ఆ దుర్గమారణ్యం ముందు నిలబడి పోయాడు అతను- తలపాగాను తీసి జుట్టును సవరించుకుంటూ, శరీరానికతుక్కుపోయిన కవచ, భుజకీర్తుల్ని సవరించుకుంటూ.ఆశ్చర్యంతోనూ, అనుమానంతోనూ శ్వాసను ఎగబీల్చాడు. అపూర్వమైన ఒక వింతైన వాసన. దానిని గుండెలనిండా పీల్చుకుంటూ, ఒక్కసారిగా చెయ్యెత్తి సైగ జేశాడు. అతన్ని అనుసరిస్తున్న పటాలం ఆగిపోయింది. అందరూ తమ తమ వస్తు సముదాయాన్ని దించి గాలిని ఎగబీల్చారు. వాళ్ళందర్నీ తాము వెతుకుతున్న వాసనొకటి చుట్టుముట్టింది.నాయకుడికి సంకేతం అందుతోంది, తాము సరైన దారిలో వచ్చినట్లే. పథకం సరిగా పన్నినట్లే, వ్యూహం కూడా అమలైతే వుచ్చు బిగుసుకున్నట్లయితే- గొప్ప నజరానా! ఆనందమేసింది. ‘అందం చూడవయా ఆనందించవయా’ అంటూ గతరాత్రి తనను కులాసపరుస్తూ నర్తకి పాడిన పాటను మనసు పాడుకుంది. అంతలోనే భయం కూడా వేసింది. గుండెలు జారుతు చిరుచెమటలు పట్టాయి. ‘ ఎక్కడున్నాం తాము?’ అంతా సాఫీగా జరుగుతుందని హామీ ఏమీ లేదుకదా’ అన్న ఆలోచన యిబ్బంది పెట్టింది.‘అయినా, ముఖా ముఖీ వాళ్ళతో ఎపడు తలపడ్డామనీ, దొంగదెబ్బలే కదా తీసింది, చాలాసార్లు’ అనే సత్యం కూడా మొదలైంది.‘మహా ఎదురైతే అవతలి పక్షపు వేగులు దొరకవచ్చు, లేదా వాళ్ళకు ఆహార పానీయాలు అందించే జానపదులు అయ్యుండచ్చు!నాయకుడి ఆలోచనలు గ్రహిస్తూ పటాలం సరంజామాను చేతుల్లోకి తీసుకుంది. దుర్గమారణ్యాల్లో గాలింపు, ‘తల దువ్వుకొనడం లాంటిది వాళ్ళకు. ఒక్క వెంట్రుక తమది రాలకుండా చాలా నాజూగ్గా చేస్తుంటారా పనిని.

 అడవుల్లో దువ్వినా, మైదానాల్లో దువ్వినా పేన్లనూ, చీమలను నలిపినట్లు తమ శత్రు ప్రాణాల్ని నిర్దాక్షిణ్యంగా హరిస్తుంటారు. బొట్టు రక్తం చిందకుండా కీర్తి కిరీటాల్నీ, నజరానాల్నీ, పతకాల్నీ సాధిస్తుంటారు. ఇట్లాంటి దుర్గమారణ్యాల్లోకీ వాటి పరిసరాల్లోకీ మృగాలై, సరీసృపాలై పరకాయ ప్రవేశం చేసి గాలిస్తుంటారు. కాటేస్తుంటారు. వీళ్ళ పరకాయ ప్రవేశం వల్లనే జానపదులు నిజమైన పామేదో, పటాలం పామేదో తెలుసుకోలేక పోతుంటారు.దుర్గమారణ్యం ముందు వాసన పీలుస్తూ నిలబడిపోయిన నాయకుడు, తన పటాలంలోని నలుగురిని పాములుగా, మరో నలుగురిని డేగలుగా మార్చి ఆచూకీ తీసుకురమ్మని పురమాయించాడు.్‌ ్‌ ్‌మధ్యాహ్నపు ఎండ పచ్చటి తీగలు పాకిన మహావృక్షాలపై పరుచుకుని, కింద నేలను పచ్చని చీకటిని కమ్మినట్లు మెరిపిస్తోంది. వింత శోభనిస్తున్న ఆ పచ్చటి మెరుపులో అటవీ ప్రాంతం ఒక మహా నిశ్శబ్దంలో వొదిగి పడుకున్న వింతమృగంలా వుంది. తెరలు తెరలుగా పరుచుకున్న భయంకర ప్రశాంతతకు నేపథ్యంలా కీచురాళ్ళ చపడూ, యింకా అపడపడు పక్షుల కలకలమూ, మృగాల అరుపులూ, ఒక్కోసారి దగ్గరగానూ, మరొకసారి దూరంగానూ వినిపిస్తున్నాయి.ఇవేవీ తమ దీక్షను భంగపరచవని చెప్పడానికన్నట్లు ఇద్దరు పశువుల కాపరులు ఒక చెట్టు నీడలోసేదదీరుతున్నారు. ఒక యువకుడు పిల్లనగ్రోవి వూదుతూంటే, మరొకతను అది వింటూ పడుకున్నాడు. వారికి దూరంగా వారు మేతకై తీసుకొచ్చిన పశువులు కొన్ని గడ్డిమేస్తూ, మరికొన్ని నెమరు వేస్తూ వున్నాయి.