అవును - ఎవర్నేను? నన్ను నేనర్థం చేసుకోవాలని ఈ ప్రశ్న చాలాసార్లే వేసుకున్నా. అర ్థమైనట్లే ఉంటుంది కానీ మళ్ళీ మొదటికొస్తోంది. ప్చ్‌... లాభం లేదు?లాభమంటే?ఆర్థిక ప్రయోజనాలు కావిక్కడ. మూలాలు వెతుక్కుని నా గమ్యానికి లక్ష్యాలు నిర్దేశించుకోవడం.అది సాధ్యమయ్యే పనేనా?ఎందుక్కాదు?ఎందుకంటే... మనిషివి కాబట్టి!మనిషినైనందువల్లే సునిశితంగా ఆలోచిస్తూ అన్నింటిపైనా పట్టు సాధించగలిగాను!ఆ ఆలోచనకి కొంచెం స్వార్థం కలిపితేనేగా నీది పై చేయి అయ్యింది!ఆ మాత్రం స్వార్థం లేకపోతే ఎలా?అందుకే నిన్ను నువ్వు తెలుసుకోలేవు!అలా తెలుసుకోవాలంటే?స్వార్థాన్ని వదిలేయాలి!మనుషులందరూ స్వార్థపరులేనా?ఏమో! వారి వారి అనుభవాల్లోకి తొంగిచూస్తే తెలుస్తుంది!మనుషుల అనుభవాలన్నీ ఒక్కటిగా ఉండవు కదా?కానీ... ఆ అనుభవాల సారం స్వార్థమేగా!నీ తర్కం నాకర్థంగావడం లేదు.‘అర్థం గావడం లేదనే’ ముసుగులో తప్పించుకోజూస్తున్నావు!అసంబద్ధ వాదనతో నన్ను స్వార్ధపరుడిగా చిత్రిస్తున్నావు!నువ్వు పరిపూర్ణుడివైతే నిన్నెవరు స్వార్ధరుడిని చేస్తారు? నిజాన్ని ఒప్పుకోకపోవడంతోనే ఈ చిక్కంతా!ఏది నిజం?నీ జీవితం నిజం!నా జీవితం నాదే! నీకెలా తెలుసు?నేన్నీ అంతరాత్మని గాబట్టి!నా అంతరాత్మవైతే నా చర్యల్ని సమర్థించాలి. విమర్శించకూడదు!అలాంటప్పుడు నువ్వు స్వార్ధపరుడివి కాదా?లేదు... లేదు... నన్ను తికమక పెడుతున్నావు!తికమక పడకుండా సమాధానం చెప్పేంత స్వచ్ఛత నీలో లేదు!నన్ను విమర్శించే నువ్వు నా అంతరాత్మవి కానే కావు!నువ్వు అవునన్నా కాదన్నా నేను నీ అంతరాత్మనే! ఎందుకంటే నా ప్రశ్నలన్నింటికీ ఏ విధంగానైనా సమాధానమిస్తున్నావు గదా!నన్ను నేను తెలుసుకునే దానికి ప్రయత్నిస్తున్నాను. కానీ నువ్వు అసంబద్ధ ప్రశ్నలతో నన్ను చిత్రహింసల పాల్జేస్తున్నావు!ఎవరు?.... నేనా?ఆఁ...! నువ్వే!కానేకాదు. నువ్వు నిస్వార్ధంగా ఆలోచించిన రోజున నేనేందో నీకు తెలుస్తుంది. 

నీ తల్లిదండ్రులు, నీ పుట్టుక, బాల్యం, చదువులు, పెళ్ళి, కుటుంబం... ఆ సంఘటనల్లో అన్నింటినీ కాకపోయినా కొన్నింటిని గుర్తు చేసుకో!గుర్తు చేసుకుంటే?నువ్వు స్వార్ధ పరుడివో కావో నీకే తెలుస్తుంది!నా పుట్టుక నాకెలా తెలుస్తుంది?పుట్టుకంటే నువ్వు పుట్టినప్పట్నించీ కాదు. తల్లి ఒడిలోంచి లేచి తప్పటడుగులు వేసినప్పట్నించీ!ఆఁ...! లీలగా గుర్తొస్తుంది.నీ తోబుట్టువు ఆడుకునే బొమ్మని ఈర్ష్యతో లాగేసుకున్నావు!అది ఈర్ష్య కాదు. బాల్యంలో అలాంటివన్నీ సహజమే!అలా సమర్థించుకోవడం గూడా సహజమే!నీ తోబుట్టువుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అమ్మ లాలించేటప్పుడు నీవేం చేశావు?ఏం... చేశాను?లాగిపడేసి నువ్వు కూర్చోలేదూ!బాల్యంలో జరిగే సహజ సంఘటనల్ని నువ్వు భూతద్దంలో జూపిస్తున్నావ్‌!సంఘటన చిన్నదైనా పెద్దదైనా మనిషి నైజం అది!అవి ఘోరమైన తప్పులేం కావు గదా!ఘోరమైన తప్పులని నేననడం లేదు. మనిషికి సహజంగా ఉండే ఆధిపత్య స్వభావం గురించి చెబుతున్నాను!నీకు శరీరం లేదనే కదా ఈ అక్కసంతా!నీ శరీరమే నాదైనప్పుడు నాకక్కసెందుకుంటుంది? సరే... ఆ తర్వాత జరిగిన సంఘటనల్ని గుర్తు చేసుకో!