ఆ రోజు ఆదివారం. శ్రీనిధి భర్త రఘు పనిచేసే ఆఫీసులో అతడి కొలీగ్‌ కరుణాకర్‌ కూతురు మూడేళ్ల పాప బర్త్‌డే ఫంక్షన్‌ వుంది. ఫంక్షన్‌కి ఏ చీర కట్టుకోవాలో నిర్ణయించుకోలేక బీరువాలోని చీరలన్నీ మంచం మీద కుప్పలా పోసింది. ఎక్కడ ఏ ఫంక్షన్‌కి వెళ్లాలన్నా, చీర దగ్గర్నుంచి నగల వరకూ ఏదీ ధరించాలో నిర్ణయించుకోవడం చాలా కష్టమైన పని శ్రీనిధికి.తను పట్టుచీర కట్టుకెళితే అందరూ మామూలు చీరలు కట్టుకొని సింపుల్‌గా తయారయి వస్తారు. తనని ఎగాదిగా చూస్తారు. అందరూ ఒక దారైతే తనొక్కత్తీ వేరుగా వున్నట్లు తెగ ఫీలయిపోతుంది. అలాగని తన మామూలు చీర కట్టుకెళితే అందరూ పట్టుచీరలు కట్టుకుని తయారవుతారు. అపడు ఎగాదిగా చూస్తారు. ఇదేమిటి ఇలా తయారయింది అని! తను నగలు పెట్టుకుంటే అందరూ ఏమీ వేసుకోకుండా వస్తారు. అలాగని తనేమీ నగలు పెట్టుకోకుండా వెళితే అందరూ నగలు దిగేసుకొని వస్తారు. 

ఏమిటింత పెద్ద ఫంక్షన్‌కి ఇలా తయారయిందేమిటా? అని తనతో మాట్లాడుతూ మధ్య మధ్యలో ఎగాదిగా చూస్తూ వుంటారు.అందుకే శ్రీనిధి నిదానంగా ఆలోచిస్తోంది. ఏయే ఫంక్షన్లకి ఎలాంటి ఫంక్షన్లకి అందరూ ఎలా తయారవుతున్నారో గుర్తు చేసుకుంది. సరే. ఇది బర్త్‌డే ఫంక్షన్‌ కదా అని పంజాబీ డ్రస్‌ వేసుకొని దగ్గరలో కొత్తగా పెట్టిన బ్యూటీ పార్లర్‌కి వెళ్లింది. తన పొడవాటి జుట్టుని చక్కగా జడ అల్లుకోకుండా, పార్టీకి వెళ్లే విధంగా తయారు చేయమని చెప్పి జుట్టుంతా ఆ బ్యూటీషియన్‌ చేతిలో పెట్టేసరికి, ఇక దొరికిందే చాలని ఆ జుట్టునంతా దొరకపుచ్చుకొని, ఓ రెండు గంటలు అటు దువ్వి, ఇటు దువ్వి, పైనించి పాతిక రకాల సన్నని పాయలు తీసి, వాటితో సన్నని జడలు అల్లి, ఆ జడలన్నీ కింద జుట్టులో కలిపి, ఆ జుట్టుని మూడు భాగాలు చేసి, ఒక భాగం చుట్టు ముడి వేసి, మధ్య మధ్యలో పిన్నులు పెట్టి, మళ్లీ ఇంకో భాగం జుట్టుని చుట్టూ తిప్పి పిన్నులు పెట్టి, మళ్లీ మూడో భాగం జుట్టు చుట్టూ తిప్పి ముడి వేసి, పిన్నులు పెట్టి చివర మూడు భాగాలుగా జుట్టు కలిపేసి, మళ్లీ రెండుగా చేసి, ఒక భాగం జడలలాగ, రెండవ భాగం ఇంకో జడలాగ అల్లి, ఒక జడ ఒక వైపు, ఇంకో జడ రెండో వైపు చుట్టి చుట్టి, మళ్లీ ముప్ఫై పిన్నులు గుచ్చింది. చివరగా ఆ ముడికి నెట్‌ తగిలించి, నాలుగు తెల్లరాళ్ల పిన్నులు గుచ్చింది. అద్దంలో చూసుకంటే తన మొహం తానే గుర్తు పట్టలేకుండా వుంది శ్రీనిధికి. ఊసూరుమంటూ పర్సులో వున్న రెండు అయిదు వందల నోట్లు, అక్షరాలా వెయ్యిరూపాయలూ ఆ బ్యూటీషియన్‌కి సమర్పించింది.