మా ఊర్లో చాలామంది ఆయన్ని దేవుడిలా పూజించేవాళ్ళు. సుఖాల్లో దేవుణ్ణి మర్చిపోయి కష్టాల్లో దేవుడా అని అందరూ అన్నట్టుగానే ఇప్పుడు మా ఊళ్ళో కష్టం వచ్చింది కాబట్టి మళ్ళీ ఆయనతో అవసరం పడింది. వెంటనే ఆయన్ను ఊళ్ళోకి తీసుకొస్తే కానీ ఇబ్బందులన్నీ తొలగిపోవని అందరూ కలిసి తీర్మానించారు.

అందుకు నన్ను రాయబారిగా ఎన్నుకున్నారు.ఆయన పేరు కరుప్పుస్వామి. మా ఊళ్ళో అంతా స్వామీ అనే పిలిచేవాళ్ళం. గట్టిగా అయి దడుగులమీద అంగుళం కూడా లేకుండా పొట్టిగా, నల్లగా మా గుళ్ళో వేణుగోపాలస్వామి లాగా ఉంటాడు. తమిళనాడులో కోయంబత్తూరు దగ్గర ఏదో ఊరు తన సొంత ఊరు అని చెప్తుండే వాడు. ఇప్పుడు కోయంబత్తూరులోనే ఉన్నాడని తెలిసింది. ఇదుగో అక్కడికే నా ప్రయాణం.నిజానికి ఆయనేం దేవుడు కాదు, బాబా అంతకన్నా కాదు. ఒక మామూలు మనిషి. అలాంటిది ఇంతమంది ఆయన్ని దేవుడిలా చూస్తున్నారంటే అది ఆయన మా గ్రామానికి చేసిన ఉపకారం వల్లనే.రైలు ముందుకు పరుగెడుతుంటే వెనక్కి వెళ్తున్న తాటి చెట్ల వెంటే నా మనస్సూ వెనక్కి పరుగు తీసింది.

దాదాపు పదీ పదిహేనేళ్ళ క్రితం మా ఊళ్ళో నీటికి కటకటగా ఉండేది. ఎండాకాలం వచ్చిం దంటే బావులు, చలమలు, చెరువులు అన్నీ ఇంకిపోయేవి. ఆడవాళ్ళు మైళ్ళ దూరం నడిచి ఎక్కడెక్కడి నుంచో నీళ్ళు తెచ్చి, మట్టసంగా వాడుకునేవాళ్ళు. చుక్క నీళ్ళైనా అమృతంతో సమానంగా చూసుకునే రోజులవి.సరిగ్గా అలాంటి ఓ ఎండాకాలంలోనే మా ఊళ్ళో అడుగుపెట్టాడు కరుప్పుస్వామి. ఆ రోజు నాకు బాగా గుర్తుంది, నాన్న పంచాయతీ సమావేశంలో ఉన్నాడు. నేను పంచాయతీ ఆఫీసు బయట అరుగుమీద ఇంకెవరో పిల్లలతో ఆడు కుంటున్నాను.బాబూ... సర్పంచ్‌ సారు ఎవరు?... ఎంగే అంటూ తమిళ్‌ తెలుగు కలిపి మాట్లాడుతూ ఆ నల్లటి మనిషి నా దగ్గరకు వచ్చాడు. నేను లోపలికి తీసుకెళ్ళి చొరవగా నాన్న ఒళ్ళో చేరి, మా నాన్నే ప్రెసిడెంట్‌ అని చెప్పాను.