‘‘ఏయ్‌ సరూ, ఈ మధ్య ఫేస్‌బుక్‌లో చాటింగ్‌ చేస్తూ పరిచయాలు పెంచుకుంటున్నావ్‌. పరిసరాల్ని, నాలాంటి వారి స్నేహాన్ని మరచి మరీ చాటింగ్‌లో మమేకమవుతున్నావా?’’ సునంద ప్రశ్న.‘‘పెద్ద పరిచయాలేమీ లేవుగాని, రాజేష్‌ అనే ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌తో కొంత చనువు పెంచుకున్న మాట నిజం’’ దాచుకోకుండా స్నేహితురాలితో చెప్పింది సరళ.‘‘రాజేష్‌ నన్ను ఇష్టపడుతున్నాడు. నాకూ అతని అభిప్రాయాలు నచ్చాయి. ఈ మధ్యనే ఒకరినొకరు వ్యక్తిగతంగా కలుసుకున్నాం. నాతో జీవితం పంచుకోవాలని తెగ ఆరాటపడుతున్నాడు. నేను కూడా కొంత సీరియస్‌గానే ఆ విషయాన్ని తీసుకున్నాను.’’‘‘ఓహో సైబర్‌ ప్రేమ ముదిరి పాకాన పడిందన్నమాట. ఇంకేం పెళ్ళితో ఏకమవడమే తరువాయి’’ గోప్యత లేకుండా చెప్పిన మాటకు స్పందించింది సునంద.‘‘అంతవరకూ రాలేదు. ఇంకా జర్నీ చాలా ఉంది.’’ ఇంక ఆ ప్రసక్తికి స్వస్తి పలకాలని సంకేతా లిచ్చింది.

కాలేజీ కేంపస్‌ ఇంటర్వూలో సెలెక్ట్‌ కాబడి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా బెంగుళూరులో ఉద్యోగం సంపాదించిన ఇద్దరు స్నేహితురాళ్ళ సంభాషణ ఇది. ఇద్దరూ విశాఖపట్నం వాసులే. ఒకే వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టల్‌లో వేరువేరు రూముల్లో ఉంటూ నెలకోసారి సొంతూరు వెళ్ళి తల్లిదండ్రులతో గడుపు తుంటారు.

శరీరాలు రాసుకున్నాయి. వలపులు రాజు కున్నాయి. హద్దులు దాటి ప్రయాణించింది ప్రణయం. కౌగిళ్ళ కోసం కవ్వించింది వయసు పొంగు. వేడివేడి ఊపిరులతో వాతావరణం వేడెక్కి పోయింది. పట్టు తప్పిన మైకం గట్టు తెగి పడింది. కమ్మని ఊసులు ముసురుకున్నాయి. రసరమ్యమైన ఆ దృశ్యానికి అడ్డుకట్ట వేస్తూ

‘‘మనం పెళ్ళి చేసుకుందాం. మా తల్లిదండ్రులకు చెప్పి ఒప్పిస్తాను.’’ సరళ మాటలకు రాజేష్‌ ముఖంలో రంగులు మారాయి.‘‘ఆ తొందరే వద్దు. మనం కలిసి జీవితం పంచుకోవాలనుకుంటే ఏ అరమరికలు, అభి ప్రాయ భేదాలు కలగకుండా జీవితాంతం గడపగలమనే నమ్మకం ఏర్పడాలి. అందుకు తగిన పునాది మనం నిర్మించుకోవాలి. ఓ భరోసా ఏర్పడిన తరువాత పెళ్ళికి సిద్ధమవుదాం’’‘‘నీ మాటలు నాకు అర్ధం కావటం లేదు. వివరంగా చెప్పు’’ సరళ.‘‘ఏముంది. మనం పెళ్ళికి ముందు కొద్ది కాలం సహజీవనం చేద్దాం. మనసులు బాగా దగ్గర చేసుకుని మనువుకి మార్గం సుగమం చేద్దాం. ‘‘డేటింగ్‌’’ పేరుతో ఈ ప్రక్రియ పాశ్యాత్య దేశాలలో చాలా ప్రాచుర్యం పొందింది. సహజీవనంగా మన దేశంలోనూ వేళ్ళూనుకుంటోంది.