మెట్రో సిటీకి పక్కనే ఒక మండల కేంద్రం.ఆ పట్టణానికి చివర పెద్ద పెంకుటిల్లు. ఆ ఇంటి చుట్టూ ప్రహారి గోడలా బారులు తీరిన పొడుగాటి కొబ్బరి చెట్లు, వాటి సమీపంలో అక్కడక్కడ ఉన్న వేప చెట్లు, జామి చెట్లు- ఆ ఇంటికి ఎంతో శోభను తెచ్చాయి. ఒకప్పుడది ఆ ఊర్లో చెప్పుకోతగ్గ గొప్ప ఇల్లయినా ఇప్పుడు శిథిలావస్థలో ఉంది... మెడలో తళుక్కుమనే గొలుసు, కళ్ళకు నల్ల గాగుల్స్‌, చేతికి రోల్డ్‌ గోల్డ్‌ఛేన్‌తో ఉన్న రిష్టు వాచి, తెల్ల లాల్చి ధోవతిదుస్తులలో జగన్నాథం పెదరాయుడిలా ఆ ఇంటి ముందు కూర్చున్నాడు, క్షణ క్షణానికిదృష్టిని రోడ్డు వైపు పోనిస్తూ.వాలు కుర్చీలో కూర్చున్న జగన్నాథం కొన్నాళ్ళు పంచాయితీ బోర్డు ప్రెసిడెంట్‌ పదవి వెలగ బెట్టాడు. ఆ రోజుల్లో అతని దర్శనం కోసం జనం క్యూలో నిలబడేవారు. చిన్న చిన్న తగవులకు కోర్టు చుట్టూ తిరగలేక ఆ ఊరి ప్రజలు తమ సమస్యలను జగన్నాథం దగ్గర మొఱపెట్టుకునేవారు.పదవి పోయింది. స్వార్థం ఎక్కువైంది- డబ్బుకు ఆశ పడి మోసాలు చేసి పరపతి పోగొట్టుకున్న జగన్నాథం దగ్గర తీర్పు చెప్పించుకోటానికి ఇప్పుడు ప్రజలు మక్కువ చూపించటం లేదు. ఫలితంగా ఆర్థిక పతనం, అప్పుల వాళ్ళ శాపనార్థాలు- సంసారం ఈదటం కష్టమైపోయింది జగన్నాథానికి. అందుకొచ్చిన కొడుకు కొరగాని కొయ్యలా తయారయాడు. 

జగన్నాథం గుణగణాలు అతను పుణికి పుచ్చుకోలేదు. ‘‘చూడు భూషణం, నీతి సూత్రాలు వేధికల మీద చెప్పటానికే పనికొస్తాయి. ఆచరణకు పనికి రావు. డబ్బు లేనిదే జీవితం గడవదు. నీకు తెలుసో తెలీదో కత్తికి లేని పదును డబ్బుకు ఉంది. డబ్బుతో ఎన్ని పనులైనా చేయొచ్చు. కింద పడబోయే మనిషి జీవితాన్ని కాపాడొచ్చు. అహంకారంతో ఆకాశంలో పరుగెత్తే పెద్ద మనుషుల జాతకాలను తలక్రిందులు చేయొచ్చు,’’ అంటూ అప్పుడప్పుడు కొడుక్కి బోధపరిచే జగన్నాథానికి... ‘‘డాడీ, నీ మాటలు నేను వినను. నిజానికి నువ్వు చేసిన ఏ పనీ నాకు నచ్చదు. తగవుల పరిష్కారం అన్న పేరుతో పేదల కడుపులు కొట్టడం నాకు చేత కాదు,’’... అని తడుముకోకుండా సమాధానమిస్తాడు భూషణం.తగవులకు సంబంధించిన పనులు తగ్గడంతో జగన్నాథం ఇప్పుడు దాదాగిరి పనులు చేపట్టాడు. పెళ్ళిళ్ళు చెడగొట్టడం, మర్డర్లు చేయించటం మొదలైన పనులలో ఇప్పుడతను చాలా బిజీ అయిపోయాడు.జగన్నాథం సిగరెట్‌ పొగ వొదుల్తూ రోడ్డు వైపు చూశాడు. రోడ్డు నుండి కిందకు దిగి వచ్చిన మారుతీ కారు తన వాకిట్లో ఆగింది. జగన్నాథం లేచి కారు దగ్గరకి పరుగెత్తాడు. అప్పుడే కారు డోరు తెరిచి వాకిట్లో అడుగు పెట్టాడు ఒక పెద్ద మనిషి. డబ్బున్న మారాజులా కనిపించే అతని వయసు నలభైకి అటు ఇటు ఉండొచ్చు.