హాల్లోకి అడుగుపెట్టిన జానకిరాంని ఎదురుగా టీపాయ్‌ మీదనున్న శుభలేఖ ఆకర్షించింది.దగ్గరగా వెళ్లి తొంగి చూశాడు. రాజమండ్రిఎడ్రసుతో క్రిష్ణాజీనించి వచ్చిందది. మొత్తానికిక్రిష్ణాజీ కూతురు పెళ్లి చేస్తున్నాడన్నమాట!ఆనందమే అన్పించి కవరు విప్పి కార్డు బయటకు తీశాడు.‘‘....పవిత్ర గోదావరి తీరం రాజమహేంద్రవరంలో పుట్టి పెరిగిన మా అమ్మాయి చి.సౌ. బార్గవిని అందాల సముద్రతీరమైన విశాఖలో పుట్టి పెరిగిన చి. శైలకుమార్‌కు యిచ్చి ...పెళ్ళి!.....’’ శుభలేఖ బాపుగారి అందాల చిత్రం మీనాక్షీ సుందరేశ్వరుని ముఖ పత్రంగా అలంకరింపబడి వుంది.‘‘పెళ్లెప్పుడటా?’’ అంటూ కాఫీ కప్పుతో లోపల్నించి వచ్చింది సుమలత.‘‘ఇంకా పది రోజులుంది’’ అంటూ తేదీ చెప్పేడు. ఆ క్రిష్ణాజీ ఎవరో కూడా చెప్పేడు.‘‘మా రాణీ కూడా రాజమండ్రిలోనే వుంటోంది తెల్సుగా.

 ఎన్నాళ్ల నించో రమ్మంటోందది. మీరు మీ ఫ్రెండు కూతురి పెళ్లికి వెళ్లినట్టూ వుంటుంది....నేను రాణిని చూసినట్టూ వుంటుంది. అఫ్‌కోర్స్‌! పెళ్లికి వస్తాననుకోండి!’’ అంది సుమలత, జానకిరాంకి మరో మాట అనే అవకాశమివ్వకుండా.‘‘చూద్దాం...గోదావరి అందాల్ని పాపికొండల నడుమ చూడాలని నాకెప్పట్నించో కోరిక. అటు ఉత్తరాదిన గంగానదినీ; త్రివేణి సంగమాన్ని చూశాను. ఇటు కన్యాకుమారి వరకూ వెళ్లి మూడు సముద్రాల సంగమాన్ని చూశాను. కానీ దగ్గరున్న గోదావరి నది మీదుగా భద్రాచలం వెళ్లి ఆ శ్రీరాముడి దర్శనాన్ని మాత్రం చేసుకోలేకపోయాను. ఆయనగారి పేరుపెట్టుకున్నా కూడ. ఇప్పుడు లాంచీలో భద్రాచలం ప్రయ ణాం వీలవుతుందో లేదో గాని గోదావరి అందాల్ని మాత్రం చూడొచ్చు. అదేదో ప్రాజెక్టు వస్తే ఆ అవకాశం కూడా వుండేదేమోనని అంటున్నారు.’’ అన్నాడు జానకిరాం.‘‘మీ నోటంట ఆ మాట వచ్చింది కాబట్టి నేనూ ధైర్యం చేసి చెబుతున్నాను. ఎంచక్కా శని, ఆదివారాలు కలిసొచ్చేట్టు ఓ అయిదు రోజులు సెలవు పెట్టేయండి. పన్లో పని రాజమండ్రిలోని ప్రముఖ చిత్రాకారుడు దామెర్ల రామారావు గారి ఆర్ట్‌ గేలరీ కూడా చూసొద్దాం. నాకూ ఎన్నాళ్ళగానో వున్న కోరికది.

రవి వర్మ బొమ్మలు చూసినప్పుడల్లా నాకెందుకో దామెర్లే గుర్తుకొస్తారు. నిజంగా ఆయన తెలుగువారు గర్వించదగ్గ చిత్రకారుడు’’ అంది.‘‘నీకు ఒక్క దామర్లవారే గుర్తుకొస్తారేమోగాని రాజమండ్రిని తల్చుకున్నపుడళ్లా నాకు ఎందరెందరో....ఎన్నెన్నో గుర్తుకొస్తాయి. వీరేశలింగం గారు గుర్తుకొస్తారు. చక్కటి తెలుగు కథలు రాసిన రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు గుర్తుకొస్తారు. ఆయన రాసిన ‘వడ్లగింజలు’ కథ గుర్తుకొస్తుంది. సరస్వతీ ప్రెస్‌ గుర్తుకొస్తుంది. ప్రకాశం పంతులుగారి మీద తీసిన ‘ఆంధ్రకేసరి’ సినిమా గుర్తుకొస్తుంది. అందులో ఆరుద్ర రాసిన ‘వేదంలా గోదావరి’ పాట గుర్తుకొస్తుంది. ఒకప్పుడు ఎంతగానో వెలిగి చరిత్రపుటల్లో నిలిచిపోయిన ఊరది. ఇలాగైనా వెళ్దాంలే.’’ అన్నాడు జానకిరాం.