గదిలో ఉన్న మాగజైన్లన్నీ మరోసారి తిరగేశాడు.సినిమాలు, రాజకీయలు, కథలు, నవలలు, జోకులు, న్యూడ్‌ ఫొటోలు, కార్టూన్‌లు... దేనిమీద అతని దృష్టి నిలవటం లేదు. ‘‘బోరు’’ అనుకున్నాడు.‘‘మీకు ప్రతీదీ బోరే’’.‘‘ఒక్క నువ్వు తప్ప’’‘‘కొంతకాలం పోతే నేనూ మీ బోర్‌ లిస్టులో ఎక్కిపోతానేమో?’’‘‘ఇంపాజిబుల్‌’’‘‘ఇప్పుడు మీరు వెంటనే కిరాణాకొట్టు కెళ్ళి ఈ సరుకుల్ని తెచ్చిపెట్టకపోతే ఈ రోజు నేను మీకు వంటచేసి పెట్టడం ఇంపాజిబుల్‌’’‘‘అబ్బా! బోర్‌ లావణ్యా’’అతడు గట్టిగా కళ్ళు మూసుకొని బెడ్‌ మీద అటు ఇటు దొర్లాడు.

 లేచి కూజా దగ్గర కెళ్ళి గ్లాసులో మంచినీళ్లు వంపాడు. గ్లాసు నోటి దగ్గర పెట్టుకున్నాడు. కానీ నీళ్ళు తాగాలనిపించలేదు. విసుగ్గా గ్లాసు టీపాయ్‌ మీద పెట్టేసి ఈజీ చైర్లో కూర్చోబోయాడు. కాని కూర్చోలేదు. గ్లాసులోని నీళ్ళను పక్కనే ఉన్న అటాచ్డ్‌ బాత్‌ రూంలో పారబోశాడు.టీపాయ్‌ పక్కనే ఉన్న నిలువుటద్దంలో పడిన అతని రూపం మీద దృష్టి పడింది. అద్దంలో తనను తాను చూసుకోవటం అతనికిష్టం.‘‘దోజ్‌ బ్యూటీపుల్‌ ఐస్‌ - దట్‌ కర్లీహేర్‌ - యువర్‌ మిస్చివస్‌ లిప్స్‌.... నువ్వు ఇంట్లోంచి బయట కెడ్తున్నావంటే భయమేస్తుంది డియర్‌-’’‘‘ఎందుకు?’’‘‘యే కొంటె పిల్లయినా ఎగరేసుకు పోతుందేమోనని’’‘‘యే మత్తుమందో చల్లి ఈ కొంటెపిల్ల తన కొంగుకు కట్టేసుకుందిగా’’‘‘యూ సిల్లీ’’!అద్దంలో తన పెదవుల్ని కసిగా ముద్దుపెట్టుకుంటున్న లావణ్య; కానీ మరుక్షణంలో తానొక్కడే.అద్దాన్ని వెయ్యి ముక్కలుగా బద్దలు కొట్టాలనిపించిందతనికి. వెంటనే ఆ అద్దం ముందు నుంచి కదిలాడు.టైమ్‌ చూశాడు.పది గంటల అయిదు నిముషాలు.ఇది వరకు చూసినప్పటికి ఇప్పటికి మూడు నిమిషాల కాలం మాత్రమే గడిచింది.కాలం కదలదు. ఈ గది నాల్గుగోడల మధ్య కాలం స్తంభించింది.

ఈ గదిలో తాను ఖైది.మళ్ళీ బెడ్‌ మీదకు చేరాడు.మళ్ళీ పత్రికలన్నీ తిరగేశాడు.మళ్ళీ టైమ్‌ చూశాడు.ఆ హోటల్‌ గది పైకప్పుకేసి, తెల్లగా వెలిగిపోతున్న ట్యూబ్‌లైట్‌ కేసి, గిరగిరా తిరుగుతున్న సీలింగ్‌ ఫ్యాన్‌కేసి చూశాడు.బోర్‌, బోర్‌, బోర్‌.అతడు బాధతో గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. కాస్సేపటికి తెరిచాడు. అకస్మాత్తుగా అతనికా గదంతా కొత్తగా, అపరిచితంగా కనిపించింది. వెంటనే అతనికి భయమేసింది.అసలు తనక్కడెందుకున్నాడు? తనకే మాత్రం పరిచయం లేని ఈ ఊరు. ఈ హోటలు గది, ఈ బెడ్డు, ఈ టేబుల్‌, ఈ టీపాయ్‌, ఈ అద్దం, ఈ కూజా, ఈ గ్లాసు, ఈ ఫ్యాను, ఈ ట్యూబ్‌లైటు వీటన్నిటి మధ్య తనెందుకున్నాడు?ఈ పెద్దహోటల్లో ఎన్నోగదులు - ఎందరో మనుష్యులు, కాని తనకు ఎవళ్ళతోను సంబంధం లేదు. ఇది తనకు తెలిసిన ప్రపంచం కాదు.