ఆదివారం విలువైంది.‘అమ్మా! సోను ఏడి?’ అడిగాను రైటింగ్‌ టేబుల్‌ ముందు కూర్చుంటూ.‘ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడులే’ తాపీగా అమ్మ సమాధానమిచ్చింది.నేను పరీక్షపేపర్లు దిద్దే పనిలో పడ్డాను. అమ్మ నా దగ్గరే ఉంటుంది. పెద్ద దిక్కుగా పెద్ద అండ. పని అంతా నేనే సముదాయించుకుంటాను. పిల్లలిద్దరికీ తలస్నానం చేయించి, టిఫిన్లు పెట్టి తయారు చేసి ఆడుకోవటానికి వదిలేశాను. పాప పెద్దది ఐదేళ్ళు స్వీటీకి. చిన్నాడు సోను. రెండున్నరేళ్ళు. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని కనిపెట్టుకున్నా సరే ఏదో ఒక అనర్థం చేసేస్తాడు. ఆ జరిగిన నష్టం ఒకెత్తు. దాన్ని సరిచేసుకోవటానికి నేను పడేపాట్లు మరొకెత్తు. నేను వర్కింగ్‌ ఉమెన్‌ కావటంతో ఆదివారం అదనపు పనులు నాకోసం తయారుగా ఉంటాయి. అన్నిటినీ ముగించాలి ఆదివారాన.ఎం.ఏ., ప్రైవేటు పేపర్లు దిద్ది త్వరగా ఇవ్వాలి. అదే అదుర్దా. ఒక విడత వంటపని పూర్తిచేసి రెండో విడతగా మిగిలిన పని మధ్యాహ్నపు భోజనాల ముందు చేయొచ్చని వాయిదా వేసి ఈ పనిలో పడ్డాను. పనిలో కొంత లీనమై చేసుకుంటున్నాను. అంతలోనే నాకు అనుమానం వచ్చింది.‘అమ్మా! సోను, స్వీటీలు ఏం చేస్తున్నారో చూడు’ చెప్పా.సమాధానం రాలేదు. అమ్మ ఓ కునుకేస్తూ ఉండి ఉంటుంది.నేను పేపర్లు దిద్దుతూ ఉండి పోయా...!కానీ....! బాబు ఎక్కడ ఏం చేస్తు న్నాడో అన్న ఆలోచన అనుమానంగా ఎదిగి.... నన్ను నిమిషం కూర్చోనివ్వ లేదు.లేచాను.

 ‘సోనూ....’ పిల్చాను.సమాధానం లేదు.ముందుగదిలోకి వస్తూ ‘స్వీటీ...’ అరిచాను.‘ఏం మమ్మీ...’ తాపీగా బదులు పలికింది.‘ఏం చేస్తున్నారురా....?!’ అడిగా .... తలుపు తీస్తూ.‘ఆడుకుంటున్నా.....!’ తన లోకంలోనుంచే పలికింది.ఆ సమాధానంలోనే ఎవరి ఆటలు వాళ్ళు ఆడుకొంటున్నారనే భావం ఉంది. సోనూ తన దగ్గర లేడన్నది అర్థం అయింది. బయటికొచ్చి చూశా. ఎక్కడా నా చిట్టి తండ్రి ఆనవాళ్ళు లేవు. కనిపించే చోటెక్కడా లేదంటా ఏదో ఓ చాటున కూర్చుని ఏదో చేయకూడని పనిచేస్తూ ఉంటాడ న్నది నాకు ఖరారయ్యింది.చిన్న పిల్లలకు నీళ్ళు మట్టి అంటే ఎంత ప్రీతో చెప్పలేం. అది అందరికీ అనుభవమే. ఇంట్లో నీటి తో ఆడటం లేదు కనుక బయట మట్టితో ఆడు తుంటాడనే నిర్ణయానికి వచ్చేశాను. ఈ రెంటితో ఆటలు నేను కాదంటాను కనుక ఏ మరుగుకో పోయి కూచొని ఉంటాడు. మట్టితో ఆటలు ఎంతో ఇష్టమో సోనుకు నేను ఎరుగుదును.కాళ్ళు బార్లా చాపుకొని చాలా ఆనందంగా మట్టితో ఆడుతూ, అడపాదడపా ఆ మట్టిని అక్షింత లల్లా చల్లుకొనటం నాకేమీ కొత్తకాదు. ఆ క్రమంలో అరుదుగానే అయినా, మా వాడు ఆ మట్టి నాణ్యతను, శ్రేష్ఠతను రుచి చూసి తేల్చేయటమూ ఉంది. పరిస్థితి అక్కడికి వచ్చేలోపు ఎవరో ఒకరం చూసి ఎంత ఏడుస్తూ గింజుకున్నా ఆపేసేవాళ్ళం. వాడి ఆటలు తల్చుకుంటుంటే ఎంత ముచ్చట గొలిపినా నాకీ క్షణం మాత్రం దిగులే అనిపించింది. బాబును వెతుక్కొంటూ ఇంటి వెనకదాకా వచ్చాను. గోడకానుకొని తొంగి చూస్తూ నిలబడ్డా ఏం చేస్తున్నాడో తెలుసుకోవటానికి.