‘‘హీరోగారు లండన్‌ నుంచి వచ్చారంట ఊరిని ఉద్ధరించడానికి...’’ రచ్చబండ దాటుతున్న నా చెవులకు పరిహాసపు నవ్వులు తాకాయి. నేను మౌనంగా నడవటం కొనసాగించాను.ఊళ్ళోకి వచ్చి రెండు రోజులు దాటుతోంది. ఇల్లు ఓ దారికి రావాలంటే కనీసం మరో వారం రోజులు పడుతుందనుకుంటాను. ఇరవై ఏళ్ళ నుంచి పాడుపెట్టిన ఇల్లు కదా! ఊరంతా ఓ రౌండ్‌ తిరిగి ఇంటికి చేరుకునేసరికి చీకటి మరింత చిక్కగా అలుముకుంది.‘‘బాబుగోరూ రేపట్నుంచీ ఇంకో నలుగురిని ఎక్కువ పెడదామంటారా?’’ ఈసోబు వినయంగా చేతులు కట్టుకుని అడిగాడు.నేను అలాగేనన్నట్లుగా తలాడించాను. ఒకప్పుడు మా పూర్వీకులు రాచభోగంతో వెలిగిన ఇల్లు, కాలం తాలూకు రథ చక్రాల కిందపడి శిథిలం అయిపోయింది.రెండు రోజుల క్రితం ఊళ్ళోకి వచ్చినప్పుడు పరిచయం అయిన ఒకాయన హడావిడిగా వచ్చాడు ‘‘బాబూ ఎల్లుండి సాయిబుల పండగ. నాలుగు పొటేళ్ళు మసీదులో వదిలారంటే ఆళ్ళంతా మనకే గుద్దటం ఖాయం...’’ అన్నాడు కొంచెం రొప్పుతున్నట్లుగా మాట్లాడుతూ.‘‘గుద్దటం ఏంటి?’’ నేను ఆశ్చర్యంగా అడిగాను.‘‘అదేంటి బాబు అలాగంటారు? ఓట్లు.. ఊళ్ళో సాయిబుల ఓట్లు బానే ఉన్నాయి మరి...’’‘‘అయినా ఓట్ల సంగతి మనకెందుకండీ?’’ నేను మరింత ఆశ్చర్యంగా అన్నాను.‘‘అయితే మీరు లండన్‌ నుంచి వచ్చింది రాజకీయాల్లో నిలబడటానికి కాదా?’’నాకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు. 

ఎన్‌ఆర్‌ఐ సొంత ఊరికొచ్చాడంటే రాజకీయాల్లో దిగేందుకని జనం ఎలా డిసైడైపోతారో నాకు అర్థం కాలేదు.నేను రాజకీయాల్లో దిగేందుకు లండన్‌ నుంచి ఆ పల్లెటూరికి రాలేదని తెల్సిన తర్వాత ఆ పెద్ద మనిషి ముఖం వాడిపోయింది. ‘‘సుబ్బారెడ్డి కొడుకు అమెరికాలో కోట్లు సంపాదించాడు బాబూ...గత ఎన్నికల్లో పోటీ చేశాడు. ఇప్పుడు పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే..’’ అన్నాడాయన నన్ను ప్రోత్సహిస్తున్నట్టుగా.నేను సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోవడంతో కాసేపు పిచ్చాపాటీ మాట్లాడి వెళ్ళిపోయాడు.ఫఫఫలండన్‌లో నేను పేరు పొందిన అంకాలజిస్ట్‌ని అంటే కేన్సర్‌ స్పెషలిస్ట్‌...మా అమ్మ కేన్సర్‌తో బాధపడుతూ ఉంటే కీమోథెరపీ చేయటం తప్ప ఏమీ చేయలేకపోయాను. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ‘ప్రాణాలు నిలబెట్టేది డాక్టర్లు కాదు ఇంకెవరో ఉన్నారని’. అప్పుడే అమ్మ మృత్యుశయ్య మీద నన్నో కోర్కె కోరింది. దాని ఫలితమే ఈ పల్లెటూరి ప్రయాణం.