ అంది హరిత, మనవరాలిని తల్చుకుంటూ.‘‘చెల్లి వస్తే లీవ్‌ ఎక్స్‌టెండ్‌ చేద్దామను కున్నాను, ఇంకెందుకు ఈ రాత్రికే వెళ్ళిపోతాను. సాధన మనింటికి వచ్చాక ఓ పదిరోజులుండేలా రమ్యనీ, పాపనీ తీసుకొని వస్తాను’’ అంటూ ఆ రాత్రే బెంగుళూరు వెళ్ళిపోయాడు విరించి. ఆ మరునాడు ఫోన్‌ చేసి ‘‘సారీ అమ్మా, నిన్న రాలేకపోయాను. పార్థూకి నేను లేనిదే తోచదు. నాకూ అంతేననుకో’’ అంది సాధన. నవ్వుకొంది హరిత.

డబ్బుని, కెరియర్‌నీ చూడకుండా పార్థుకి ఇల్లాలయింది. పార్థసారథీ అంతే కట్న కాను కలకు ఆశపడలేదు. ‘పెళ్ళయ్యాక ఇల్లాలిగా, పిల్లల ఆటపాటలని ఎంజాయ్‌ చేసే తల్లిగా వుంటే చాలు. జీతాలెక్కువని పరుగులు ఉరుకులు పెట్ట కుండా’ అన్నాడు. సాధనందుకు ఒప్పుకుంది. ఆమె మాటల్లో తను ఎంత ఆనందంగా, తృప్తిగా వుందో తెలిసిపోతూనే వుంటుంది హరితకు. అందుకే నిశ్చింత. ఇక విరించి విషయానికొస్తే డిగ్రీ ఇలా ముగించాడో లేదో పెద్ద పేరున్న ఎమ్మెన్సీలో జాబ్‌ రావటంతో బెంగుళూర్‌కి వెళ్ళాడు. అక్కడ రెండేళ్ళు జాబ్‌ చేసాడు. తన కొలీగ్‌ అయిన రమ్యని ఇష్టపడ్డాడు. హరితకు చూపించి ఆమె అంగీకారంతోనే పెళ్ళి చేసు కున్నాడు. వాళ్ళకో పాప శ్రీనిజ. ఇంట్లో అంతా ముద్దుగా ‘సిరి’ అని పిలుచుకుంటుంటారు. వాళ్ళిద్దరికీ సెలవు దొరికినప్పుడు ఓ వారం రోజుల పాటూ ఉండేలా వస్తారు. ఆ వారం సెలవు పెట్టి వాళ్ళతో గడిపేది హరిత. ఐతే కొత్త మూలంగా రెండ్రోజులపాటు కాస్త దూరం దూరంగానే ఉండేది సిరి. బాగా మాలిమి అయిందనుకొనే సరికి వాళ్ళు వెళ్ళాల్సిన రోజు దగ్గర పడేది. పాపని వదల్లేక హరిత బాధపడుతూంటే ‘‘ఇందుకే చెబుతున్నా ఆ ఉద్యోగం మానేసి మాతో ఉండమ్మా అని. నువ్వే వినడం లేదు’’ అనేవాడు. కానీ వంట్లో శక్తి వున్నంతకాలం, కష్టపడాలన్న నైజం వల్ల సున్నితంగానే వాళ్ళకి తన అంగీ కారాన్ని తెలియజేసేది.