రాబోయే వానరాక మోసుకొచ్చే వార్తావహునిలా చల్లటి గాలి రివ్వున వీచి, విభావరి చెంపలను స్పృశించింది.ఆ చల్లనిగాలి, ఆ వెంటే భోరుమంటూ మొదలైన వర్షం, విభావరి మనసును ఉత్తేజితం చేశాయి.ఉద్వేగ భరితమైన హృదయంతో వర్షంలోకి చూస్తుండిపోయిందామె.‘‘సృష్టిలో అన్నిటికన్నా అందమైనది వర్షమే’’ అనిపిస్తుంది విభావరికి. వానలో తడవడం ఆమెకిష్టమైన పనుల్లో ఒకటి. జీవితంలో ఇంతవరకూ విభావరి గొడుగనే వస్తువును ఎన్నడూ వాడలేదు.వర్షానికి నేలమీద రేగే దుమ్ము లాగానే మనసులో జ్ఞాపకాల మేఘాలూ ముసురుకొంటాయి. బాల్యం నాటి అనుభూతులూ, యవ్వనంలో సంఘటిల్లిన మధుర జ్ఞాపకాలూ మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వాటితోబాటూ జీవిత పయనంలో మూటలు కట్టిన బరువులూ, బాధలు గుండెను పిండుతాయి. అందుకే వర్షం గతాన్ని తెచ్చి మనముందు కుమ్మరించే జ్ఞాపకాల దొంతరలా అనిపిస్తుందామెకు.నిట్టూర్చింది విభావరి.‘జీవితం ముందు ముందుకు సాగే కొలదీ మనిషి మరింత బరువు నెత్తికెత్తుకుంటాడు’ అనుకుంది.

ఆమె ఆలోచనల్ని భంగం చేస్తూ ఫోను మోగింది. ఆత్రంగా ఫోనెత్తుకుంది. సాయంత్రమైతే ఆమె ఆత్రంగా ఎదురుచూసే ఫోన్‌ కాలది.‘‘విభావరిగారూ! ఏం చేస్తున్నారు?’’ అన్న సహదేవ్‌ పలకరింపుతో మొదలైన సంభాషణ, సన్న సన్నకాలువలు కలిసి ఉధృత ప్రవాహంగా మారినట్టు ఆమెను భావలహరిలో ముంచెత్తాయి.అలా తనకోసం తను ఓ పది నిముషాలు జీవించాక కింద నుంచి అత్తగారి పిలపు.‘‘అమ్మాయ్‌ విభా! ఇలా కిందికి రామ్మా. ఈ దశమ, ఏకాదశ అధ్యాయాలు బొత్తిగా బోధపడడం లేదు’’.ఫోనుపెట్టేసి కిందికి దిగక తప్పలేదు విభావరికి. ఈ గీతా కాలక్షేపం కేవలం తనకోసమే! తను కాలేజీ నుంచి కాస్త ఆలస్యంగా వచ్చినా, ఎవరితోనైనా ఫోన్లో రెండు నిముషాలు ఎక్కువగా మాట్లాడినట్లు అనుమానం వచ్చినా, తనకు గీతా పఠనమో, లలితా సహస్రనామాలో, ఇలాంటివేవో అవసరమని అత్తగారు తీర్మానించుకొంటారు. ఇవన్నీ చెడి పోయే వ్యక్తిని మంచి మార్గంలో పెట్టే సాధనాలని ఆమె ఉద్దేశం.గీత చేతులోకి తీసుకుంటూ అత్తగారిని పరీక్షగా చూసింది విభావరి. ఆమె కొప్పు ముడిచి మల్లెలు చుట్టింది.

పసుపు పచ్చటి మైసూరు సిల్కుచీరకు మాచింగ్‌గా ఎర్రటి జాకెట్‌ వేసుకుంది. అప్పుడామెను చూసిన వాళ్లెవరూ ‘ఆమె పురాణ కాలక్షేపంలో తన్మయత్వం చెందే వ్యక్తి’ అని అనుకోలేరు.పెద్దలను భక్తితో సేవిస్తే మోక్షం వస్తుందనీ, ఇహలోక సంబంధమైన కోరికలకు ప్రాధాన్యత నివ్వకూడదనీ, శారీరక వాంఛలన్నీ తుచ్ఛమైనవనీ చెప్పే శ్లోకాలు తనతో చదివించి చెప్పించుకొని, వాటి భావాలను మరోసారి తనకు విశద పరుస్తుంది అత్తగారు.కొన్నికొన్ని సందర్భాల్లో ఆ పురాణ పఠనానికి కేటాయించే సమయం ఇంకాస్త పెరుగుతుంది కూడా.‘తను తీవ్రంగా ద్వేషించే విషయాల్లో ఇది మొదటిది’ అనుకుంది విభావరి.