‘నీకు ఫాంటమ్‌ లింబ్‌ అంటే తెలుసా?’ అడిగాడు డాక్టర్‌ లియాన్‌.డాక్టర్‌ లియాన్‌ ఇటలీ నుంచి వచ్చాడు. చాలా సరదాగా ఉంటాడు. ఎప్పుడూ ఏవేవో ఆసక్తికరమైన, చమత్కారమైన కథలు చెప్తూంటాడు. లియాన్‌ వల్ల ఇరాన్‌లో కూడా నవ్వగలుగుతున్నాను నేను. ఒక వ్యక్తి దురహంకారం, ఒక దేశ ప్రజల దౌర్భగ్యంగా పరిణమించటం ఇరాన్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. నాగరీకులమనుకుంటున్న వారి అనాగరికతకు తిరుగులేని నిదర్శనం ఇరాక్‌. ఇరాక్‌లో పరిస్థితిని అంచనా వేయటానికి అంతర్జాతీయ బృందంలో సభ్యుడిగా వెళ్ళాను నేను పనిచేసే పత్రిక తరపున. అక్కడి పరిస్థితి చూస్తూంటే కడుపు తరుక్కుపోతోంది. గుండె మండిపోతోంది. నిరాశ మనసుని ఆవరించి, జీవితేచ్ఛను నశింపచేస్తోంది.అటువంటి పరిస్థితులలో కూడా నవ్వుతూ, తుళ్లుతూ, కథలు చెప్తూన్నాడు లియాన్‌. ‘జీవితం ఏడుస్తూ కూచోటానికి కాదోయ్‌, నవ్వుతూ నవ్వించటానికి’ అంటాడు.

 ‘ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎలా నవ్వగలుగుతున్నావ్‌’ని అడిగితే.‘ఫాంటమ్‌ లింబ్‌ ఏమిటి, దయ్యాల అవయవమా?’ అడిగాను నవ్వుతూ.‘జర్నలిస్టువయి ఉండి ఫాంటమ్‌ లింబ్‌ అంటే తెలియదా?’ అన్నాడు లియాన్‌.‘మీ దేశంలో లాగా మా దేశంలో జర్నలిస్టంటే అన్నీ తెలిసి ఉండాల్సిన పని లేదు. ఇంతకీ ఫాంటమ్‌ లింబ్‌ అంటే ఏమిటి? అడిగాను నవ్వుతూ.‘ఇదొక మానసిక స్థితికి సంబంధించిన పదం. తిరిగే కాలూ తిట్టే నోరు ఊరుకోవంటారు చూడు అలాంటి స్థితి ఇది.’ అన్నాడు.‘అంటే?’ అడిగాను. నాకు అర్థం కాలేదు.‘శరీరం హఠాత్తుగా ఏదో అంగాన్ని కోల్పోతుంది. ఉదాహరణకి ఓ వ్యక్తి ప్రమాదం వల్ల కాలు తీసేయాల్సి వచ్చిందనుకుందాం. కాలు తీసేస్తాం. కానీ శరీరం నుంచి కాలు తీసినట్టు మెదడు గ్రహించేందుకు కాస్త సమయం పడుతుంది. మన మెదడులో ప్రతి అవయవానికి, అంగానికి, దాని పని తీరును నిర్దేశించేందుకు నిర్దిష్టమైన బాగాలు ఉంటాయి. తీసేసిన కాలుకు సంబంధించిన సమాచారం మెదడును చేరి, మెదడు ఆ నిజాన్ని జీర్ణించుకునేందుకు కాస్త సమయం అవసరం. మెదడీ నిజాన్ని గ్ర హించే వరకూ శరీరంలో అంగం భాగమేనన్నట్టు ప్రవర్తిస్తుంది. ఇలా లేకున్నా ఉన్నట్టుగానే భావన కలిగే అంగాలను ‘ఫాంటమ్‌ లింబ్స్‌ అంటారు’ సిగరెట్‌ పొగ వదుల్తూ చెప్పాడు లియాన్‌.‘నాకు సరిగ్గా అర్థం కాలేదు’ నిర్మొహమాటంగా అన్నాను.‘వెరీ సింపుల్‌. బ్రెస్ట్‌ కేన్సర్‌ వల్ల ఓ మహిళ వక్షోజాలు తొలగించినా, చాలాకాలం వరకూ అవి ఉన్నట్టే భావించుకోవటం, అపెండిక్స్‌ తొలగించిన తరువాత కూడా అవి ఉన్నట్టే భావించుకోవటం, నొప్పిని అనుభవించటం వంటివన్నీ ‘ఫాంటమ్‌ లింబ్స్‌’కి ఉదాహరణలు అన్నాడు. ‘ఏమో... లేని కాలు నొప్పిపుట్టటం, లేని చెయ్యి రాయటం... నమ్మబుద్ధి కావటం లేదు.’