వాళ్ళిద్దరూ ఒకళ్ళెదురుగా వొకరు కూర్చున్నారు. పక్కనే నిలువెత్తు కిటికీ, కర్టెన్లు పక్కకు జరిగి వున్నాయి. దూరంగా సూర్యుడు వాలి పోతున్న సన్నివేశం నీలిరంగు కాన్వాస్‌పై చెయ్యి తిరిగిన కళాకారుడు తీర్చిదిద్దిన దృశ్య కావ్యంలా వుంది. క్షణక్షణం మారుతున్న రంగులు, రేఖలు తుదిమెరుగులు దిద్దుతు న్నట్టు వుంది. వాళ్ళిద్దరూ నడివయస్కులైన దంపతులు. వాళ్ళిపడు విశాఖపట్నంలో ఒక స్టార్‌ హోటల్‌లో బస చేసి వున్నారు. పెళ్లైన ముప్పై ఏళ్ళకు వూరు వదలి సరదాగా హనీమూన్‌కి వచ్చారు.రూమ్‌లో కాలింగ్‌ బెల్‌ పిట్టలా అరిచింది. ఒక్కసారి సూర్యాస్తమయం చిట్లిన అద్దంలా ముక్కలు ముక్కలై, జారిపోయింది. అనూరాధ రామకృష్ణ దంపతులు చూపు రూమ్‌ డోర్‌వైపు తిరిగింది. రామకృష్ణ ‘‘కమాన్‌’’ అని అనేంతలోనే బేరర్‌ ట్రేతో సహా రూమ్‌లోకి వచ్చాడు. స్టార్‌ మర్యాదలతో ట్రేని టీపాయ్‌ మీద వుంచాడు. థాంక్స్‌ అందుకుని వినయంగా బయటకు నడిచాడు బేరర్‌.అతను ట్రేలో వున్న కెటిల్స్‌ టోపీలు తీశాడు. డికాషిన్‌ కపలోకి వంపుతున్నాడు. అనూరాధ ట్రేలో వొకపక్కన వున్న అందమైన లెదర్‌ ఫోల్డర్‌ తీసింది. దానిలో వున్న కంప్యూటర్‌ బిల్లు చూసింది. కళ్ళు మరింత పెద్దవి చేసి చూసింది.‘‘ఏవండీ కాఫీ అరవై రూపాయలా’’ అంది.‘‘టాక్సులు అదనం, టిప్పు వేరే’’ నవ్వుతూ అన్నాడు రామకృష్ణ.‘‘పరమ దండగ. యీ డబ్బుల్తో నెలరోజులు కాఫీ తాగచ్చు’’ అతనేమీ పట్టించుకోకుండా, కాఫీ కలిపి ఐస్‌ క్యూబ్స్‌ వేసి ఆవిడ చేతికి అందించాడు కప్పు. భర్త ఏమీ చలించక పోవడంతో మరింత కోపం వచ్చింది.‘‘అసలు.. వాడున్నాడే వాడు.. మన సుపుత్రుడు.. వాడిని అనాలి’’ భార్య మాటలు వినీవినన ట్లుగా కాఫీ సిప్‌ చేస్తూ ఆనందిస్తున్నాడు రామకృష్ణ.‘‘ఎందుకు చెప్పండి యీ దండగమారి పనులు. 

అమెరికాలో వుద్యోగం అయితే మాత్రం వూరికే యిస్తారా డబ్బులు! పెళ్లై ముప్పై ఏళ్లు అయితే, యిట్లా వూరుగాని వూరు వచ్చి డబ్బులు తగలేసుకోవాలా..’’ ఆవిడ మాటలతో నిమిత్తం లేకుండా రిమోట్‌తో టివి ఆన్‌ చేసి, కాఫీ కప ట్రేలో పెట్టాడు రామకృష్ణ. అనూరాధ చాలాసేపు రకరకాల భంగిమలలో తలచేతులు తిప్పుతూ ఏదేదో మాట్లాడుతూనే వుంది. కాసేపటికి కుదుట పడి, టివి చూడడంలో నిమగ్నమైంది.గదిలో డల్‌లైట్‌ సమంగా పరుచుకుంది. టీవిలో ఛానెల్స్‌ వరసగా రిమోట్‌లో నొక్కు తున్నాడు రామకృష్ణ. ఏవేవో గబగబా తెరమీదకు వచ్చి, క్షణంలో మారిపోతున్నా యి. రిమోట్‌ వెనకాల ఛానెల్‌ వివరాలు వున్నాయి. ఎక్కడెక్కడ అడల్ట్స్‌ ప్రోగ్రాము లు వస్తాయో ఆ నెంబర్లను విడిగా యిచ్చారు దానిమీద. రామకృష్ణ ఉత్కంఠతో వొక నెంబరు ప్రెస్‌ చేశాడు. ఏదో ఇంగ్లీషు సినిమా నడుస్తోంది. మరొకటి నొక్కాడు. అక్కడ భాషలేని చిత్రం వస్తోంది. ఒక బెడ్‌రూమ్‌లో ఆడమగ జంట. యాక్షన్‌ తప్ప డైలాగ్‌ లేని చిత్రం. పైగా వారి ప్రతి కదలిక అసభ్యంగా వుంది. అప్రయత్నంగా భార్యవంక చూశాడు రామకృష్ణ. ఆవిడ చాలా ఆసక్తిగా చూస్తోంది. నిజానికి తనకూ చూడాలనే వుంది. తెరమీద కథగాని కథ నడుస్తోంది.