‘‘నాన్నా దయచేసి నన్ను ఇంకా మీ వయొలిన్‌ నేర్చుకోమని బలవంతం చేయకండి. నాకు మీరంటే గౌరవం ఉంది. మీ వయొలిన్‌ అంటే లేదు. అయినా నా ఆఫీసుకు టైమవుతోంది’’ విసుగ్గా తీవ్రంగా అన్నాడు రమేష్‌.‘‘అది కాదురా నాన్నా. సంగీతం అంటే సరస్వతిరా. ఆ తల్లిని వద్దంటామురా’’ బతిమాలుతూ అన్నాడు బాలయ్యఆ తండ్రీకొడుకులకు ఇదేమీ కొత్తకాదు. రమేషుకు ఊహ తెలిసిన దగ్గర్నించి బాలయ్య కొడుక్కి వయొలిన్‌ నే ర్పించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అయితే భర్త బాలయ్య సంగీతం అంటే భార్య విమలకు ఉన్న విముఖత ఆకొడుక్కి సంగీతం రాకుండా చేసింది. దీనికి విమలని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. పెళ్లినాటికి బాలయ్యకు ఉన్న ఒకే ఆస్తి వయొలిన్‌ వాద్యం. బాలయ్యకు సంగీతం అంటే ఉన్న అభిమానం, భవిష్యత్తులో బాలయ్య గొప్ప వయొలిన్‌ కళాకారుడవుతాడన్న నమ్మకం విమల తండ్రిని బాలయ్యవైపు మొగ్గేలా చేశాయి. అప్పుడే విమల కొత్తగా టీచర్‌గా చేరింది.బాలయ్య అద్భుతమైన వయొలిన్‌ విద్య ఉంది కానీ, ఉద్యోగానికవసరమైన విదార్హతలు లేవు. బాలయ్య పెళ్లి కానంతవరకూ ఏదో కుర్రాడులే అని ముచ్చటపడి పదో, పరకో అందరూ ఇచ్చేవారు. పెళ్లి ఆ అర్హతని లాగేసింది.అసలు బాలయ్యకు ఇలా అద్భుతంగా వయొలిన్‌ పై నాదం పలికించడం ఎలా అబ్బిందో కూడా ఎవరికీ తెలియదు. బాలయ్య చిన్నప్పుడు బాలయ్య తల్లి ఓ వయొలిన్‌ విద్వాంసుడి ఇంట్లో పనిమనిషిగా చేస్తూ ఉండేది. అప్పటికి ఐదేళ్ల వయసున్న బాలయ్యను తల్లి తనతో కూడా ఆ ఇంటికి తీసుకువెళుతూ ఉండేది. ఆవిద్వాంసుడి ఇంట్లోని వయొలిన్‌ చూడగానే బాలయ్యకు ఉత్సాహమొచ్చేది. బుడి బుడి చేతులతో కమాన్‌ తో పెడేలు మీద నాదాన్ని పలికించేవాడు. ఇది చూసి ముచ్చటపడిన ఆ విద్వాంసుడు బాలయ్యకు వయొలిన్‌ నేర్పిసాగాడు. 

అది కొంతకాలం సాగింది. వయొలిన్‌ పై నాదాన్ని సుమనోహరంగా ఎలా పలికించాలో ఆనేర్పు ఒంటపట్టింది బాలయ్యకు.ఆతర్వాత ఆ వయొలిన్‌ విద్వాంసుడు అక్కడ్నించి వెళ్లిపోతూ పిల్లవాడికి వయొలిన్‌ లో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి వయొలిన్‌ బాలయ్యకు బహూకరించి వెళ్లిపోయాడాయన.వయొలిన్‌ నాదాన్ని ఒక గురువు దగ్గర నేర్చుకోవటం అదే మొదలూ చివరా అయింది బాలయ్యకు. అప్పట్నించి ఆ వయొలిన్‌ అతని చేతిలో ఒదిగిపోవటం మొదలయింది. బాలయ్య చేతిలో కమాను అత్యంత వేగంగా కదులుతూ ఉంటే ఒక సునాదం చుట్టూ పరిమళాలు వెదజల్లుతూ వ్యాపించేవి. గురువలేని బాలయ్యకు రేడియో గురువయ్యింది, ఇరవై నాలుగ్గంటలూ అతనికి ఒకటే ధ్యాస. ఒకటే శ్వాస. రేడియోలో వచ్చే సంగీత కార్యక్రమాలు విటూ సాధన చేసేవాడు. ఎక్కడ కర్ణాటక సంగీత సభ జరిగినా ఠంచనుగా హాజరయ్యేవాడు. ఆ తర్వాత అవే కృతుల్ని తన వయొలిన్‌ పై సాధన చేసేవాడు. స్కూల్లో కూడ ప్రతి కార్యక్రమంలోనూ బాలయ్య కచ్చేరి ఉండేది.