‘రాత్రి పదకొండు. సరిగ్గా రాత్రి పదకొండు. నీ పతి సేవ... హస్బెండ్స్ డ్యూటీ కాదు మేడమ్‌... డ్యూటీ టు యువర్ మోస్ట్ హేటెడ్ హస్బెండ్..  ముగించుకుని రెడీగా ఉండు కూతురి డ్యూటీకి...’ హైమ నుంచి వాట్సప్‌ సందేశం.‘విక్రం తిరిగొచ్చాడేమో వేళాకోళం కనబడుతోంది మెసేజ్‌లో...’ అనుకుంది కృష్ణవేణి. వంటింట్లో స్టౌ మీద నీళ్ళు మరుగుతున్నాయి. రాత్రి వాటిని శివమూర్తి మంచం దగ్గర పెట్టాలి. లేకపోతే ప్రాణాలు తోడేస్తాడు. తొమ్మిదవుతోంది. మిక్సీలో కూరా, అన్నం వేసి రుబ్బటం మొదలెట్టింది. పొద్దుటి కూర కాదని ఎలా తెలిసిపోతుందో ఆ నోటికి... నమల్లేడు గాని రుచి పట్టేస్తాడు చప్పరిస్తూనే... అక్కడ నుంచి మొహం మీదే ఉమ్ముతాడు... దరిద్రుడు..‘‘క్రిష్ణా... ఒసేవ్‌... ఎక్కడ చచ్చావే...’’ లోపల నుంచి శివమూర్తి అరుపులు.మరుగుతున్న నీళ్ళు పట్టుకెళ్ళి ముఖం మీద పొయ్యాలన్నంత కోపం వచ్చింది. విసురుగా స్టౌ మీంచి దించింది. 

కోపం తగ్గలేదు. ఊహ మారింది. జవాబివ్వకపోతే అరిచి అరిచి వాడే చస్తాడులే... అనుకుంది. నీళ్ళు, తిండీ పట్టుకుని నిదానంగా వెళ్ళింది. తిండి చూడగానే శివమూర్తి పళ్ళులేని నోరు ఆడించటం మొదలెట్టాడు. కుక్క నోరాడించటం కృష్ణవేణికి గుర్తొచ్చింది. చిన్న నవ్వు పెదవులపై... అంతలోనే ఇంత ఇన్సెన్సిటివ్‌గా మారిపోయానా అన్న కించ. కూర్చోబెట్టి తలగడ సరిచేసింది.‘‘ఇంద తిను’’ చెంచాతో నోటికి అందించింది.‘‘మొగుడంటే లెక్కలేదు కాని... గ్రాటిట్యూడ్‌ ఉందే నీకు... మసాలా సరిపోయింది...’’ మొహం మీద నవ్వు మొలిచిందా మొలిపించాడా? ఏదైతేనేం... తిండి దగ్గర ఎన్ని నకరాలు పోతాడో ఇలా అరుస్తూ కూడా... సరిగ్గా అన్నం పెట్టనన్న చావు తెలివి కాబోలు...బాగా మెక్కి... పడుకోబెడితే పడుకున్నాడు... మంచం మీద పురుగులా ఉన్నాడు... దుప్పటి కాళ్ళమీద సరిగ్గా కప్పలేదని తిట్లు... తిన్నవి సింకులో పడేసి వచ్చింది... ఈలోగా అరుపులు...‘‘ఎవడితో కులుకుతున్నావ్‌... పిలిచినా రావేం...’’‘‘పిలవమంటావా... వచ్చి పీక పిసికేస్తాడు రోగం కట్టేస్తుంది...’’ అంటూ మాత్ర కవరు చించింది.నీళ్ళు నోట్లో పోసి మాత్ర మింగించింది. సరిగ్గా మింగకపోతే రాత్రంతా వాడికి తేనుపులు... తనకి జాగరణ.