పట్టాలను నొక్కి పట్టుకుంటూ ముందుకు పరుగెడుతోంది రైలు. ఫస్ట్‌క్లాస్‌ ఏసి కూపేలో కార్తీక్‌,పారిజాత ఇద్దరూ మెత్తటి బెర్తుకు జారబడి తలొకపక్క చూస్తూ ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు.ఇద్దరికీ పెళ్ళి జరిగి పన్నెండు సంవత్సరాలు అయ్యింది. పది, ఎనిమిది సంవవత్సరాల వయసున్న మగపిల్లలున్నారు. కానీ, ఇప్పటికీ ఆ ఇద్దరూ నవ దంపతులే. అందం, ఆరోగ్యం, ఆకర్షణలేకాదు, చక్కని అవగాహన కూడా ఆ ఇద్దరినీ గాఢంగా అల్లుకుపోయేలా కట్టిపడేసింది. హుషారుగా, చిలిపితనానికి ప్రతీకలుగా ఉండే ఆ ఇద్దరిమధ్య అలుముకున్న ఈ మౌనానికి కారణం ఓ ఘటన.ఆ సంఘటన జరిగి ఇరవై రోజులయింది. ఆ రోజునుండి ఇద్దరూ ఆలోచనలో పడిపోయారు. ఆ ఇద్దరి జీవితాల్లోకి స్నేహితులుగా వచ్చిన మరో ఇద్దరిలో ఒకరు తెచ్చి పెట్టిన ఆలోచన అది. తెగని ఆలోచన... ఎటూ తేలని, తేల్చుకోలేని ఆలోచన.కార్తీక్‌ని అదే సిటీలో వుంటున్న రవి ఆరేళ్ళ క్రితం ఓ కాన్ఫరెన్స్‌లో కలిసినప్పుడు ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. అప్పుడు కుదిరిన స్నేహం బలపడి రవి భార్య అవని, కార్తీక్‌ భార్య పారిజాతలు కూడా స్నేహితులుగా మారిపోయారు. 

ఒకటి రెండు సంవత్సరాల తేడాతో నలుగురిదీ ఒకే వయసు కావడంతో మరింత త్వరగా కలిసిపోయారు. ఏ జంట వూరు వెళ్ళాలన్నా పిల్లల్ని రెండో జంట దగ్గర వదిలేస్తూ వుండేవారు.నలుగురూ కలిసినప్పుడు కబుర్లకు కొదవేలేదు. వ్యంగ్యాలు, విసుర్లు, వెక్కిరింతలు, వేళాకోళాలు, ఆత్మస్తుతి, అహం కారం, కల్తీలు, కల్మషాలు మచ్చుకు కూడా లేని కబుర్లవి. నలుగురూ కలిసి కూర్చునప్పుడు కష్టాలు, కన్నీళ్లు, నిరాశలు, నిట్టూర్పులు, నిస్పృహల్ని మూటకట్టి ఓ పక్కకి విసిరేసేవారు. ప్రతీ నిమిషాన్ని రేకులుగా విప్పి, ఆనంద మకరందాన్ని నలుగురూ నాలుగు పూతలుగా పూసి, ఆ తియ్యని క్షణాల కణాలని తనివి తీరా అనుభవించేవారు.

నలుగురు కలిసి ఆడే ప్రతీఆట ఆడేవారు. జంటలు మారి, రెండు జట్లుగా చేరి క్యారమ్స్‌ ఓ రోజు, పేకాట మరో రోజు, నిచ్చెనలు, పాములూ వుండే పరమ పదసోపానాల ఆట ఒకరోజు. బ్యాడ్‌మింటన్‌ ఓరోజు. అంత్యాక్షరి ఇంకో రోజు... ఇలా ఆటలకు అంతు వుండేది కాదు. ఆటలు ఇక అయిపోయాయి అనుకున్న రోజున సినిమాలు, షికార్లు, పార్కులు, రెస్టారెంట్లు.. అన్ని సరదాలు వాళ్ళవే. ఎవరింటికి ఎవరు ఎన్నిసార్లు వచ్చారన్న లెక్కలు లేవు. వంతులు లేవు. నలుగురూ ఎవ రింట్లో కలిసినా, నలుగురిదీ ఆ వంటిల్లు. నలుగురిదీ ఆ హాలు, నలుగురిదీ ఆ డైనింగ్‌ టేబుల్‌......