2007వ సంవత్సరం. అక్టోబర్‌ నెల. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం శివార్లలోని ఓ పల్లెటూరు.‘‘నాన్నా..నాన్నా...’’‘‘ఏటిరా?.. ఏటయిందిరా?’’‘‘ఏనుగులు.. ఏనుగులు..’’‘‘ఏటి? ఏనుగులా?.. ఎక్కడరా?..’’‘‘అదే, మన పెద్దబుగత రాందాసుగారి చెరుకుతోటలో పడి తొక్కేస్తున్నాయి..’’‘‘నీకే ం మతి సెడిందేట్రా? పెద్ద పందుల్ని చూసి జడుసుకునుంటావు..’’‘‘కాదు నాన్న.. ఏనుగులే.. మనగుడిసెంత ఎత్తులో వున్నాయి.. నాకు భయంవే సి లగెత్తుకొచ్చీశాను..’’‘‘ఇంతకీ, గొర్రెలెక్కడరా.. ఆటినొగ్గేసి చక్కావచ్చావా?’’‘‘అయ్యింకా మేస్తన్నాయి.. నేనొక్కడినీ ఎళ ్ళలేను.. నువ్వురా.. గొర్రెల్ని తోలుకొద్దాం..’’‘‘నువ్వొఠ్ఠి బెదురు గొడ్డెధవ్విరా.. సరే, పద. లగెత్తు..’’‘‘అయిగో.. ఆ కొండవారసూడు!.. అయి ఏనుగులేనా?..’’‘‘అవున్రోయ్‌.. ఏనుగులేరా!.. అయ్యయ్యో.. చెరుకుపొలం అంతా తొక్కేస్తున్నాయిరా.. నువ్వు ఇంటికిపో.. గొర్రెల సంగతి నే జూస్తాలే!’’్‌్‌్‌‘‘రాందాసు బాబూ.. రాందాసు బాబూ..’’‘‘ఏట్రా? అలా రొప్పుతూ వస్తున్నావ్‌? ఏటయిందిరా ఎర్రన్నా?’’‘‘తవరి సెరుకుతోటలో ఏనుగులు పడి తొక్కేస్తున్నాయి..’’‘‘తాగొచ్చేవేట్రా? చెరుకుతోటలో ఏనుగులేట్రా?’’‘‘బాబూ.. సత్తెపెమాణికంగా సెబుతున్నాను.. ఆరేడు ఏనుగుల మంద సెరుకుతోటలో పడ్డాయి..’’‘‘పాతికేళ్లుగా ఈ వూళ్ళో వుంటున్నాను. ఎప్పుడూ ఏనుగుల్ని చూడలేదురా’’‘‘బాబూ.. తవరి చెరుకు కళ్ళంలో ఏనుగులు పడ్డాయి..’’‘‘ఇనండి బాబూ.. ఈరిగాడు కూడా చూసేడు..’’‘‘అరేయ్‌... పకీరుగాణ్ణి, యేసోబును పిలుచుకురా!.. రచ్చబండ దగ్గరున్నారు. పాలేళ్ళు కనిపిస్తే కర్రలు, ఈటెలు పట్టుకురమ్మని చెప్పండి.. డ ప్పు సూరిగాడికి కబురు చెప్పాలిరా.. చప్పుడు చేస్తే అవి పారిపోతాయి.. పదండ్రా.. నేనూ వస్తున్నా.. మీరు పరుగెత్తండి..’’

‘‘పదండ్రా.. పదండ్రా.. రాందాసు గారి పొలంలో ఏనుగులు పడ్డాయిట..’’‘‘ఆ! ఏనుగులా? ఎర్రిగాడేనా చెప్పేడు?’’‘‘ఎర్రిగాడు పందుల్ని చూసి ఏనుగులనుకొని వుంటాడు..’’‘‘పందులు గాదెహె.. ఏనుగులే..’’‘‘మందుమీద పందులే ఏనుగుల్లా ఆన్తాయిరా..’’‘‘మందెయ్యటానికి ఇంకా టయిముందెహె’’‘‘ఏట్రా? వాగం.. శంఖం పట్టుకొస్తున్నావేటి? మనం జాతరకెళ్ళటం లేదు.. ఏనుగుల్ని తోలటానికి పోతున్నాం..’’‘‘నా శంఖం పూరిస్తే దెబ్బతో ఏనుగులు ఎనక్కి పోవాల’’‘‘అమ్మవారి గుడి దగ్గర నుంచి దివిటీలు తీసుకురండిరా.. అయి వెలిగిస్తే ఏనుగులు పారిపోతాయి.. తొందరగా పదండి’’కోలాహలం.. కేకలు.. అరుపులు. గంటల చప్పుళ్ళు.. హుర్రే.. ఉష్‌... ఉష్‌. టర్‌.. టర్‌.. ఏనుగుల ఘీంకారాలు.. డప్పుల దరువులు.. అంతా కోలాహలం..‘‘హమ్మయ్య.. ఎళ్ళిపోయాయిరా.. ఎకరం తోట తొక్కేసి పోయాయిరా.. అరేయ్‌ ఈరిగా.. రేపు లారీల పెట్టి, చెరుకు కొట్టి లోడు చేసెయ్యండిరా.. ఫేక్టరీకి తోలేద్దాం.. రాత్రికి కూలీల్ని బెత్తాయించు’’‘‘అలాగేనండి..’’

2007వ సంవత్సరం. డిశెంబరు నెల. విజయనగరం జిల్లా కలెక్టరు కార్యాలయం.‘‘కలెట్రుబాబూ.. మీరే కాపాడాల.. మా పొలాలన్నీ నాశనమయిపోయినాయి బాబూ..’’‘‘పెతి పొద్దూ ఏనుగులు ఇరచకపడి పోతున్నాయి.. మా కంటిమీద కునుకులేదు బాబూ..’’‘‘నాది ఆరెకరాల కొబ్బరితోట.. లేత తోట బాబూ.. ఇంకో ఏడాదిలో కాపు కొస్తుందని ఆశపడ్డాను. మాయదారి ఏనుగులు అంతా పీకేశాయి..’’‘‘తాసిల్దారు బాబుతో అప్పుడే ఇరవై రోజులుగా మొరపెట్టుకుంటున్నాం.. ఆ బాబు దయతల్చలేదు. వందల ఎకరాలు నాశనమయిపోయాయి..’’