‘గేటు తీస్తే కీచుమని శబ్దం వస్తోంది. నూనె వేయాలి’ అని అనుకుంటున్నాడు రాము.‘వద్దు నాయనా... అదలానే ఉండనివ్వు. ఇంటికి ఎవరైనా వస్తే తెలుస్తుంది’ అంటూ వాడిని ఆపాను.రాము ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టే అనిపించింది. ఎందుకలా అంటున్నానంటే అటు తరువాత ఎవరైనా వస్తే గేటు కీచుమనేది. మధ్యగదిలో ఓ మూలగా కూర్చుని ఉంటాన్నేను. ప్రసాద్‌ కానీ, శంకర్‌కానీ ఇంటికి రాగానే వచ్చిందెవరో నాకు చెప్పకుండానే తెలిసిపోతుంది. హడావిడిగా గేటుకున్న బోల్టు తీసేందుకు వారు చేసేప్రయత్నం, ధడాలుమనేలా తలుపులు తోసుకుని రావటం, మళ్ళీ గేటు వెనక్కు తోయకుండా వదిలేసి వెళ్ళటం లాంటివన్నీ వారి రాకకు కొండగుర్తులే. మళ్లీ గేటు మూసేసిన చప్పుడు వినిపిస్తుందేమోనని చెవులు రిక్కిస్తాను. ఊహుఁ! అదెన్నడూ జరగదు. వారసలే తుంటరి పిల్లలు.అంతలో దబదబమని తలుపులు కొడుతున్న చప్పుడు వినిపిస్తుంది. 

ఆవిడ వంటింట్లో ఏదో పనిలో ఉంటుంది. మనిషి కంటి ముందు ఉన్నా ఆవిడకు వినిపించదు. వయస్సు పైబడుతున్న కొద్దీ ఎటువంటి చెవుడు పట్టుకుందో? ఒక్కొక్కసారి భలే తమాషాలు జరుగుతూ ఉంటాయి. ఆవిడ భోజనానికి కూర్చున్న సమయంలో శ్రీనివాసరావు వచ్చినప్పుడు అతను ఇలా అడుగుతాడు-‘‘భోజనానికి కూర్చున్నారా?’’‘‘అబ్బే, లేదు నాయనా, ఇప్పుడే భోం చేద్దామని కూర్చున్నాను’’ అంటుందీవిడ.‘‘అదేనమ్మా, మీరు భోజనానికి కూర్చున్నారా అని అడుగుతున్నాను’’.

‘‘అయ్యో, అంత అదృష్టమా నాయనా, ఇంత తొందరగా ఎక్కడ నడుం వాల్చనూ? నాలుగు ముద్దలు తిందామని ఇప్పుడే కంచం ముందు పెట్టుకుని కూర్చున్నాను. తిన్నాక, ఈ ఎంగిళ్ళు తీసి గది తుడిచి, అటు తరువాత ఓ అయిదు నిమిషాలు పడుకుంటాను అయినా ఈ ఎండ పొద్దులో కునుకు పడుతుందనే అనుకుంటున్నావేమో? అనుకోకుండా పట్టిందే అనుకో, ఇక రాత్రంతా రెప్పకు రెప్ప అంటుకోదు’’ అంటుందామె.‘‘సరిపోయిందీ అమ్మమ్మ’’ అంటూ శ్రీనివాసరావు గట్టిగా నవ్వుతాడు. నేనూ పకపకా నవ్విన తర్వాత, ఆవిడకి అర్థమౌతుంది. శ్రీనివాసరావు ఏదో అడిగితే తాను మరేదో సమాధానం చెప్పానని.‘‘ఎందుకు నాయనా నవ్వుకుంటారు? ఏమోలే నాయనా... నాకైతే ఏమీ వినపడి చావదు’’ అంటుంది.