ఈ గాజుపూస పగిలితే నా గుండె పగిలి ముక్కలైపోతుంది - అనుకున్నాడు రవి. అందాల షోకేస్‌లో వున్న దాన్ని చూస్తూ కూర్చున్నాడు. కళ్ళవెంట నీళ్ళు కారుతున్నాయి. ధారగా ముక్కుమీద, మూతిమీద, గడ్డంకింద నీరు. రవి తుడుచుకోలేదు.వారం క్రితం ముచ్చటపడి షోకేస్‌లోని గాజుపూసను తీసి చూస్తుంటే చేయి జారి టేబిల్‌మీద పేపరు వెయిట్‌ మీద పడి ఒకపక్క చిన్న ముక్క విరిగి దూరంగా దొర్లిపోయింది. రవి గుండె కలుక్కుమంది. దొర్లిన ముక్క వెతికి క్విక్‌ఫిక్స్‌తో అతికించాడు. అతుకు కనిపిస్తూ వుంది. అయినా అఖండంగా వుంది. అతుకు బాధ కలిగిస్తూ వుంది.ఆరోజు సుమతి గుండె నొప్పి అంది. హాస్పిటల్‌లో చేరిస్తే పరీక్షలు చేశారు. బైపాస్‌ సర్జరీ చేయాలన్నారు. ఈ వారమంతా ఆమెను ఆపరేషన్‌కు సిద్ధం చేశారు.థియేటర్‌లోకి తీసుకుపోవడానికి సుమతిని సిద్ధం చేస్తుంటే ఆమెను చూడలేకపోయాడు రవి. ఐసియులో ఉన్న సుమతిని చూడడం కష్టంగా ఉంది. డాక్టర్లు, నర్సులు, రోగులు, విజిటర్లు ముందు ఏడుస్తుంటే అతడి పిల్లలు చూడలేక రవిని హోటల్‌కి తీసుకువచ్చి కూర్చోబెట్టారు. రూంలోకి వచ్చినప్పటినుంచీ గాజుపూస చూస్తూ కన్నీరుమున్నీరవుతూ కూర్చున్నాడు రవి. కొడుకు తోడుగా కూర్చున్నాడు. రవి తనకు గుండె నొప్పి వస్తుందేమో అనుకున్నాడు. పెద్దకూతురు తల్లితో వుంది. మాటిమాటికి సెల్‌లో మాట్లాడుతూనే వుంది.ఈ గాజుపూస యాభై ఏళ్ళ నుంచి తన దగ్గర భద్రంగా వుంది. 

అది అంగుళం పొడవు కూడా వుండదు. పావు అంగుళం కూడా వెడల్పుండదు. గుండ్రంగా వుంటుంది. దాని పొడుగునా పెద్ద రంధ్రం వుంది. అక్కడ కన్నుపెట్టి చూస్తేనే దాని అందం. లోపల ఎన్నో రంగులు. గుండ్రంగా తిపతూ చూస్తుంటే సప్తవర్ణాలు నీలవర్ణాలుగా మారుతూ కనబడతాయి. ఎపడు కూడా ఒకసారి కనిపించిన రంగుల కలయిక మళ్ళీ కనిపించదు. కన్ను వున్నచోటు వల్లనో, చూసే చూపువల్లనో, స్థానం, సందర్భం సమయం కలయిక వల్లనో కోటి రంగుల కూడలిగా అది కనబడుతుంది. రవి దాన్ని ఎన్నోసార్లు చూశాడు. ఎన్ని చిత్రవిచిత్ర రంగుల ప్రపంచాలు కళ్ళముందు పరచుకొనేవి. చూసిన ప్రతిసారీ పరమానందంగా, రంగుల చక్రాల భ్రమణాలు కళ్ళకు నూతన సౌందర్యాలు అతికించేవి. జీవితాంతం దాన్ని చూసుకుంటూ కాంతి వలయాలుగా రీళ్ళుగా తిరిగే రంగుల లోకాలు చూసి పులకించిపోయేవాడు రవి.