కుండపోతగా వర్షం కురుస్తోంది. దానికి తోడు హోరు గాలి. ఆ వర్షంలో ఆర్టీసీ బస్సు ఏటి ఒడ్డున ఆగింది. అంతలోనే కండక్టర్‌ ‘కొత్తపేట జంక్షన్‌. త్వరగా దిగాలి’ అంటూ గట్టిగా అరిచాడు. నేను బ్రీఫ్‌ కేస్‌ తీసుకొని బస్సు దిగాను. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో అక్కడ నిర్మానుష్యంగా ఉంది. బస్సు దిగానే కానీ ఆ వర్షంలోఏం చెయ్యాలో తోచటం లేదు. ఎలాగైనా నేను ఇప్పుడు కొత్తపేట వెళ్ళాలి. కానీ ఈ హోరు గాలిలో ఎలా?!పడవలేమైనా ఉంటాయేమోనని రేవు దగ్గరకు వెడుతుండగానే పూర్తిగా తడిసిపోయాను. ఎదురుగుండా నాగావళి పాయ ఎర్రటి బురద నీళ్ళతో పరవళ్ళు తొక్కుతోంది. అవతలి ఒడ్డున కొత్తపేట చెట్ల మధ్య కనిపిస్తోంది. ఆ రేవు దగ్గరేఉన్న చిన్న బడ్డీ కొట్టు చూరుకింద నిలబడి కొట్లో కూర్చున్న వ్యక్తిని అడిగాను అవతలి ఒడ్డుకెళ్ళటానికి పడవ వుంటుందా? అనీ. అతను నా వంక ఎగాదిగా చూసి ‘‘ఇయ్యాల మరి వుండవు. అయినా ఇంత వాన్లో పడవెలా ఎల్లుద్ది బాబూ. ఇంతకీ తమరేవూరు ఎళ్ళాలి?’’ అని అడిగాడు.‘‘కొత్తపేట’’ అన్నాను.‘‘ఈ వర్సంలో ఎల్లనేరు. అయినా సూసినారా ఏరు పొంగు తోంది’’ అన్నాడు బీడీ పొగ వదులుతూ.అప్పుడు సాయంత్రం నాలుగు దాటింది. కానీ మబ్బులు, వర్షం వల్ల ఆకాశం నల్లగా మారిపోయి చీకటి పడినట్లు కనిపించసాగింది!అలా అక్కడ పావుగంట సేపు నిలబడ్డాను. రాను రాను మరింతగా పెరిగిపోతోంది వాన. ఎందుకో ఆ దృశ్యాన్ని చూస్తూంటే నాకు అపూర్వంగా కనపించసాగింది. పడమటి నుంచి తూర్పు దిక్కుకి పారుతోంది ఏరు. 

పడమర వైపు చూస్తుంటే దూరంగా కొండల మధ్య నల్లటి ఆకాశం కింద ఎర్రటి ఏరు ఒక అద్భుతమైన వర్ణ చిత్రంలా కనిపించసాగింది. నింగీ నేలా ఏకమైనట్లు వాన కురుస్తోంది. రేవులో చిన్నవి, పెద్దవి పడవలు కర్రలకు కట్టేసి ఉన్నాయి. ఇక అక్కడ ఉండడం వల్ల ఉపయోగం లేదని వస్తుంటే ఏటి ఒడ్డునే కొద్ది దూరంలో ఒంటరిగా ఒక ఇల్లు కనిపించింది. ఆ వానలో తడుస్తూనే ఆ ఇంటి వైపు వెళ్ళాను. ఆ ఇల్లు చూడడానికి ఏటి ఒడ్డున నిర్మించిన పర్ణశాలలా ఉంది. ఇంటి చుట్టూ తూటికలతో కట్టిన దడి. మధ్యలో వెదురు కర్రలతో చేసిన గేటు, లోపల చాలా చెట్లు. కూరగాయల పాదులు కనిపిస్తున్నాయి. ఇంకో పక్క పంది ళ్ళపై పాకిన దొండ, ఆనప పాదులు...మధ్యలో చిన్న నుయ్యి.