ఈ సారన్నా వచ్చాదో రాదో’’‘‘వచ్చాదిలే’’‘‘ఏమొచ్చాది.. నెత్తికి గుండా... మనకొద్దే... ఈ ఓట్లు అంటి. అబ్బుడు ఇనపరాలా నీకు. మా నారిగోడు చెప్తాండాడు, రోడ్ల పనులొచ్చాయి, లచ్చలకు లచ్చలు మిగల్తాదంట అంటివి. కడాకు ఏమాయ... గోచిపాతగూడా మిగల్లా. ముప్పైఏలు అప మిగిలె. అపలోల్లంతా యింటిమిందికొచ్చాండారు. ఎట్ల తీరచ్చావే అప’’ కోపంగా భార్యమీద రంకెలు వేశాడు సుబ్బయ్య.సుబ్బయ్య ఐదున్నరడుగుల పొడవుంటాడు. వయసు అరవై పైబడింది.బాల్యంనుంచీ రెక్కల కష్టంతో బతుకుతుండడంతో వయసు మరింత ఎక్కువగా కనిపిస్తోంది. నల్లని శరీరం, నెరిసిన వెంట్రుకలు, ముతకరంగులో వున్న తెల్లబట్టలు. చెవిలో వున్న తుంటబీడిని తీసి వెలిగించాడు. రెండు దమ్ములు లాగాడు. తన మాటలు ఎవరైనా విన్నారేమోనని యిటూ అటూ చూశాడు. అది రాయచోటి బస్టాండు. జనం గుంపులు గుంపులుగా వున్నారు. కూర్చోను బెంచీలు లేకపోవడంతో ఎక్కువమంది నిల్చొనే వున్నారు. ఎవరి తొందరలో వాళ్ళున్నారు. తను అంతగా అరుస్తున్నా వనంగా వున్న భార్యను చూస్తే కోపం యింకా ఎక్కువయింది సుబ్బయ్యకు.‘‘ముందుగాల మీ తమ్ముడు నారిగోడ్ని మెడ్తో గొడ్తే... నీకు బుద్దొచ్చాది. యిదంతా వాడు చేసిన పనే’’.‘‘వాడేంచేసె. అక్కా మామకు సాయం చేద్దామనుకుంటే యిట్లాయ’’ అంటూ తమ్ముడ్ని వెనకేసుకొచ్చింది ఎర్రమ్మ.‘‘ఏంబ్బీ ఈడుండావు’’ అంటూ వచ్చాడు రామయ్య.‘‘అబ్బ చేసిందానికి కొడుకు దేశాలు పట్టిపాయనంట. పెండ్లాం చేసిందానికి వూర్లు తిరగతాండా’’.‘‘ఎర్రమ్మా... ఏమన్నేడుమ్మే ఏజెంటు?’’‘‘యింగా ఆర్నెల్లు పడతాదంటన్నా అంపీడానికి’’‘‘పసల పండక్కు అంపతానంటాన్నె.

 మళ్ళా ఆర్నెల్లన్నేడా? ఏజెంటు మంచోడే. నిదానమయినా మంచితావన్నే పెడతాడులే. మనూరి బస్సు యింగ గంటకొచ్చాదంటబ్బీ. బజారీదికి పోదాంరా పనుండాది’’ అన్నాడు రామయ్య.‘‘ఏం పని?’’‘‘మనవరాలు వయసుకొచ్చిందంట. రేబ్బోవాల్ల. కమ్మతట్లు కొందామని రెండేలు లెక్కదెచ్చినా’’.‘‘పదా’’ అంటూ భార్య చెవులవైపు చూశాడు సుబ్బయ్య.‘‘నువ్వూ రామ్మే’’ అన్నాడు రామయ్య.‘‘వంట్లో బాగలేదన్నా... మీరు బోండి’’ అంది నిల్చున్నచోటే నేలమీద కూర్చుంటూ...మగవాళ్ళిద్దరూ అక్కడినుండి వెళ్ళిపోయారు.ఎర్రమ్మ పొడవూ కాదు పొట్టీకాదు. తలలో అక్కడక్కడా నెరిసిన వెంట్రుకలు. జుట్టుకు నూనె రాసి సవరం పెట్టుకునింది. జడలో వుదయమెపడో పెట్టుకున్న మందారం పూవు వాడిపోయింది. వక్కాకు నమిలీ నమిలీ పళ్ళు గారపట్టాయి. ముదురు ఎరుపురంగు పూలున్న లేత నీలం రంగు చీర కట్టింది. వేసుకున్న నల్లరంగు రవికె మీద చమట మరకలున్నాయి. బొడ్డులో దోపుకున్న వక్కాకు సంచిని బయటకు తీసింది. అందులోనుంచి వక్క తీసి నమిలింది. తమలపాకుకు సున్నం రాసి నోట్లో పెట్టుకుంది. సంచిలోంచి దుగ్గుతీసి నోట్లో వేసుకుని చేతులు దులుపుకుంది. అలవాటయిన పని కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి నోట్లో వేసుకుంటేగాని ఎంతెంత వేసుకున్నదో గమనించనేలేదు.చుట్టుపక్కల పల్లెల వాళ్ళంతా బస్టాండులో వుండడంతో గోలగోలగా వుంది. వీళ్ళకు బడుల నుంచి వచ్చిన పిల్లలు జతకలిశారు. వచ్చిపోయే వాహనాల హారన్‌లు. ఇవేమీ ఎర్రమ్మ పట్టించుకోలేదు. ఆమె మనసు మనసులో లేదు. రెండు సంవత్సరాల క్రితం సంఘటనలు గుర్తుకు రాసాగాయి.