‘‘ఊరుకోరా బావూ ఉసులొత్తాయీ.... పల్లకోరా బావూ పాములొత్తాయి... జో, పాములకు పది ఏల్లూ.... నీకు నూరేల్లూ...జో’’ గడపలోని పెణక వాసానికి వేలాడుతున్న ఉయ్యాలలోని మనమడికి జోలపాట పాడుతోంది గౌరమ్మ.‘‘అప్పా సిన్న పొవ్వాకు రెమ్ముందేటి? సుట్టముక్క నేక నోరు కంపుగొట్టెత్తంది’’ అంటూ గడపలోకివచ్చి కూర్చొంది ఎదురింటి పారమ్మ.‘‘రాయమ్మా! రాయె అనుమంతుడు అడుక్కుతింతే గరుతమంతుడు గోక్కుతిన్నాడట. నిన్నటి నుండి సుట్ట నేక నేను సుట్టికి పోతుంటే మద్దిని నీ గోలొకటి. పేనమదొకలాగయిపోయి మరుండలేక పొద్దుట మా సిమాసలం ఎరువుకోసం పట్నం బయదేలతుంటే నాయినా పెద్దరెమ్మన్న పొవ్వాకు తేవడం మరిసిపోకని మరీ, మరీ సెప్పినాను. తెత్తాడో, తేడో!’’ అంది గౌరమ్మ.మనమడు నిద్రలోకి జారుకున్నాక ఇద్దరూ కబుర్లలో పడ్డారు. ‘‘అప్పా సేసినెవసాయం సేత్తన్నం గాని ఆపాటి గింజలు ఇంటికొచ్చీసరికి తలపేనం తొక్కత్తందనుకో’’ అంటూ ‘‘అవునూ రవనెటెల్లిందేటి?’’ గౌరమ్మ కోడలు నుద్దేశించి అడిగింది పారమ్మ.‘‘ఇంటిల్లపాదీ కూకోనుంతే మరిదినం గడొద్దా? పిక్కిరోడ్ని నా దగ్గరుంచీసి పొయ్యిలోకి నెరానేవని సింతలసెరువు దగ్గర జనువులొలుపుకెల్లింది. ఆడా అలగ ఎరువు గుండకని మగ్గం లోని కండినాగ ఇంటికి, పట్నంకి తిరుగుతండు. పొలానికాసెల్తే పేనముసూరుమంతంది’’ గౌరమ్మ నిట్టూర్చింది.

‘‘పోనీ ఆ దొరబావు దగ్గరుంతాదేటోగుండ. మొన్నొకమాట మా సిన్నోడెల్లి తెచ్చుకుండు’’ అని చెప్పింది పారమ్మ.‘‘అలగనడిగితే నా పొలానికే ఎరువు నేక నానా పర్రాకులు పడతన్నాను. మద్దిలోన నీ గోలేట్రా నాయనా!’’ అని అంతండట. అతగాని పొలం పక్కనే మా మడిసెక్కుంది కదా! రెండు మూడుసార్లు అమ్మీమని అడిగినాడట. ఉన్న పొలమంతా సాలదని బావూ అదమ్మిత్తే మా బతుకు సంగతేటని! అడిగితే అదా ఆ కోపం తోటే గదా నీటి సుక్కలివ్వకుంట ముప్పుతిప్పలు పెట్టీసినాడు. సివరకు బట్టతడుపు సినుకులు పడ్డాయంతే యిదా ఈ సికాకొచ్చి పడ్దాది. ఎన్నొదిలి నేలకి గుండెయ్యకపోతే పడిన కట్టమంతా వొట్టినపోద్ది. పచ్చగడ్డి కింద పసువులికేసీడమే తప్ప మరొక్క దిక్కునేదు’’ అంటూ గౌరమ్మ వీధి వైపు చూసింది.్‌్‌్‌పట్టణంలో మార్కెట్‌ యార్డు దగ్గర గందరగోళంగా ఉంది. ఎరువుల కోసం సుమారు ఇరవై, పాతిక గ్రామాలకు చెందిన రైతులు అక్కడికి చేరుకొన్నారు. ఈ రోజైనా ఎరువులిస్తారో! లేదో! అందరిలోనూ ఒకటే ఆందోళన.వచ్చిన నుండీ అలాగే ఎండలో నిలబడి ఉండడం వలన పొద్దున్ననగా తాగిన గెంజి నీళ్ళు సింహాచలం కడుపులో ఎపుడో ఇంకిపోయాయి. మధ్యాహ్నం ముదిరిన ఎండకి సింహాచలం ముఖము చెమటతో తడిసిపోయింది. మెడలోని తువ్వాలుతో ముఖాన్ని తుడుచుకొన్నాడు. నాలుక పిడచ కట్టుకు పోవడంతో మంచినీళ్ళైనా తాగి వస్తానని తోటి రైతుకి చెప్పి దగ్గరలో ఉన్న పాన్‌షాపు వైపుకి దారితీసాడు.