ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎర్రటి ఎండ, ఉక్కపోతా ఏమయిపోయాయో తెలీదు. ఎవరో మంత్రించిన ట్టుగా ఆ రెండూ మాయమయిపోయి, వాటి స్థానంలో నల్లటి మబ్బు, గాలీ వచ్చాయి. గాలికి పార్కులో చెట్లన్నీ ఊగిపోసాగాయి. అక్కడక్కడా పడి ఉన్న చిత్తు కాగితాలు, ఎండిన ఆకులూ గాలికి పైకి లేచి పార్కులో ఉన్న వారి కళ్ళకి, కాళ్ళకీ అడ్డం పడుతోంటే ‘చిఛీ’ అనిపించింది. టప్‌...టప్‌...టప్‌...టపటపటపామంటూ చినకులు ప్రారంభమయ్యాయి. ‘రారా’ అంటూ తన చేయి పట్టుకుని పరుగుదీసింది నళిని. ఆడపులి అంటారే! అలా పరుగెత్తింది నళిని. ఆమెని అనుసరించాడు తను. ఇద్దరూ పార్క్‌ వాచ్‌మన్‌ క్వార్టర్స్‌ దగ్గరకి వచ్చారు. అందరితో పాటు వర్షానికి తడవకుండా అక్కడ నిల్చున్నారు. ఆయాసపడుతోంది నళిని. నోరు తె రచి, ముక్కు రంధ్రాలు పెద్దవి చేసి ఊపిరి పీల్చుకుంటోందామె. తనూ ఆయాసపడుతున్నాడు. ఊపిరి పీల్చుకుందికి ముక్కు రంధ్రాలు పెద్దవి చేశాడు. నోరు కూడా తెరిచాడు.నోరు ఇలా తెరిచాడో లేదో నోట్లోంచి నాలుక మూరెడు బయటికి వచ్చింది. గుండెల మీదఅది టైలా వేలాడసాగింది. ఏదయితే బయటపడకూడదని తనింతసేపూ జాగ్రత్తపడ్డాడో అదిప్పుడు బయటపడిపోయింది. ఎవరయినా చూస్తున్నారా? అని అటు ఇటూ చూసి, తననెవరూ గమనించట్లేదన్నది తెలుసుకుని గబగబా నాలుకను మడత పెట్టి నోట్లో కుక్కుకున్నాడు. మడత కాజాలా నోటినిండా నాలుకే! నోరు మూసుకున్నాడు.

టపటపటపామంటూ పడుతోన్న చినుకులు టప్‌...టప్‌...టప్‌మని ఆగిపోయాయి. అందరూ మళ్ళీ పార్కులోకి చేరుకోసాగారు. ‘పద’అని నళిని పార్కులోకి లాగింది తనని.‘‘ఇప్పుడు చెప్పు! మనిద్దరం ఎప్పుడు లేచిపోదాం’’ అడిగింది నళిని.‘‘ఏదో ఒకటి మనం ఇవాళ తేల్చుకోవాలి! తేల్చుకుంటే ఇవాళ రాత్రి మా వారికి చెప్పేస్తాను, మీ దారి మీది-నా దారి నాదని! ఏవంటావ్‌’’ మళ్ళీ అడిగింది నళిని.‘‘వాడితో పడలేనురా! శాడిస్ట్‌ వాడు’’ అంది.‘‘ఏవంటావ్‌’’ అడిగింది.‘‘ఏంటి? నేనిలా మాట్లాడుతోంటే నువ్వేంటి ఏం మాట్లాడ్డం లేదు? నా ప్రపోజల్‌ నీకు నచ్చలేదా’’ అడిగింది నళిని.‘‘నిన్నే అడుగుతోంది. మాట్లాడవేంటి’’ రెట్టించింది. మాట్లాడాలనే ఉంది కాని, మాట్లాడాలంటే నోటినిండా నాలుకే ఉంది. మాట రావడం లేదు. పైగా మాట్లాడితే నాలుకెక్కడ పాములా దిగజారుతుందోనని భయంగా ఉంది.‘‘ఏంటి ప్రభూ! వాట్స్‌ యువర్‌ ఒపీనియన్‌? మాట్లాడు’’ అంటూ మూసుకున్న తన నోరుని పెదవులు పట్టి తెరిచే ప్రయత్నం చేసింది నళిని. అంతే! సర్రున నాలుక అంత పొడవున ఊడిపడింది. చూసి ‘కెవ్వు’మంది న ళిని. భయంతో కళ్ళు మూసుకుంది.‘‘ప్రభూ! ప్రభూ’’ అమ్మ పిలుపది. నిద్రలోంచి మేల్కొన్నాను. ‘ఏంటమ్మా’ అంటూ కళ్ళు నులుముకుని చూద్దునో! అమ్మ ఏడుస్తో కన్పించింది.