సితార్‌ వింటూ ఉయ్యాల బల్లపై బోర్లా పడుకొని పుస్తకం చదువుతోంది హరిణి. మంచి ముత్యపు రంగుకు కెంపు బార్డరు వున్న చీరకట్టుకుంది. గులాబీ రంగులో నాజుగ్గా వున్న ఆమె పాదాలు సితార్‌ వాయిద్యానికనుగుణంగా ఊగుతున్నాయి. కాళ్లనంటి పెట్టుకున్న సన్నని బంగారపు పట్టీలు ఆమె చర్మపు కాంతిలో వెలవెలబోతున్నాయి. మెడ వెనుకగా భుజాల మీదుగా నడుం వరకూ వదిలేసిన కురులు కిటికీ లోంచి వస్తున్న వెలుగుకు రాగి రంగులో మెరుస్తున్నాయి. జుట్టు అలా వదులుకోవడంలో నుదుటి మీదుగా కళ్లపైకి జారుతున్న ముంగురులను నాజుకైన వేళ్లతో పైకి అనుకుంటోంది. అపడామె వేలికున్న ఒంటి రవ్వ ఉంగరం చమక్కుమంటోంది.విశాలమైన ఆమె కళ్లు పుస్తకంలోని వాక్యాలపై కదులుతూ మధ్య మధ్య గోడ గడియారం వంక చూస్తున్నాయి. ఒత్తయిన ఆమెకనుబొమలు, సన్నటి పొడవైన నాసికతో ఆమె ముఖం ఎంతో ఆకర్షణీయంగా వుంది. ఆమె తలలో అక్కడక్కడ నెరిసిన వెంట్రుకలు ఆమె అందానికి హుందాతనాన్ని ఆపాదిస్తున్నాయి. బయట వేసవి ఎండ మండిపోతున్నా లోపల సెంట్రల్‌ ఎసిలో వున్న ఆమె మంచులో తడిసిన నందివర్ధనంలా వుంది. 

ఆ ఇంట్లో గోడలకు తెలుపురంగు వేసి వుంది. సోఫాలూ, కుర్చీలూ, తెల్లని అపోల్‌స్ర్టీతో వున్నాయి. పెద్ద పెద్ద అద్దాల కిటికీలకు పాలనురగలాంటి లేసు పరదాలు వున్నాయి. ఎటు చూసినా ధవళ వర్ణమే. అదామె స్వచ్ఛమైన మనసును ప్రతిబింబిస్తున్నట్టుగా వుంది.గోడ గడియారం సంగీతభరితంగా రెండు గంటలు కొట్టింది. ఆ శబ్దం వినగానే ఆమె ఒక్క ఉదుటున లేచింది. పరుగులాంటి నడకతో బయటకి వెళ్లింది. గేటుకు బిగించి వున్న పోస్ట్‌ బాక్స్‌ని ఆత్రంగా తెరిచింది. అది ఖాళీగా వుంది. ఆమె ముఖంలో నిరాశ చోటుచేసుకుంది. వెనక్కి తిరిగి మెల్లగా నడుస్తూ ఇంట్లోకి వెళ్లింది. ‘‘...... ఉత్తరం రాలేదెందుకని?’’ ఆమె మనసు ఆలోచనలో పడింది. ‘‘ఆరు నెలలుగా ప్రతి శుక్రవారం ఠంచనుగా వచ్చే వుత్తరం ఈరోజు రాలేదెందుకో...?’’అసలు ఆ వుత్తరాలు రాస్తుందెవరో కూడా ఆమెకుతెలియదు. కానీ ఆరునెలల క్రితం ఎప్పటిలాగా పని కుర్రాడు ఆనాటి పోస్టు తెచ్చాడు. అందులో ఎక్కువగా కట్టాల్సిన బిల్లులూ అవే వుంటాయి. ఆరోజు తన పేరున ఓ వుత్తరం వచ్చింది. తనకు వుత్తరాలు రాసేవాళ్లెవరూ లేరు.అమెరికాలో వున్న పిల్లలిద్దరూ ఫోన్లూ, ఈ- మెయిల్‌ చేస్తారే కానీ వుత్తరాలు రాయరు. ఎవరై వుంటారూ... ఆమె కళ్లు ముత్యాల్లాంది వాక్యాల వెంట కదిలాయి. ఏకబిగిన చదివింది. వుత్తరం చివర శ్రేయోభిలాషి అని వుంది.ఎవరై వుంటారు? ఒక్క క్షణం మాత్రం ఆలోచించింది. రాసిందెవరో కానీ తన మనస్థితినెరిగి రాశారు. మనసుకు స్పృశించిన ఆ వుత్తరాన్ని మళ్లీ చదివింది.