ఇదంతా విని నేను కొంపలో నికార్సయిన ఒకటోరకం వొఠివాజెమ్మ ననుకునేవాళ్ళు తెలివితక్కువ దద్దమ్మలే. పతిదేవుడు అలా తనమాటకి కట్టుబడి పడుండటం తన పాతివ్రత్య మహిమే అని నమ్మే వెర్రి ఇల్లాలిని కానీ ఖర్చు లేకుండా సంతోషపెట్టడానికి పైకి అలా అలాగలాగే అంటే మనసొమ్మేంపోతుంది? వీధిలోకి అడుగుపెట్టాకా మనిష్టవొచ్చినట్టు తకధిమితోం తైతకమంటే అదంతా ఆవిడకి తెల్సేడుస్తుందాయేం. మొగుడ్ని గుప్పెట్లో పెట్టుకోడానికి ఈ కర్మ భూమిలో ఇల్లాళ్ళు తమవైన వెయ్యినొక్కరూల్సు పెడతారు. పెట్టుకోనివ్వండి. గవర్నమెంటు జీవోలోని కేప్టివ్‌ పదాన్ని రబ్బర్‌తో చెరిపేసినంత సులువుగా ఆ హోమ్‌ రూల్స్‌ని పక్కన పారేసి మనమగ రూల్స్‌ని మొగమహారాజుల్లా అమల్చేస్తే కొంపలు మునుగుతాయా అవటా అని పాతికేళ్ళుగా అనుకుంటూనేవున్నా ఏనాడూ అమలు చెయ్య(లే)కపోయినా. భాగ్యం ఏమందేమందీ? ఆ శ్యామల్ని కలవకూడదా? మాట్లాడకూడదా? ఏ సాయమూ చెయ్యకూడదా? ఇన్ని కూడదులు మననెత్తిన రుద్దడానికి పాపం శ్యామల అంతకాని పనేం చేసిందని? ఎవరికొంపైనా దోచిందా? ఎవర్తిమొగుడై ్ననా వల్లో వేసుకుందా? సభ్యసమాజం సిగ్గుపడే కానిపనేమైనా చేసిందా? అటువంటి పన్లేం చెయ్యలేదే. 

ఐనా శ్యామల మీద భాగ్యానికి అంత విముఖత్వం ఎందుకూ? శ్యామల అరెసై ్ట పోలీస్‌ లాకప్‌లో వున్నందుకేనా? స్వాతంత్య్ర పోరాటంలో గాంధీగారూ, అవినీతి వ్యతిరేక పోరాటంలో అన్నా హజారేలు అరెసై ్ట జైలుకెళ్ళలేదా? అరెస్టయిన వాళ్ళందరూ నేరస్థులేనా. కానీ శ్యామల దొంగనోట్ల చెలామణీకేసులో అరెస్టయినట్టు భాగ్యమే చెప్పింది. పోలీసులు అరెస్టు చేశారంటే ఉత్తినే సరదాకి ఏం తోచక చేస్తారా అనేది భాగ్యం అభియోగం, నిప్పులేనిదే పొగవస్తుందా అని సన్నాయి నొక్కులు. అటువంటి ఆడదాన్ని కలుసుకున్నా, మాట్లాడినా నా (మా)పరువుపోతుందట. అందుకేనట నేను శ్యామల్ని కలుసుకోవడంపై నిషేధం విధించడం! నిషేధించబడ్డ గదిలోకే ప్రవేశించాలనుకోవడం మానవనైజం అనే సంగతి భాగ్యం ఎరుగదు. ఆ సంగతి నా కాళ్ళకి బాగా ఎరుకే.

అందుకే అవి భాగ్యం పంపినచోటుకి కాక శ్యామల లాకప్‌లో వున్న పోలీస్‌ స్టేషన్‌కి దారితీసాయ్‌.శ్యామల ఎటువంటిదో తెల్సుకునే అవసరం కడుపునిండిన భాగ్యం లాంటి వాళ్ళకుండదు. కానీ శ్యామల ఎటువంటిదో స్కూల్లో ఏడో తరగతి నుండీ పదో తరగతి వరకు నా స్టూడెంటుగా వున్నప్పట్నుండీ తెలుసు. తక్కువ కులంలో పుట్టినందువల్ల చదువుకునే అవకాశాలకి దూరమై చదువు సంధ్యలు తక్కువైన వాళ్ళని ఈ కుల సమాజం అలగా జనాలంటుంది. ఆ నిర్వచనం ప్రకారం శ్యామల మురికి వాడలోని అలగా జనాల్లోంచి వచ్చిందే- బురదలో కమలంలా. లేడి పిల్లలా గంతులేస్తూ నవ్వుతూ తుళ్ళుతూ చదువు ధ్యాస తప్ప మరొకటెరుగని శ్యామలకి బాగా చదువుకుని మా స్కూలు ఇన్‌స్పెక్షన్‌కి వచ్చే లేడీ డి.ఇ.ఓ లా పెద్ద ఉద్యోగం చేయాలని ఆశ. అందుకే జీకే (జనరల్‌ నాలెడ్జి) , స్పోకెన్‌ ఇంగ్లీషు నేర్పమని నాకూడా పడేది.

ఆడపిల్లలంటే నాలో ఏమూలో వున్న ప్రత్యేకాభిమానం వల్ల శ్యామలకి చదువుమీదున్న శ్రద్ధని మరింత రాజేశాను-ఇంగ్లీషు గ్రామర్‌ పుస్తకాలు, డిక్షనరీలు వగైరాలు కొనిచ్చి. కానీ ఏం లాభం. చదువు విలువ తెలీని శ్యామల తల్లిదండ్రులు, మేనత్తా కలసి పదో తరగతి పరీక్షల ముందు దౌర్జన్యంగా స్కూలు మానిపించి, ఏడుస్తున్న ఆ పిల్ల మెడవొంచి ఓ తాగుబోతు వెధవచేత బలవంతంగా తాళికట్టించారు. అది నా దగ్గర కొచ్చి ఏడ్చిన ఏడుపూ, చూపించిన వొంటిమీది దెబ్బలు, దాని చెంపల మీద కన్నీటి చారికలూ నాకింకా గుర్తే. కానీ నేనేం చేయగలను. శ్యామల తల్లిదండ్రులు అల్లుడికి స్కూల్‌కి దగ్గర్లో కట్నంగా ఏర్పాటు చేసిచ్చిన కిళ్ళీబడ్డీ శ్యామల ఎక్కాల్సివచ్చింది. కష్టమూ, సంపాదనా శ్యామలది. దానిఫలం అత్తా, మొగుడిది. బడ్డీలో కూర్చున్నా శ్యామల చదువు ఆపలేదు. నా పోత్సాహంతో ప్రైవేటుగా పరీక్షకి ప్రిపేరవుతోందని గ్రహించిన ఆ తాగుబోతు మొగుడు చదివితే పెళ్ళాం చెయ్యి జారిపోతుందనే భయంతో శ్యామల్ని తన్ని పుస్తకాలు తగలబెట్టేసాడు! చూసారా సార్‌! అంది శ్యామల తట్లు దేలిన దెబ్బల్ని చూపిస్తూ. నాకు దానిమొగుడి పీక పిసికెయ్యాలన్నంత కోపం తన్నుకొచ్చింది గానీ, నిరక్ష