‘‘రెండు బుల్లి చేతులు వింటిని ఎక్కుపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి ఎప్పట్నుంచో. హమ్మయ్య! ఆ చేతుల ప్రయత్నం ఫలించింది. బాణాన్ని వింటికి సంధించి..లాగి.. లాగి.. వదిలేసాయ్‌, అబ్బా..!’’మూడంకె వేసి ముణగదీసుకు పడుకున్న గ ంగ కడుపులోని బిడ్డ కదలికకి ఉలిక్కిపడి కలలోంచి మెలకువలోకొచ్చింది. సూదుల్లా గుచ్చుతున్న కంకరగుట్ట మీద భారంగా వెల్లకిలా తిరిగింది. ఎర్రని అగ్నిపూల గుత్తుల మధ్య నుంచి ఎండ నిప్పుకణికల్లా కళ్లల్లోకి దూకింది. చటుక్కున మోచేతిని కళ్లమీద కప్పుకుంది. ఏదో అనుమానం వచ్చి మోచెయ్యి సందు నుంచి స్టేషను గేటువైపు చూసింది. గేటు కవతల ఫెన్సింగు కానుకుని పోర్టరు గన్నిగాడు బీడీ తాగుతూ ఆకలి కళ్లతో గంగని తినేసేలా చూస్తున్నాడు.‘చీ ఎదవా’ అని తిట్టుకుని అటు తిరిగిపోయింది గంగ. ఆమెకి వాడి చూపులేం కొత్తకాదు. ‘ఎప్పుడూ అదే యావ ఎదవ సచ్చినోడికి’ అనుకుంది. ఒకట్రెండుసార్లు ప్రయత్నించి ఆమె చేత తలమొయ్యో చివాట్లు తిని కేవలం చూపుల్తోనే తృప్తి పడుతున్నాడు ప్రస్తుతం గన్నిగాడు.పొద్దుట్నించి టీ నీళ్లైనా పడని ఖాళీ కడుపులో బిడ్డ ఆకలికి కాబోలు లుంగులు తిరుగుతోంది. చీర పొత్తిళ్లలో చేయి దూర్చి పొత్తి కడుపునోసారి తడుముకుంది గంగ. చేతి మీద చాచి తన్నిన బిడ్డ కాలుని అందుకోవాలని విఫల ప్రయత్నం చేసింది. 

కొంత సేపు ఇటు పట్టుకోబోతే అటు, అటు పట్టుకోబోతే ఇటు కదులుతున్న బిడ్డతో ఆడింది.కొంత సేపటికి విసుగొచ్చి ఆట మానేసింది.సన్నని మంటలాగా ఆకలి మొదలయింది కడుపులో. లేవడానిక్కూడా ఓపిక లేనంత నిస్సత్తువగా ఉంది. ఆకల్తోబాటు గంగని పశ్చాత్తాపం కూడా కొంచెం కొంచెంగా తినడానికి సిద్ధమైంది.అసలా బోడిదాన్తో తగువు పడకుండా ఉండాల్సింది. వాగి వాగీ దాని నోరే నెప్పెట్టి రెండు చేతులా మూసుకునేది. తగువుపడి మాత్రం తనుసాధించిందేం ఉంది? చెయ్యి వెనక్కి చాచి తలకిందున్న గుడ్డల మూట మధ్యలో పదిలంగా పాతకోకలు చుట్టిపెట్టిన గాజుపళ్లాన్నోసారి తడిమి చూసుకుంది.ఆ బోడిది విసిరిన విసురుకి గాజుపళ్లెం భళ్లుమనేదే, సమయానికి సరిగ్గా తను పట్టుకునుండకపోతే. అప్పిటికీ అంచుమీద చిన్న పెచ్చూడిపోయింది. తన ప్రాణం గిలగిలా కొట్టుకుంది. అసలా బోడిదానికి తనని ఆళ్ల కూడా తీసుకెళ్లడం ఇష్టం లేకే ఇంత నాటకమాడింది.నెమ్మదిగా లేచి చెట్టుకు చేరబడి కూర్చుంది గంగ. ఒళ్లంతా పచ్చి ముద్దలాగుంది. చేతులు ముందుకు చాపి చూసుకుంది. అది గోళ్లతో గీరిన చారలు రక్తాలు పేరుకు పోయినై. దుబ్బులాగున్న తన జుట్టుని చేతికి చుట్టుకని వంగదీసి వీపు మీద గుద్దిన గుద్దులకి తన ప్రాణం కడెక్కిపోయిన ట్టైంది. రోగిష్టిదాన్లా ఎప్పుడూ మూలుగుతూ వుండే బోడిదాని చేతుల్లో అంత బలం ఎక్కణ్ణుంచొచ్చిందో!